తల్లి తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు, నటి విజయశాంతి ‘తల్లి తెలంగాణ’ పేరుతో ఓ డాక్యుమెంటరీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదివరకు ఆమె ప్రధాన పాత్ర ధరించిన ‘నాయుడమ్మ’ సినిమాకి దర్శకుడైన మాధవసాయి ఈ డాక్యుమెంటరీని రూపొందించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయశాంతి శక్తివంతమైన పాత్రలు పోషించిన కొన్ని సినిమాలలోని క్లిప్పింగ్స్‌ని ఉపయోగించుకుంటూ, వివిధ సందర్భాలలో ఆమె చేసిన రాజకీయ ప్రసంగాలని జోడిస్తూ, ఆమెని కీర్తిస్తూ ఈ డాక్యుమెంటరీ తయారు కానున్నట్లు తెలిసింది. దీన్ని రానున్న రోజుల్లో ప్రచారానికి వినియోగించుకోవాలని విజయశాంతి భావిస్తున్నట్లు సమాచారం. పార్ట్‌టైమ్ రాజకీయ నాయకురాలిగా ముద్రపడిన ఆమె మునుముందు ఎక్కువ సమయమే రాజకీయాల కోసం కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఆమె ‘తల్లి తెలంగాణ’ డాక్యుమెంటరీని నిర్మిస్తునట్లు వినిపిస్తోంది.