‘షో’, ‘మిస్సమ్మ’ సినిమాలతో ఇటు ప్రేక్షకుల్నీ, అటు విమర్శకుల్నీ మెప్పించి, ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నీలకంఠ ఆ తర్వాత తీసిన సినిమాలు ఎవరినీ మెప్పించలేక పోయాయి. ప్రస్తుతం ఆయన ‘మిస్టర్ మేథావి’ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, జెనీలియా కాంబినేషన్లో ఈ సినిమాని ఆయన రూపొందించారు. ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’ సినిమాల హిట్లతో తెలుగు ప్రేక్షకుల్లో జెనీలియా మంచి క్రేజ్ పొంది ఉండడం, స్వతహాగా నీలకంఠకు ఉన్న పేరు.. ఈ సినిమా పట్ల ఆసక్తిని కలిగిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. తాజాగా ఆయన సీనియర్ హీరో వెంకటేష్‌ని కలిసి ఓ కథని వినిపించినట్లు టాలీవుడ్ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. మానవ సంబంధాలు, ఆధ్యాత్మికత అంశాల మేళవింపుతో ఈ కథని నీలకంఠ తయారు చేసినట్లు తెలిసింది. ఈ కథ వెంకటేష్‌కి నచ్చిందనీ, దాన్ని డెవలప్ చేయమని ఆయన నీలకంఠకు చెప్పారనీ సమాచారం. అన్నీ అనుకూలిస్తే యోగి డైరెక్షన్లో చేసే సినిమా తర్వాత నీలకంఠతో వెంకటేష్ పనిచేసే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.