వీసా కుంభకోణంలో చిక్కుకున్న ఆశా షైనీ ఉదంతం తర్వాత విదేశాలకు వెళ్లాలనుకుంటున్న టాలీవుడ్ జనాలకి వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. చాలామంది సినిమావాళ్లకు వీసాలు ఇచ్చేందుకు విదేశీ ఎంబసీ నిరాకరించినట్లు వినిపిస్తోంది. ఇటీవల అలా వీసా సమస్యలు ఎదుర్కొన్న సినిమా ‘చింతకాయల రవి’. వెంకటేష్, అనుష్క జంటగా నటిస్తున్న ఈ సినిమాను నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఆశా షైనీ ఉదంతం తెరపైకి రాకమునుపే ఈ సినిమా షూటింగును కథ ప్రకారం అమెరికాలో జరపాలని బుజ్జి ప్లాన్ చేశారు. అయితే ఆ ఉదంతం వల్ల ఆ సినిమా యూనిట్‌కి వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఆ యూనిట్లో ఎవరైనా హామీ వుంటే అందరికీ వీసాలు మంజూరు చేస్తామని ఎంబసీ చెప్పింది. దాంతో ‘చింతకాయల రవి’.. అంటే వెంకటేష్ ముందుకొచ్చి అందరికీ హామీ వుంటానని తెలిపారు. దాంతో ఆ యూనిట్‌కు వీసాలు మంజూరయ్యాయి. సాధారణంగా ఒక హీరో ఇలాంటి దాన్ని తలనొప్పిగా భావించి, తనకేమీ పట్టనట్లు వ్యవహరించే అవకాశాలే ఎక్కువ. కానీ వెంకటేష్ అలా కాకుండా తమ వీసాల బాధ్యతను వహించడంతో యూనిట్ మొత్తం ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.