‘సంతోషం’గా సా..సా..సాగిన ‘స్వాగతం’
దర్శకుడు దశరథ్ రూపొందించిన సినిమాల్ని ఓసారి పరిశీలిస్తే కథాంశంలోనూ, సన్నివేశాల కల్పనలోనూ సున్నితత్వం, కథనంలో నెమ్మదత్వం కనిపిస్తుంటాయి. స్వతహాగా దశరథ్‌లో కనిపించే గుణాలు కూడా అవే. ఆయన కథలు ఆయన మనసుని పట్టిస్తాయి. ఆయన సినిమాల్లో కనిపించే మరో అంశం మానవ సంబంధాలు. ‘స్వాగతం’ కూడా సరిగ్గా అటువంటిదే. సరిగ్గా చెప్పాలంటే ‘సంతోషం’కి బాగా దగ్గరి పోలికలున్న చిత్రం. ఆ సినిమా కథనే కాస్త మార్చి తీశారేమోనని కూడా అనిపించే చిత్రం. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సున్నితమైన సినిమా, ఫ్యామిలీ వాల్యూస్ వున్న సినిమా రాలేదన్నది నిజం. ‘పెళ్లైన కొత్తలో’లో ఓ తరహా భర్తగా కనిపించిన జగపతిబాబు ‘స్వాగతం’లో దానికి పూర్తి భిన్నమైన భర్తగా కనిపిస్తారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో ఆయన సరసన భూమిక, అనుష్క నటించారు.
కథ:
స్వాగతం’ రెండు భాగాల్లాగా కనిపించే కథ. అమెరికాలో పదేళ్లనుంచీ నివశిస్తున్న శైలజ (అనుష్క) ఈ కథని ప్రారంభిస్తుంది. ఆమెకి తండ్రి లేడు. తల్లి లక్ష్మీ దుర్గ (సుధ), ఓ చిన్న బాబు వుంటారు. కుటుంబ పోషణ మీద పడడంతో లోన్ మీద ఒక బట్టల దుకాణం నడుపుతుంటుంది. అది సరిగా సాగదు. లోన్ తీర్చడం కోసం ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఒక పార్టీలో కృష్ణకుమార్ అలియాస్ కె.కె. (జగపతిబాబు) పరిచయమవుతాడు. అతను ఆమె ఇంటి వద్దే అద్దెకు దిగి ఆమె షాపు ఎదురుగానే మరో బట్టల దుకాణం తెరుస్తాడు. అతడికి ఒక పాప తప్ప మరెవరూ ఉండరు. మొదట అతడంటే చిటపటలాడిన శైలజ క్రమంగా అతడిపట్ల ఆకర్షితురాలవుతుంది. అతడి జీవితంలో తనకి చోటివ్వమని అంటుంది. అప్పుడు తన జీవితంలోని రహస్యాన్ని విప్పుతాడు కృష్ణ. ఇది తొలి భాగం. రెండో భాగంలో విద్య (భూమిక)తో తనకి కలిగిన పరిచయం, అది ప్రేమగా మారి, ఎలా పెళ్లికి దారి తీసిందీ వివరిస్తాడు కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కృష్ణ జీవితంలోని ఆ రహస్యం ఏమిటి? శైలజ జీవితం ఏ మలుపు తిరిగింది? అన్నది మిగతా కథ.
కథనం:
దశరథ్ సినిమాల్లో ప్రధానంగా కనిపించే లోపం స్క్రీన్‌ప్లేలో వేగం మందగించడం. దాన్ని ఈ సినిమాలోనూ ఆయన అధిగమించలేక పోయాడు. కథాంశం, పాత్రల, సన్నివేశాల కల్పన ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఉద్దేశించినవనేది స్పష్టం. ఒక్క యాక్షన్ సన్నివేశమూ లేకుండా ఫీల్ గుడ్ సినిమాగా మలచేందుకు దశరథ్ కృషి చేశాడు. కానీ కథనంలోని లోపాల వల్ల ఆ ఫీల్ ప్రేక్షకులకి అందుతుందా.. అనేది అనుమానాస్పదం. కథ ఎత్తుగడలోనే దర్శకుడు పొరబాటు చేశాడు. సినిమా మొదలైన పావుగంట దాకా కథలోని పాత్రల్ని శైలజ పాత్ర పరిచయం చేస్తున్నట్లు చూపించడం సరైన ఎత్తుగడ కాదు. ఇది అనవసరంగా ప్రేక్షకుల్లో అసహనాన్ని కలిగించే అంశం. ‘స్వాగతం’ కథ శైలజ దృష్టి కోణం నుంచి నడుస్తుంది. అందుకు తగ్గట్లే తొలి అర్ధభాగం వరకు ఆమె పాత్రకి న్యాయం జరిగింది. ఆ తర్వాత కథని ఆమె చేతుల్లోంచి లాగేశాడు కథకుడైన గోపీ మోహన్. క్లైమాక్స్‌లో చివరి ఐదు నిమిషాలు తప్పితే ద్వితీయార్ధంలో ఆమె పాత్రకి సరైన న్యాయం జరగలేదు. అంతేకాదు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే ఆమె జీవితాన్ని కృష్ణ మార్చివేసే సన్నివేశాలు ‘కల్ హో నా హో’లో షారుక్ ఖాన్, ప్రీతీ జింటాల మధ్య సన్నివేశాలకు దాదాపు కాపీ.
ఈ సినిమాకీ, ‘సంతోషం’కీ ప్రధాన తేడా అదే. ‘సంతోషం’లో శ్రియ పాత్రకి ద్వితీయార్ధంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటం వల్ల నాగార్జున భార్యగా నటించిన గ్రేసీ సింగ్ పాత్రని జనం ఎలా ఇష్టపడ్డారో శ్రియ పాత్రనీ అంతగానూ ఇష్టపడ్డారు. శ్రియ పాత్రతో పోలిస్తే అనుష్క పాత్ర అంతగా ఆకట్టుకోదు. అయితే భూమిక పాత్ర ఆకట్టుకోవడమే గాక, సానుభూతినీ సంపాదిస్తుంది. మహిళా ప్రేక్షకులైతే ఆమెని ప్రేమించేస్తారు. ఆమె నవ్వితే నవ్వుతారు. ఆమె బాధపడితే తామూ బాధపడతారు. అనుష్క, భూమిక పాత్రల తరహాల్లోనే జగపతిబాబు పాత్ర కూడా ‘సంతోషం’లోని నాగార్జున పాత్ర తరహాలోనే సాగుతుంది. ఒక్కసారి ‘సంతోషం’, ‘స్వాగతం’ సినిమాల పోలికలు చూద్దాం.
1. హీరో ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆమె చనిపోతే, మరో యువతి అతని జీవితంలో ప్రవేశిస్తుంది.
2. రెండు సినిమాల్లోనూ హీరోకి ఒక బాబు లేదా ఒక పాప ఉంటారు.
3. రెండింటిలోనూ హీరో భార్యని అమితంగా ప్రేమిస్తాడు. రెండో హీరోయిన్ ప్రేమని ఒప్పుకోడు.
4. ‘సంతోషం’లో హీరో ఊటీ నుంచి న్యూజిలాండ్‌కు వెళితే, ‘స్వాగతం’లో హీరో హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళతాడు. అంటే ఇద్దరూ ఎన్నారైలే.
5. రెండు సినిమాల్లోనూ హీరో బిడ్డకి రెండో హీరోయిన్ సన్నిహితురాలవుతుంది.
వీటి సంగతలా వుంచితే ‘స్వాగతం’లోనూ మంచి వినోదాత్మక సన్నివేశాలున్నాయి. అయితే ఇంతటి క్లీన్ స్టోరీ సినిమాలో రవిబాబు మీద చిత్రీకరించిన కామెడీ పూర్తిగా అభ్యంతరకరం. అది నిస్సందేహంగా బూతు కామెడీయే. రవిబాబు నోటివెంట వచ్చే కొన్ని బూతు మాటల్ని సెన్సార్ బోర్డు ఎలా అనుమతినిచ్చిందో బోధపడదు. సినిమాకి ఎస్సెట్ ద్వితీయార్ధమే. జగపతి, భూమిక ఒకరికొకరు దగ్గరయ్యే సన్నివేశాల చిత్రీకరణలో దశరథ్‌లోని భావుకుడు చూపించిన పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆ ఇద్దరూ జరిపే బస్ జర్నీ సినిమా అంతటికీ హైలైట్ అని చెప్పాలి. జర్నీ సన్నివేశాలను దర్శకుడు బాగా చిత్రించాడు. కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్‌ని కూడా సందర్భానుసారం అతను సమర్ధవంతంగా ఉపయోగించాడు. అర్జున్ పోషించిన శ్రీకాంత్ పాత్రని కూడా అతను కథకి కీలకంగా మార్చడంలో పరిణతిని చూపించాడు. అయితే ఆసక్తికరమైన ద్వితీయార్ధాన్ని కథ వర్తమానంలోకి వచ్చాక పొడిగించడం విసుగుని కలిగిస్తుంది. ఆ సన్నివేశాల్ని కనీసం పావుగంట మేర కుదించినట్లయితే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది.
పాత్రధారుల అభినయం:
కృష్ణకుమార్ అలియాస్ కె.కె.గా జగపతిబాబు బాగా రాణించాడు. ఆ పాత్రలో ఆయన హుందాగా ఉన్నాడు. ఆ పాత్రలోని భిన్న బావావేశాల్నీ, భిన్న ధోరణుల్నీ ఆయన బాగా ప్రదర్శించాడు. తొలి సన్నివేశాల్లో సరదాగా, ఫ్లాష్‌బ్యాక్‌లో అందుకు విరుద్ధమైన తీరుతోనూ మెప్పించాడు. గుండెల్లో విషాదాన్ని దాచుకుని పైకి నవ్వుతూ కనిపించే సన్నివేశాల్లో సామర్థ్యాన్ని చూపాడు. సినిమాలో అందరికంటే ఎక్కువ మార్కులు పొందేది మాత్రం నిస్సందేహంగా భూమికనే. మ్యారేజ్ బ్యూరో నడిపే విద్య పాత్రకి అతికినట్లు సరిపోయింది. సంతోషకర సన్నివేశాల్లో అలరించి, విషాదకర సన్నివేశాల్లో సానుభూతిని సంపాదించింది. శైలజ పాత్ర అనుష్కలోని నటిని కూడా ప్రేక్షకులకి పరిచయం చేసింది. కేవల గ్లామర్ డాల్‌గా గాక అభినయానికి పాత్రల్ని కూడా చేస్తానని ఆమె ప్రూవ్ చేసుకుంది. పాటల్లో మాత్రం గతంలో ఎన్నడూలేని రీతిలో అందాల ఆరబోతతో యువతకు కనువిందు చేసింది. అర్జున్ ఆశ్చర్యకరమైన పాత్రలో కనిపించి మెప్పించాడు. తన పాత్రకి తనే డబ్బింగ్ కూడా చెప్పాడతను. ధర్మవరపు, అలీ, వేణుమాధవ్, రమాప్రభ, రవిబాబు వినోదాన్ని పంచారు. సుధ, శరత్‌బాబు, రాధాకుమారి పరిధుల మేరకు రాణించారు.
టెక్నీషియన్ల పనితనం:
‘సంతోషం’, ‘కల్ హో నా హో’ సినిమాల స్ఫూర్తితో సాగిన కథకి వాటి తరహా కథనాన్నే స్క్రీన్‌ప్లే రచయిత గోపీ మోహన్ ఎంచుకున్నట్లు మనకి తెలుస్తుంది. అసలు కథ సాగే ద్వితీయార్ధాన్ని అతను కంట్రోల్‌లో ఉంచగలిగితే సినిమా మరింత ఎఫెక్టివ్‌గా వచ్చి వుండేది. మాటల క్రెడిట్ నివాస్, ప్రవీణ్‌లది. కొన్నిచోట్ల.. ముఖ్యంగా రవిబాబు మీద చిత్రీకరించిన సన్నివేశాల్లో కలం అదుపుతప్పి వ్యవహరించింది. టోటల్ క్లీన్ సినిమా అనే పేరు దక్కకుండా పోవడానికి ఆ సన్నివేశాలే కారణం. ఆర్పీ పట్నాయక్ సంగీతం మెలోడియస్‌గా ఉంది. వేటూరి ‘ఊహల పాటే’, కులశేఖర్ ‘కొత్త కొత్తగా వున్నదీ’ పాటలు ఆకట్టుకున్నాయి. డి. రవీంద్రబాబు సినిమాటోగ్రఫీకి వంక పెట్టాల్సిన పనిలేదు. ఎడిటర్ ఎం.ఆర్. వర్మ తన కత్తెరకు మరింత పని కల్పించివుంటే బాగుండేది.
బలాలు, లోపాలు:
కథలోని సున్నితమైన మానవ సంబంధాలు, జగపతి, భూమికల పాత్రలు, వారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, వినోదం, సంగీతం బలాలు. ఇదివరకు వచ్చిన ‘సంతోషం’, ‘కల్ హో నాహో’లని గుర్తుకు తెచ్చే పాత్రలు, సన్నివేశాలు, ప్రథమార్ధంలో కథంటూ లేకపోవడం, ద్వితీయార్ధం చివరలో కథ సా..సా..సాగడం లోపాలు. ఓవరాల్‌గా చూస్తే యువతకి అసంతృప్తినీ, ఫ్యామిలీ.. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకి సంతృప్తినీ కలిగించే చిత్రం ‘స్వాగతం’
.…యజ్ఞమూర్తి