ఉదయ్ కిరణ్ హీరోగా ‘లక్షీ పుత్రుడు’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా తమిళంలో ‘వంబు సందై’గా మొదట ప్రారంభమైంది. రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఆ తర్వాత తెలుగులో పోలిశెట్టి రాంబాబు నిర్మించారు. ఆయన ఇదివరకు ‘గోపి.. గోడ మీద పిల్లి’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ షూటింగులో బాగా జాప్యం జరిగింది. దీనికి కారణం హీరో ఉదయ్ కిరణ్ అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజు షూటింగ్ జరిగితే సినిమా మొత్తం పూర్తయ్యే స్థితిలో ఉదయ్ షూటింగుకు రాకుండా మొండికేశాడనీ, ‘వియ్యాల వారి కయ్యాలు’కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడనీ ఆ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వాటి కథనం ప్రకారం ఆ సినిమా విడుదలయ్యాకే ‘లక్ష్మీ పుత్రుడు’కు ఒక రోజు కాల్షీట్ను ఉదయ్ కేటాయించాడు. దాని కోసం నిర్మాత మూడు నెలలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఇబ్బందిపడ్డ నిర్మాత చివరికి షూటింగ్ పూర్తిచేసి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు. ఈ కథనంలో నిజానిజాల సంగతి అటుంచితే ‘లక్ష్మీ పుత్రుడు’ ఉదయ్ కిరణ్కు ఒక పెద్ద పరీక్ష కానున్నది. ‘వియ్యాలవారి కయ్యాలు’ బాక్సాఫీసు వద్ద ఫెయిలవడంతో అతని సెకండ్ ఇన్నింగ్స్ ఆశలన్నీ దీనిపైనే వున్నాయి.