‘సూర్య’ దిన పత్రిక అధినేత, సినీ నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావుకు కాలం కలిసి రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అయిన ఆయనకు ఇటు పత్రిక పరంగానూ, అటు సినీ రంగంలోనూ ఎదురు గాలులు వీస్తున్నాయి. ‘సాక్షి’ వచ్చాక ‘సూర్య’ పత్రిక సర్క్యులేషన్ అనూహ్యంగా పడిపోయింది. వ్యాపార ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయింది. మిగతా దినపత్రికలతో పోలిస్తే తమ జీతభత్యాలు బాగా తక్కువగా వున్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య పరిస్థితి ఏమంత బాగోలేదని అందులోని ఒక ఉద్యోగి తెలిపారు. ఇక చిత్ర రంగానికి వస్తే జగపతిబాబు హీరోగా ఆయన నిర్మించిన ‘బ్రహ్మాస్త్రం’ డిజాస్టరై ఆయనకు భారీ నష్టాన్ని మిగిల్చింది. విక్రమ్ హీరోగా రూపొందిన ‘భీమ’ తెలుగు హక్కుల్ని నూకారపు తీసుకున్నారు. తమిళ సినిమా ఎన్నడో విడుదలైనా తెలుగు వెర్షన్‌ను ఆయన విడుదల చేయలేకపోయారు. ఆశించిన రీతిలో బిజినెస్ కాకపోవడమే దీనికి కారణం. అలాగే రవికృష్ణ హీరోగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో ‘నిన్న నేడు రేపు’ అనే సినిమాను ఆయన నిర్మించారు. షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా ఆ సినిమాను ఆయన విడుదల చేయలేకపోతున్నారు. దానికీ బిజినెస్ సమస్యే. ఇలా ఎక్కడి పెట్టుబడి అక్కడే ఆగిపోతుండటంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా తయారయ్యిందని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.