Vaana Movie Review

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

జోరు లేని “వాన” 

ఎమ్.ఎస్. రాజు దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి, కన్నడలో అతి పెద్ద హిట్టుగా నిలిచిన చిత్రానికి రీమేక్ అనే టాక్… వెరసి వాన సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులను ఎదురు చూసేట్టు చేసింది. కానీ ఈ కన్నడ మణికి తెలుగు ప్రేక్షకులని మెప్పించేంత సీన్ లేదని తేలిపోయింది. జనవరి 15న విడుదలయిన ఈ విషాదాంత వానకి ప్రేక్షకుల నుంచి “హిట్” మార్కులు వేయించుకునే లక్షణాలు లేవు. వాన పూర్తి వివరాలు ఇవీ…

కథ:

అభి (వినయ్) తొలి చూపులోనే నందిని (మీరా చోప్రా) ప్రేమలో పడతాడు. ఆమె కోసం అన్వేషిస్తున్న అభి అనుకోకుండా ఆమె ఊరికే, ఆమె ఇంటికే వెళతాడు. అయితే అప్పటికే ఆమె పెళ్లి మరో యువకుడు గౌతమ్ తో (దిగంత్) నిశ్చయమయి పోతుంది. అభి అక్కడ ఉన్న కొద్ది రోజుల్లో నందిని కూడా అతని ప్రేమలో పడుతుంది. కానీ ఈ ప్రేమ కు పెద్దల సెంటిమెంట్ అడ్డుకట్ట వేస్తుంది. దాంతో అభి, నందిని విడిపోవాల్సి వస్తుంది.

కథనం:

ఈ కథలో కొత్తదనం కరువయింది. చాలా తెలుగు చిత్రాల్లో వచ్చిన సన్నివేశాలే ఇందులో రిపీట్ చేశారు. క్లయిమాక్స్ మాత్రమే కాస్త భిన్నంగా అనిపిస్తుంది. విషాదాంత చిత్రానికి కావాల్సిన ఫీల్ మాత్రం చిత్రంలో పూర్తిగా మిస్ అయింది. అది మొత్తం సినిమా మీద ప్రభావం చూపించింది. ప్రథమార్థం కాస్త పర్వాలేదు అనిపించినా ద్వితీయార్థంలో జోరు కొరవడింది. అలాగే సినిమాలో చెప్పుకోదగ్గ సన్నివేశం ఒక్కటీ లేదు. మన పరిశ్రమ కంటే చాలా బ్యాక్‌వర్డ్‌గా సినిమాలు రూపొందించే కన్నడ పరిశ్రమలో రూపొందిన సినిమాను యధాతధం ఫాలో అవడంతో తెలుగు ప్రేక్షకులు ఈ పాత వానని ఎంజాయ్ చేయలేకపోయారు. తెలుగు వారి భావోద్వేగాలకు తగ్గ బలం కూడా ఈ చిత్రంలో లేకపోయింది.

మరోవైపు కథ విషాదాంతం అయ్యేందుకు కావాల్సిన విషయం కూడా తక్కువయింది. హీరోయిన్ కి వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే లవ్ డ్రాప్ చేసుకుని వెళ్ళిన హీరో, అదే పని మరో వారం రోజుల తర్వాత చేస్తాడు. దీని వలన నష్టం ఏంటి? అప్పటికంటే ఇప్పుడు కొంచెం డ్రామా యాడ్ అయిందేమో కానీ అంతకు మించిన బాధ అతనికి ఏముంది అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. పైగా హీరో తొలి చూపులోనే హీరోయిన్ ని కేవలం అందం చూసి ప్రేమించడంతో అతని ప్రేమకు ఒక గౌరవం దక్కలేదు. ప్రేమ విఫలమయితే ఆ వ్యక్తిపై సానుభూతి కలగడానికి అవసరమయిన సన్నివేశం ఒక్కటీ లేదు. పైగా సినిమా నెమ్మదిగా “సాగుతూ” ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే సరికి చివర్లో అత్యావశ్యకమయిన ఫీల్ కలగలేదు. ఏడిపించాల్సిన క్లయిమాక్స్ ఏమో నవ్వుల పాలయింది.

కన్నడ సినిమా “ముంగారు మలై” లోని ముఖ్యమయిన సన్నివేశాలను తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు దీనిని మలచి ఉంటే మరింత బాగుండేది. అలా కాకుండా అక్కడి లోపాలను కూడా ఫాలో అయిపోవడంతో ఈ తొలకరి వాన కాస్తా వడగళ్ళ వానలా అనేక చోట్ల కష్టపెట్టింది.

పాత్రధారుల ప్రతిభ:

వినయ్ ఇంతకు ముందు నీ వల్లే నీ వల్లే అనే అనువాద చిత్రంతో తొలిసారి కనిపించాడు. తెలుగులో అతనికి ఇదే తొలి చిత్రం. రెండు షేడ్స్ ఉన్న పాత్రని వినయ్ బాగానే చేసాడని చెప్పాలి. అయితే పాత్ర డిమాండ్ చేసిన స్థాయి నటన అతను కనబరచలేదు. మీరా చోప్రా నటన ఫర్వాలేదు. బంగారంలో ప్రదర్శించిన అభినయం కంటే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సుమన్ చెవిటి కల్నల్‌గా ఓకే అనిపించారు. కామెడీ చేయడంలో మాత్రం ఆయన విఫలమయ్యారు. సీత పాత్ర కూడా ఇందులో కీలకమే. జయ సుధ చేసిన పాత్రకు ఆమె స్థాయి నటి అవసరం లేదనిపించింది. నరేశ్ పాత్ర చాలా లిమిటెడ్. ధర్మవరపు, పరుచూరి వెంకటేశ్వర రావు, రజిత కొంచెం కామెడీ చేశారు. అజయ్ చేసిన క్యారెక్టర్ కథలో ఇమడలేదు. ఆ పాత్ర పెట్టడం వల్ల రెండు ఫైట్స్ దండగగా పెట్టాల్సి వచ్చింది. సునీల్, ప్రభుదేవా ఒక పాటలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. కథలో ఒక ముఖ్యమయిన పాత్రని కుందేలు పోషించింది. కానీ అది కథకు ఏ విధంగా ఉపయోగ పడిందో. ఆ కుందేలుతో హీరోకు ఏర్పరచిన బంధమేంటో, చివరకు దానికి ఇచ్చిన ఆ ముగింపు ఎందుకో అర్ధం కాదు. దర్శకత్వ పరంగా వీక్ గేయా ఉన్న ఈ చిత్రాన్ని నటీనటులు నిలబెట్టే స్కోప్ ఉంది కానీ ఆ స్థాయిలో ఎవరూ నటించకపోవడం సమస్య అయింది.

సాంకేతిక వర్గం నైపుణ్యం:

కమలాకర్ సంగీతం బాగుంది. నాలుగు పాటలు ఆకట్టుకున్నాయి. అయితే అందుకు కన్నడ సంగీత దర్శకుడు మనో మూర్తిని కూడా అభినందించాలి. ఇందులో పెద్ద హిట్ అయిన రెండు పాటలను అతనే స్వరపరిచాడు. పరుచూరి సోదరుల సంభాషణలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. అయితే పతాక సన్నివేశాల్లో మరింత బరువయిన సంభాషణలు ఉండాల్సింది. శేఖర్ వి. జొసెఫ్ ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సినిమా మూడ్ కి తగ్గట్టుగా లైటింగ్ స్కీంస్ పర్‌ఫెక్ట్‌గా ఉన్నాయి. ప్రకృతిని చాలా అందంగా చిత్రీకరించారు. వాటర్ ఫాల్స్‌ను చాలా చాలా అందంగా చూపించారు.ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఈ చిత్రానికి న్యాయం చేశారు కానీ దర్శకుడి పాత్రను సమర్ధనీయంగా పోషించలేకపోయారు. ఫీల్ ప్రధానమయిన సినిమాలో దానిని క్యారీ చ్యలేకపోవడం ఆయన అపరిపక్వతను తెలియజేసింది. మరో అనుభవమున్న దర్శకుడు అయితే ఈ చిత్రాన్ని తప్పకుండా మరింత బాగా రూపొందించి ఉండేవారు.

బలాలు, బలహీనతలు:

సంగీతం, ఫోటోగ్రఫీ, నీట్‌గా సాగే ట్రీట్మెంట్, బ్యాక్‌డ్రాప్ వానకు ప్రధాన బలాలు. వీక్ స్టార్ క్యాస్ట్, డెడ్‌స్లో స్క్రీన్‌ప్లే బలహీనతలు. ప్రీ క్లయిమాక్స్ సన్నివేశాలు తేలిపోవడంతో క్లయిమాక్స్ రక్తి కట్టలేదు. యాంటీ క్లయిమాక్స్ చిత్రాలను ఇష్టపడే వారికి, ప్రేమలో విఫలమయిన వారికి ఈ చిత్రం బాగానే అనిపిస్తుంది కానీ ఇతర ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ పడతారు. పండగ సీజన్ ను ఏమాత్రం అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి. ఏ సెంటర్స్‌లో కొన్ని వారాలు కురిసినా, మాస్ కేంద్రాల్లో మాత్రం కష్టమే.

– శ్రీనిధ

 

Give your rating:

We would like to hear your comments below: