Visakha Express

Rating: 2.25/5

Critic Rating: (2.25/5)

ఎక్స్‌ప్రెస్ కాదు.. గూడ్సు బండి

పదే పదే విడుదల వాయిదా పడుతూ వచ్చిన ‘విశాఖా ఎక్స్‌ప్రెస్’ ఎట్టకేలకు ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదివరకు ఎన్టీఆర్ హీరోగా ‘నా అల్లుడు’ సినిమాని డైరెక్ట్ చేసిన వరా ముళ్లపూడి (ముళ్లపూడి వెంకట రమణ గారబ్బాయి, బాపు గారి అల్లుడు) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి విశేషాలు చాలానే వున్నాయి. ఇదివరలో నెగటివ్ పాత్రలు ఎక్కువగా చేసిన రాజీవ్ కనకాల ఇందులో హీరో అయితే, కామెడీ హీరోగా అందరికీ తెలిసిన అల్లరి నరేష్ విలన్. అంతేకాదు.. ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించింది క్రేజీ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి. స్క్రీన్‌ప్లే సమకూర్చింది న్యూ జనరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఇలాంటి ప్రత్యేకతలున్న ఈ సినిమా ఒక థ్రిల్లర్. అయితే ఇటీవల వచ్చిన థ్రిల్లర్‌లలో మాదిరిగా ఇందులో ప్రేక్షకుల్ని భయభ్రాంతులకు గురిచేసే హారర్ సన్నివేశాలు ఇందులో లేవు. దర్శకుడు నెగటివ్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని కథని నడపడంవల్ల కథనంలో ఆకర్షణీయత తగ్గిపోయింది. అదే ఈ సినిమా భవితవ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశం కూడా.

కథ:

డాక్టర్ రాజా (రాజీవ్ కనకాల)కి తండ్రి మోహనరావు (కోట శ్రీనివాసరావు) పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. తాగుబోతయిన మోహనరావు తాగి రోజూ ఎవరో ఒకరితో గొడవ పడుతుంటాడు. రాజా ఎంతచెప్పినా మోహనరావు తన పద్ధతిని మార్చుకోడు. ఒకరోజు మోహనరావుకు యాక్సిడెంటయి, రాజా పనిచేసే హాస్పిటల్‌లోనే ఎడ్మిట్ అవుతాడు. ఆయన్ని ట్రీట్ చేసిన మరో సీనియర్ డాక్టర్ ఆయనకు ప్రాణాపాయం లేదని చెబుతాడు. తండ్రివల్ల ఎన్ని చికాకులెదురైనా ఆయనంటే అమిత ప్రేమున్న రాజా సంతోషిస్తాడు. ఆయనకు స్పృహ వచ్చాక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఇంజెక్షన్ ఇస్తాడు. వెంటనే మోహనరావు చనిపోతాడు. రాజా షాక్ తింటాడు. అప్పుడే నరేష్ (నరేష్) వచ్చి మోహనరావుకి యాక్సిడెంట్ చేసింది తానేననీ, రాజా ఇచ్చిన ఇంజక్షన్‌లో తాను విషం కలిపాననీ, అందుకే ఆయన చనిపోయాడనీ చెబుతాడు. తమ మధ్య ఒప్పందం ప్రకారం రాజా తండ్రిని తాను చంపాడు కాబట్టి, తన భార్యను చంపాల్సిందిగా నరేష్ డిమాండ్ చేస్తాడు. దీంతో మరింత దిగ్భ్రాంతి చెందుతాడు రాజా. మరోవైపు ఇంజక్షన్ మారడం వల్లే మోహనరావు చనిపోయాడనే రిపోర్ట్ వస్తుంది. ఆ ఇంజక్షన్ ఇచ్చింది రాజాయే కాబట్టి అతనే హంతకుడని పోలీసులు నమ్ముతారు. వారినుంచి తప్పించుకు పారిపోయిన రాజా ఏం చేశాడు? అసలు రాజా, నరేష్ మధ్య ఎప్పుడు, ఏమని ఒప్పందం కుదిరింది? నరేష్ తన భార్య చావును చూడాలని ఎందుకనుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

విశాఖా ఎక్స్‌ప్రెస్ అనే టైటిల్ వల్ల కథ ఎక్కువగా ఆ పేరున్న ట్రైన్‌లో నడుస్తుందేమోనని చాలామంది భావిస్తారు. కానీ విశాఖా ఎక్స్‌ప్రెస్ కనిపించేది కేవలం తొలి ఐదు నిమిషాలే. అందులోనే రాజా, నరేష్ ఒకరికొకరు పరిచయమవుతారు కాబట్టి, అందులోనే వారిమధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి దర్శకుడు ఈ సినిమాకి ఆ టైటిల్ నిర్ణయించాడని అనుకోవాలి. దర్శకుడు వరా కథని నెగటివ్ పాయింట్ మీదే నడిపించడం సినిమాకి చేటుని తీసుకొచ్చింది. ప్రథమార్ధం ఫర్వాలేదనిపించే రీతిలో కథనాన్ని నడిపిన ఆయన ద్వితీయార్ధంలో దాన్ని కొనసాగించలేక పోయాడు. డాక్టర్ రాజా పాత్ర చిత్రణలో లోపాలికి తోడు సెకండాఫ్‌లో సైకో  నరేష్ పాత్రమీద ఫోకస్ ఎక్కువయింది. ఫలితంగా రిలీఫ్‌నిచ్చే వినోదం తక్కువై, సీరియస్‌నెస్ ఎక్కువై సినిమా బరువుగా తయారయ్యింది. కోపంవస్తే ఎదుటివాళ్లని చితగ్గొట్టే స్వభావమున్న రాజా క్లైమాక్స్‌లో మినహా మిగతా సినిమా అంతా నరేష్ వద్ద భీరువులా మారిపోవడం మెప్పించదగ్గ రీతిలో లేదు. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలిసిన తర్వాత అతను పోలీసులని కొట్టి పారిపోవడం సరైన సన్నివేశం కాదు.

అసలు దర్శకుడు ఎంచుకున్న పాయింటే బలంగా లేదని చెప్పాలి. కథ నడిచేదేమో రాజా పాత్ర వైపునుంచి. కానీ కథకి కీలకమైన పాయింటేమో నరేష్ వైపున వుంది. ఈ రెంటిమధ్య సమన్వయం సాధించడంలో వరాలోని దర్శకుడు ఫెయిలయ్యాడు. నరేష్ వైపునున్న పాయింట్ కూడా కన్విన్సింగ్‌గా లేదు. తన పెళ్లిలో ఎవరో ఏదో చెప్పారని దాన్నిపట్టుకుని అతను రాక్షసుడిలా ప్రవర్తించడం జనాకర్షక అంశం కాదు. రాజాకి సంబంధించిన విషయాలెన్నో ఎప్పటికప్పుడు తెలుసుకునే సామర్థ్యమున్న అతను అతని నేపథ్యానికి సంబంధించి ఎందుకు అపోహకు గురవుతాడన్నదే ప్రశ్నకు సమాధానం వరాయే ఇవ్వాలి. పోలీసులనుంచి రాజా తప్పించుకున్నాక అతనికీ, పోలీసులకీ మధ్య; అతనికీ, నరేష్‌కీ మధ్య దోబూచులాటలతో సినిమా మొత్తం నడుస్తుంది. ఈ తరహా సినిమాల్లో ఉత్కంఠతకి మంచి తావే వుంటుంది. కానీ ఆ ఉత్కంఠతని కల్పించడంలో స్క్రీన్‌ప్లే రచయితా యేలేటి, సన్నివేశాల్ని అలా చిత్రీకరించిన దర్శకుడు వరా.. ఇద్దరూ విఫలమయ్యారు. వినోదం కోసం కల్పించిన అలీ పాత్రని మధ్యలో తుంచకుండా దాన్ని మరింత పెంచినట్లయితే కాస్త రిలీఫ్ దొరికి వుండేది. కథకి కీలకమైన నరేష్ భార్య సుచిత్ర (ప్రీతీ జంగియాని) పాత్ర సెకండాఫ్‌లో పరిచయం కావడం మరో లోపం. సైకోగా నరేష్ పాత్ర ప్రవర్తించే తీరు వల్ల సెకండాఫ్‌కి బాగా నష్టం వాటిల్లింది. నరేష్, రాజా, సుచిత్రల మధ్య సన్నివేశాల్లో ఆకర్షణీయత లోపించింది. ఆ సన్నివేశాలు సాదాసీదాగా వచ్చాయి. ఫలితంగా విశాఖా ఎక్స్‌ప్రెస్ కాస్తా స్లో ప్యాసింజర్‌లా తయారయ్యింది.

పాత్రధారుల అభినయం:

డాక్టర్ రాజాగా రాజీవ్ కనకాల పాత్రకి తగ్గట్లు చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. ఆవేశభరితుడిగా, తండ్రిని కోల్పోయిన కొడుకుగా భిన్న ఛాయల్ని ప్రతిభావంతంగా చూపించాడు. పాటల్లోనూ హీరోగా పనికివస్తానని అతను నిరూపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అతనివైపు నిర్మాతలు దృష్టిసారించే అవకాశాలున్నాయి. భార్యమీద అనుమానంతో సైకోగా మారిన నరేష్‌గా నరేష్ క్రూరత్వాన్ని ప్రదర్శించేందుకు కృషిచేశాడు. కానైతే అతడి ముఖం దానికి సరిపోలేదు. ఇదివరకు ‘నేను’లోనూ అతడు ఎలాంటి ప్రయోగమే చేశాడు కానీ అది కూడా బెడిసికొట్టింది. ఇప్పుడు ఇది. రాజీవ్ తండ్రిగా కోట కనిపించింది అరగంట లోపే అయినా తనకే సాధ్యమైన రీతిలో తాగుబోతు పాత్రలో జీవించాడు. సిఐగా విజయరంగరాజు చెప్పుకోతగ్గ పాత్రలో కనిపించి మెప్పించాడు. అతని అల్లుడిగా అలీ కొద్దిసేపు వినోదాన్ని అందించాడు. నరేష్ భార్యగా చేసిన ప్రీతీ జంగియానికి గానీ, రాజాని ప్రేమించే డాక్టర్ గీతగా గుల్మీ హమీద్‌కు గానీ నటించేందుకు పెద్ద అవకాశం రాలేదు. టైటిల్స్‌లో ప్రముఖంగా కనిపించిన సింధూ తులానీ సినిమాలో కనిపించింది రెండు నిమిషాల అప్రధాన పాత్రలో. రాజీవ్ స్నేహితుడిగా గిరి ప్రాముఖ్యతవున్న పాత్రని బాగానే చేశాడు.

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు పొందే టెక్నీషియన్లు ఇద్దరు. ఒకరు సంభాషణల రచయిత హర్షవర్ధన్ కాగా, మరొకరు సినిమాటోగ్రాఫర్ పి.కె.హెచ్. దాస్. టెలివిజన్‌లో ‘అమృతం’గా చిరపరిచితుడైన హర్షవర్ధన్ తన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. చాలా సన్నివేశాలకు జీవం వచ్చింది అతడి మాటలవల్లే. అతని మాటలు కోట నోట బాగా పలికాయి. రాజీవ్, ధర్మవరపు మధ్య సన్నివేశంలో అతని సంభాషణా చాతుర్యం మెప్పించింది. అయితే పలుచోట్ల అతడి కలం అదుపుతప్పి వ్యవహరించింది కూడా. దాస్ సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో వుంది. బలమైన సన్నివేశాలుంటే అతని కెమెరా పనితనం మరింతగా వెలిగేదే. స్క్రీన్‌ప్లే రచయితగా యేలేటి ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోయాడు. సినిమా అనుకున్నంత ఆసక్తిని రేకెత్తించలేక పోవడానికి కారణం కథనమే. ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ కురాకుల సంగీతం పాటల్లో కంటే సన్నివేశాలకే బాగా అమరింది.

బలాలు, లోపాలు:

రాజీవ్ కనకాల నటన, సంభాషణలు, సినిమాటోగ్రఫీ బలాలు. కథాంశం, కథనం, సన్నివేశాల కల్పన, నరేష్ పాత్ర చిత్రణ లోపాలు. ’30 రూపాయలు వేస్టుగా పెట్టాంరా’ అని తోటి స్నేహితుడితో ఒక యువ ప్రేక్షకుడు అన్నమాట చాలు.. ఈ సినిమా ఎలాగుందో చెప్పడానికి.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: