ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదట బెంగుళూరులో యువ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ప్రధానమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో దాన్ని అడ్డుకునేందుకు ‘సాక్షి’ దినపత్రికను ప్రారంభించాడు. కేవలం రెండు రూపాయలకే పేపర్ ఇస్తూ 13 లక్షల సర్క్యులేషన్‌తో సంచలనం సృష్టించాడు (ఇప్పుడు ఆ సర్క్యులేషన్ కాస్త తగ్గినట్లు చెప్పుకుంటున్నారు). ఇప్పుడు జగన్ దృష్టి టాలీవుడ్ మీద పడింది. మీడియా రంగంలో మాదిరిగానే తెలుగు చిత్రసీమలో ప్రవేశించడమే సంచలనం సృష్టించాలని భావిస్తున్నాడు. అందుకే తొలి సినిమాను మహేష్, సూర్య హీరోలుగా నిర్మించాలని అతను సంకల్పించాడు. రెండు భాషలకు చెందిన ఇద్దరు క్రేజీ హీరోలు ఒక సినిమాలో నటించబోవడం ఒక దశాబ్దకాలంలో ఇదే తొలిసారి. ఇప్పటికే ఆ ఇద్దరూ తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడిగా వివి వినాయక్ ఎంపికయ్యాడు. వినాయక్ మొదట్నించీ రాజశేఖరరెడ్డి అభిమాని. ఎప్పటికైనా ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించాలనేది అతని ఆశయం. తన తొలి చిత్రానికి జగన్ 48 కోట్ల రూపాయలు కేటాయించాడు. ఇంతకీ అసలెందుకు జగన్ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడు? టాలీవుడ్లో ఇద్దరు ముగ్గురు మినహా అంతా చంద్రబాబు నాయుడి జపం చేసేవాళ్లే. చిత్రసీమకు కావలసిన ప్రయోజనాలన్నీ ఇచ్చిందీ, ఇస్తున్నదీ కాంగ్రెస్ అయినప్పటికీ, పరిశ్రమ వ్యక్తులు మాత్రం చంద్రబాబుతో మిలాఖత్ అవుతుండటం వైఎస్ఆర్కు బాధను కలిగిస్తోంది. అందుకే గ్లామర్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునే క్రమంలోనే జగన్‌ను టాలీవుడ్లోకి వెళ్లమని వైఎస్ సూచించాడని చెప్పుకుంటున్నారు. జగన్ అంటే ఇప్పటికే మహేష్, రాజశేఖర్, ప్రభాస్ వంటి హీరోలకు అభిమానం. దాంతో టాలీవుడ్‌లోనూ తన హవాను సాగించగలననే గట్టి నమ్మకం జగన్‌లో వ్యక్తమవుతోంది.