శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’తో యువతరాన్ని ఆకట్టుకున్న తమన్నా తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచిందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘కాళిదాసు’ సినిమాలో ఆమె సెక్సప్పీల్ చాలామంది హీరోలకు నచ్చిందనీ, వారు ఆమెను తమ సరసన కోరుకుంటున్నారనీ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ సరసన ‘కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా’ సినిమాలో నటిస్తోంది. ఆమె నటించిన ‘నిన్న నేడు రేపు’ సినిమా జూలై 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రవికృష్ణ హీరో కాగా, అక్షర (రేఖ) ఒక హీరోయిన్గా నటించింది. తమన్నా ఇందులో ఒక ఆశ్చర్యకరమైన పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ‘హైదరాబాద్ నవాబ్స్’ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్పిఆర్ ఎంటర్టైన్మెంట్స్ బానర్‌పై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించారు. ‘కాళిదాసు’ సినిమా ఫెయిలయినా, అందులో తమన్నా అందచందాలు ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు రావడంతో తన రెమ్యూనరేషన్‌ను 50 లక్షల రూపాయలకు పెంచేసిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎవరైనా డిమాండ్ వున్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు కాబట్టి, అందులో తప్పేమిటన్నది కొంతమంది భావన. ఇలియానా కోటి అడుగుతున్నప్పుడు తమన్నా అరకోటి అడగటం న్యాయమేనన్నది వారి వాదన.