మన ఐటమ్ గర్ల్ ఒకామె ఇటీవల బ్యాంకాక్‌లో కాస్త హడావుడి సృష్టించినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అది చిన్న హడావుడి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందులో పోలీసుల పాత్ర కూడా వుండటమే ఇక్కడ విశేషం. ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రచారం ప్రకారం కమెడియన్లు హీరోగా నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కమెడియన్ రఘుబాబుతో బాటు ఆ ఐటమ్ గర్ల్ మీద ఒక పాటని తీశారు. ఆ పాట చిత్రీకరణ పూర్తయి తిరిగి ప్రయాణమయ్యే సమయంలో ఆ తార, ఆమె తల్లి ఎయిర్‌పోర్టులోని ఒక మేకప్ షాపులోకి వెళ్లారు. తమకి కావలసిన కాస్మొటిక్స్‌ని తీసుకుని డబ్బు చెల్లించకుండానే బయటకు వచ్చారు. అది గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ తల్లీకూతుళ్లని విచారించారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి, అక్కడ తీసుకున్న కాస్మొటిక్స్‌ని వెనక్కి ఇచ్చి, బయటపడేసరికి ఆ తల్లీకూతుళ్ల తలప్రాణం తోకలోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఒక యువ హీరో నటించిన సూపర్ హిట్ సినిమాలో ఆమె డ్యాన్స్ చేసిన పాట చాలా రోజులపాటు జనం నోళ్లమీద నానింది. ఆమె ఎవరో మీరే ఊహించండి.