Swagatam

Rating: 0.00/5

Critic Rating: (0.00/5)

సో సో.. స్వాగతం

రేటింగ్: 2.75/5

సంతోషం దర్శకుడు దశరథ్ తన ధోరణి మానుకుని శ్రీ చిత్రంతో యాక్షన్ బాట పట్టి దెబ్బ తిన్నాడు. మళ్లీ తిరిగి తనకు పట్టున్న ఫ్యామిలీ సెంటిమెంట్ కథను ఎంచుకుని, జగపతి బాబుని హీరోగా ఎంచుకునే సరికి, జగపతి బాబు ఈ కథకి బాగా ఎక్సయిట్ అయి నిర్మాతగా కూడా మారేసరికి "స్వాగతం" మీద సహజంగా కాస్త ఆసక్తి ఏర్పడింది. అమెరికా బ్యాక్‌డ్రాప్, భూమిక, అనుష్క లాంటి ఇద్దరు క్రేజ్ ఉన్న కథానాయికలు వెరసి "స్వాగతం"తో మరోసారి ప్రేక్షకులకి దశరథ్ సంతోషం పంచుతాడని ఆశించారు. జనవరి 25న విడుదల అయిన ఈ చిత్రం "సంతోషం" చిత్రాన్ని పోలి ఉంది కానీ ఆ సినిమా స్థాయిలో మనసుని హత్తుకోదు. కేవలం ఆడాళ్లను మెప్పించే సెంటిమెంట్ దృశ్యాలు, పర్వాలేదనిపించే ద్వితీయార్థం దీనికి ప్లస్ పాయింట్స్. స్వాగతం పూర్తి వివరాలివీ…

కథ:
న్యూయార్క్ నగరంలో సొంతంగా టెక్స్‌టైల్ దుకాణం నడుపుతూ ఈవెంట్ మేనేజర్‌గా కూడా పని చేస్తున్న శైలు (అనుష్క) అనేకానేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. ఆమె నడిపే బట్టల దుకాణం అప్పుల్లో ఉంటుంది. శైలు ప్రేమగా చూసుకునే అక్క కొడుకుని తన బావ శ్రీకాంత్ (అర్జున్) తీసుకెళ్లిపోతాడని భయపడుతూ ఉంటుంది. తన అక్కను యాక్సిడెంట్లో చంపేసి శ్రీకాంత్ మరో పెళ్లి చేసుకున్నాడని శైలు అతడిని అసహ్యించుకుంటూ ఉంటుంది. శ్రీకాంత్ స్నేహితుడు అయిన కేకే (జగపతిబాబు) ఆమె మనసు మార్చి శ్రీకాంత్‌ని తన కుటుంబంతో ఏకం చేసేందుకు వస్తాడు. అతను వచ్చిన పని పూర్తయ్యే సరికి కేకే పై మనసు పడుతుంది శైలు. అప్పటికే ఒక పాపకు తండ్రి అయిన కేకే భార్య చనిపోయిందని అనుకుంటుంది శైలు. కానీ ఆమె బ్రతికే ఉందని చెప్తాడు కేకే. మరి అతను తన భార్యకు ఎందుకు దూరంగా ఉంటున్నాడన్నది మిగిలిన కథ.

కథనం:
షారూఖ్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ సినిమా కల్ హో నాహో కథని, ఫార్మాట్ ని కాపీ చేసి దానికి కొత్త ఫ్లాష్ బ్యాక్ జోడించి ఈ కథను రూపొందించారు. ప్రథమార్థంలో దాదాపుగా ఆ హిందీ చిత్రంలోని సన్నివేశాలే కనిపిస్తాయి. అయితే ఆ సినిమా స్థాయి వినోదమే కొరవడింది. అనుష్క జాలి కథ, ఆమె కష్టాలు బోర్ కొట్టిస్తాయి. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ భాగాన్ని వీలయినంత త్వరగా చుట్టేసేందుకు దర్శకుడు ప్రయత్నించడంతో అక్కడ చిత్రీకరించిన సన్నివేశాలన్ని పేలవంగా ఉన్నాయి. కీలకమయిన సన్నివేశాలను కూడా తేల్చి పారేయడంతో ప్రేక్షకుడి సహనం నశిస్తుంది. అర్జున్ మీద అనుష్క కి ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టి ఆమె మనసుని జగపతిబాబు మార్చే సన్నివేశం తెరకెక్కించిన విధానం ఆశ్చర్యపరుస్తుంది.  కథలో… ఆ పాయింట్లో అత్యంత కీలకమయిన ఈ సన్నివేశాన్ని లాంగ్ షాట్‌లో కనీసం పాత్రధారుల ముఖాలు కూడా కనబడనివ్వకుండా తెరకెక్కించడం ఫూలిష్ థాట్. బడ్జెట్ పరిమితులు ఉన్నప్పుడు ఆ సేవింగ్స్ వేరే సీన్స్‌లో చేయాలి కానీ కథ ఔచిత్యం దెబ్బ తినేట్టుగా కక్కుర్తి ప్రదర్శించకూడదు. ప్రథమార్థం అంతా పేలవమయిన సన్నివేశాలతోనే నడుస్తొంటే ద్వితీయార్థం కూడా ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది. అయితే దర్శకుడు తనకు బడ్జెట్ పరిమితులు, టైమ్ లిమిట్స్ అవసరం లేని ఈ భాగాన్ని మాత్రం జాగ్రత్తగా తెరకెక్కించాడు. ఈ భాగంలో తెర మీద పాత్రల్లో లైఫ్ వచ్చింది. స్క్రీన్‌ప్లే కూడా సాఫీగానే సా సా…గింది. ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ పాళ్ళలో రంగరించడంతో ద్వితీయార్థం క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కారవాన్ లో జగపతిబాబు, భూమిక జర్నీ చేసే సీన్లు అసహజంగా ఉన్నా అలరిస్తాయి.

పాత్రధారుల ప్రతిభ:
ఇలాంటి పాత్రలు పోషించడం జగపతిబాబుకి కొట్టిన పిండి. చాలా ఈజీగా కేకే పాత్రని పోషించారాయన. ద్వితీయార్థంలో సీరియస్ కామెడీ ని కూడా బాగా చేశారు. అనుష్క కి అభినయానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించింది కానీ ఆమె ఆ పాత్రకు అంతగా సూట్ అయినట్టు లేదు. అనుష్క కి డబ్బింగ్ చెప్పిన కళాకారిణి ఎవరో కానీ తెలుగుని పట్టి పట్టి మాట్లాడే పద్దతి మార్చుకుంటే మంచిది. భూమిక ద్వితీయార్థంలోనే కథలో ప్రవేశించినా అంత వరకు అలముకున్న నీరసాన్ని, చీకటిని తరిమి కొట్టింది. అత్యంత సహజమయిన నటనతో ఆమె విద్య పాత్రకు జీవం పోసింది. శరత్ బాబు, సుధ వంటి సీనియర్ ఆర్టిస్టులు తమకు అలవాటయిన పాత్రల్లో నటించారు. కమెడియన్స్ ఎందరు ఉన్నప్పటికీ నవ్వించినది తక్కువ. రవిబాబు పై చిత్రీకరించిన కామెడీ చీప్ టెస్ట్ ని సూచిస్తుంది. ఆరోగ్యకరమయిన సినిమాలో ఇలాంటి అనారోగ్య హాస్యం అవసరం లేదు. అర్జున్ ముఖ్యమయిన పాత్ర పోషించారు. ఆ పాత్రలో అతని నటన కూడా బాగుంది. 

సాంకేతిక నిపుణుల పనితనం:
ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద మైనస్. సంతోషం సినిమాకు అద్భుతమయిన సంగీతాన్ని అందించి ఆ చిత్ర విజయానికి ఎంతగానో దోహదపడిన ఆర్పీ ఇప్పటి తన పతనావస్థని చాటుకునేలా చవకబారు సంగీతం అందించాడు. ఫోటోగ్రఫీ, యావరెజ్‌గా ఉంది. అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కూడా స్క్రీన్ మీద రిచ్‌నెస్ తీసుకురాలేకపోవడం ఛాయాగ్రాహకుడి లోపం. ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉండొచ్చు. సంభాషణలు సోసోగా ఉన్నాయి. కథానుసారం బలమయిన సంభాషణలకు స్కోప్ ఉంది కానీ రచయిత రాణించలేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

బలాలు లోపాలు, బాక్సాఫీస్ భవిష్యత్తు:
కథను అనుష్క పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలు పెట్టి తర్వాత ఆమెను కథ వినే పాత్రగా మలచడం దర్శక, రచయితలు బేసిక్స్ గాలికి వదిలేశారు అని తెలియజేసింది. ప్రథమార్థంలో జరిగిన డ్యామేజ్ కి రెండో సగంలో పంక్చర్లు వేసినా కానీ తొలి సగం నాసి రకంగా రూపొందింది అనే అసంతృప్తి ప్రేక్షకుల్లో చెరిగిపోదు. ఫస్ట్ హాఫ్‌ని తేలికగా తీసుకోవడం వలన ఈ చిత్రం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి ఉంటుంది. తొలి సగంలో అనుష్క పాత్ర ద్వారా యూత్ ఆడియన్స్‌ని సైతం మెప్పించే అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. దీంతో ఇప్పుడు ఈ చిత్ర భవిష్యత్తు కేవలం లేడీస్, ఫ్యామిలీస్ ఆదరణ మీద ఆధారపడుతుంది. కేవలం భూమిక, జగపతిబాబు మినహా మరో ప్లస్ పాయింట్ లేకపోవడం, వినోదం పాళ్లు తగ్గడం, సంగీతం వీక్ పాయింట్స్‌లో ఫస్ట్ ప్లేస్ పొందడం స్వాగతం చిత్రాన్ని ఎంతవరకు గెలవనిస్తాయో చూడాలి. కేవలం సిటీస్ కి పరిమితం అయ్యే ఈ చిత్రం మాస్, యువ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం అసాధ్యం.

-శ్రీనిధి

Give your rating:

We would like to hear your comments below: