Sundarakanda

Rating: 2.00/5

Critic Rating: (2.00/5)

‘సుందరకాండ’లో చేదెక్కువ!

బాపు సినిమా వస్తున్నదంటే అభిరుచి కలిగిన, తెలుగుతనం మీద అభిమానం వున్నవాళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల మీద చెరగని సంతకం బాపు. ఆయన కదలని బొమ్మల (చిత్రాలు) మాదిరిగానే ఆయన కదిలే బొమ్మలు (చలన చిత్రాలు) అందంగా వుంటాయనే అభిప్రాయం స్థిరపడింది. అది ఒకప్పటి మాట. బాపు చిత్రకారుడిగా ఇప్పటికీ గొప్పవాడే కానీ సినీ దర్శకుడి విషయానికొస్తే ఆ అభిప్రాయాన్ని ఇక మార్చుకోక తప్పదు. ఎందుకంటే ‘సుందరకాండ’ ఆ తీరున వుంది కనుక. మూడేళ్ల క్రితం వచ్చిన ‘రాధా గోపాళం’తోటే బాపు దర్శకత్వం పట్ల విమర్శకులు కాస్త పెదవి విరిచారు. ‘సుందరకాండ’ సాధారణ ప్రమాణాలపరంగా చూసినా కథ విషయంలోనూ, చిత్రీకరణ విషయంలోనూ చాలా అసంతృప్తిని కలిగించిందని చెప్పడం సాహసం కాబోదు. ఆద్యంతం తప్పుల తడక ‘సుందరకాండ’.

కథ:

సీత (ప్రేమ), పింకీ అనే ముద్దుపేరున్న అన్నపూర్ణ (ఛార్మి) తల్లీకూతుళ్లు. పెళ్లిళ్లని జరిపించే ఓ కంపెనీలో సీత కిచెన్ ఇన్‌ఛార్జ్ అయితే, పింకీ మ్యూజిక్ ఇన్‌ఛార్జ్. పదహారేళ్లకి తల్లి ప్రేమకథని విని, పెళ్లయిన వెంటనే తల్లిని దూరం చేసుకున్న తండ్రి రాజా రామ్‌గోపాలవర్మ (సునీల్ వర్మ) కళ్లు తెరిపించి, తల్లినీ తండ్రినీ దగ్గర చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి బొబ్బిలికి వెళుతుంది పింకీ. తనెవరో వర్మకి చెప్పి అతని కోటలోనే పాగా వేస్తుంది. వర్మ చాల మంచివాడు. తల్లి, మామ కారణంగా సీతని అపార్ధం చేసుకున్నాడే గానీ అమెని మరచిపోలేదు. అందుకే మరో పెళ్లి చేసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ సాధించి, ముఖ్యమంత్రి అవుతాడనే అభిప్రాయం అందరిలో వుంటుంది. కానీ ఆయనకి చింతకోట మాధవయ్య (కోట శ్రీనివాసరావు) అనే ప్రత్యర్థి వున్నాడు. పార్టీ టికెట్ తనే సాధించి, ముఖ్యమంత్రి అయి జనాన్ని దోచుకోవాలనేది కోట ఆలోచన. తనెవరనే నిజాన్ని తెలీనీకుండా కోట అభిమానాన్ని సంపాదించిన పింకీ అతడిచేత తప్పులు చేయించి లోకల్ ప్రెస్ రిపోర్టర్ (నరేష్) సాయంతో వాటిని ఫోటోలు తీయిస్తుంది. పింకీ తల్లిదండ్రుల్ని కలపగలిగిందా? వర్మ రాజకీయ జీవితం ఏమయ్యింది? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

ఏమాత్రం సహజత్వం లేకుండా నడచిన కథకి పురాతన ట్రీట్‌మెంట్ తోడవడంతో అక్కడక్కడా మెరుపులు తప్ప సినిమా అనాసక్తంగా తయారయింది. జనరేషన్ గ్యాప్ అంటే ఏమిటనేదానికి ‘సుందరకాండ’ మంచి ఉదాహరణ. కథ, కథనాల్లో ఆధునికత, వేగం వుంటే తప్ప థియేటర్ల వైపు ప్రేక్షకులు తొంగిచూడని కాలం ఇది. అందుకు పూర్తి రివర్స్‌లో వున్న సినిమా ‘సుందరకాండ’. ఎప్పటి కథ, ఎప్పటి కథనం! పెళ్లయిన వెంటనే తల్లిని దూరం చేసుకున్న తండ్రి దగ్గరకు కూతురు వెళ్లడం, మంచితనం మూర్తీభవించిన ఆ తండ్రి కూతుర్ని ఎంతో ప్రేమగా చూడడం, ముద్దు మురిపాలతో ముంచెత్తడం, కూతురు గోడ మీంచి పడిపోతుంటే చేతులు చాపి పట్టుకోవడం, తండ్రి కోసం కూతురు విలన్ దగ్గరకుపోయి అతణ్ణి వెంగళప్పని చేసి ఆడించడం.. చెప్పడానికే నవ్వువస్తున్న ఈ సినిమా చూస్తుంటే ఇంకెంత నవ్వు తెప్పిస్తుందో! సన్నివేశాలు అంత హాస్యాస్పదంగా వున్నాయన్నమాట. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఇప్పటికీ తెలుగువాళ్లలో చాలమంది అభిమానిస్తారు. కానీ వాటిని చెప్పే తీరులోనే వుంది కీలకమంతా. అంటే మన సంప్రదాయాల్ని గుర్తుచేసే సన్నివేశాలు మరీ పాతచింతకాయ పచ్చడి తరహాలో విసుగుని తెప్పించే రీతిలో వున్నాయి. ఈ కాలంలో జమీందారీ కథలు చెబితే వినేదెవరు, చూసేదెవరు? రచయితగా ప్రఖ్యాతులైన ముళ్లపూడి వెంకట రమణ కాలంతో పాటు సాగడంలేదనీ, ఒక దశ దగ్గరే ఆగిపోయారనీ తోస్తుంది. రాజకీయాల పట్ల కూడా ఆయనకి అవగాహన లేదా? అనే సందేహం వస్తే అది మన తప్పుకాదు. వర్మ లేదా కోట ఎన్నికల్లో గెలిస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని చూపించడం ఏమిటి? ముఖ్యమంత్రిని నిర్ణయించేది ఎవరు? అసలు వారి పార్టీయే అధికారంలోకి వస్తుందని గ్యారంటీ ఏమిటి? క్లైమాక్స్‌లో పార్టీ అధిస్ఠానం దూత వచ్చి జనం మధ్య మీటింగ్ పెట్టి పార్టీ అభ్యర్థిని ప్రకటించడమేమిటో అంతుపట్టదు. ఇవాళ కుర్రవాళ్లకి కూడా రాజకీయ పరిజ్ఞానం వుంది. ఇందులో చూపించిన తరహాలో రాజకీయాలు నడవవని వారు ఠక్కున చెప్పేస్తారు. నాటకీయత కోసం అలా చూపించారని సర్దిచెప్పుకోవాలన్నా మనసొప్పదు.
పింకీ చలాకీ పనులు ఒక స్థాయివరకు ముచ్చటేస్తాయి. ఆ తర్వాత చికాకు కలిగిస్తాయి. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూపించే సన్నివేశాలు సహజత్వానికి దూరంగా వున్నాయనే సంగతిని బాపులోని దర్శకుడు గ్రహించలేకపోయాడు. వారి సెంటిమెంటు సన్నివేశాలు ఆకట్టుకునే రీతిలో లేవు. నరేష్‌ని చూసి మనం జాలి పడాల్సిందే. కథలో అతడొకడున్నాడని అప్పుడప్పుడు గుర్తుకొచ్చి అతణ్ణి లాక్కువచ్చినట్లు అనిపిస్తుంది. అతడికోపేరు వున్నట్లుగా కూడా మనకి గుర్తుండదు. పేపరోడంటేనే తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాకి హీరో నరేష్ కాదు. పింకీ తండ్రి వర్మ పాత్ర చేసిన సునీల్‌వర్మనే. కథంతా నడిచేది ఛార్మి, అతడి పాత్రల చుట్టూనే. అంటే నరేష్ ఒట్టి డమ్మీ! కోట పాత్ర మాత్రం నేటి రాజకీయ నాయకుడి తీరుని వ్యంగ్యంగా చూపించే పాత్ర. మిగతా పాత్రలతో పోలిస్తే ఆ పాత్ర చిత్రణ ఒకింత మెరుగు. సాధారణంగా బాపు సినిమా అంటే నాయికా నాయకులమధ్య రొమాన్సే ఎక్కువ జ్ఞప్తికొస్తుంది. ఈ సినిమాలో అది పూర్తిగా మిస్సవడం పెద్ద లోపం. తండ్ర్రీకూతుళ్ల అనుబంధానికి పెద్దపీట వేసిన దర్శకుడు నాయికా నాయకుల మధ్య అనురాగాన్ని పూర్తిగా విస్మరించాడు.

పాత్రధారుల అభినయం:

అన్నపూర్ణ అలియాస్ పింకీగా ఛార్మి చాలా చలాకీగా చేసింది. ‘మంత్ర’గా ఆకట్టుకున్న ఆమె పింకీగా కూడా మంచి మార్కులు సంపాదించింది. అయితే రెగ్యులర్‌గా కనిపించే బాపు బొమ్మ లాగా మాత్రం ఆమె లేదు. కథలో, సన్నివేశాల్లో ఆకర్షణీయత లేకపోవడం ఆమె తప్పుకాదు. నరేష్ ముందే చెప్పుకున్నట్లు ఒక డమ్మీ. పింకీ చేతిలోని పావు. అతడి వృత్తి తప్ప అతడి గురించి దర్శకుడికే ఆసక్తి లేదు. ఛార్మిని గోడ ఎక్కించేందుకు ఆమె పిరుదులు పట్టుకుని పైకినెట్టి, ‘మెత్తగా వుంది’ అన్న అతడి డైలాగ్ ఒక్కటే మనకి బాగా గుర్తుంటుంది. బాపు డైరెక్షన్‌లో నటించాననే తృప్తి తప్ప అతడికి ఈ సినిమా వల్ల ఒనగూడిన ప్రయోజనం శూన్యం. వర్మగా సునీల్‌వర్మ అందంగా వున్నాడు. పాత్ర తీరుకి తగ్గట్లే నటించాడు. కానీ అతడికి ఎస్పీ బాలు వాయిస్ నప్పలేదు. వర్మ నోరు తెరిచినప్పుడల్లా బాలు మాట్లాడుతున్నట్లు వుందే తప్ప అతను మాట్లాడుతున్నట్లు లేదు. కోట శ్రీనివాసరావు తనదైన శైలితో మాధవయ్య పాత్రని రక్తి కట్టించాడు. ఛార్మి తల్లిగా ప్రేమ ఫర్వాలేదు. ఛార్మి తాత నాయనమ్మలుగా రంగనాథ్, సంగీత; కోట భార్యగా జయలలిత, అతని అనుచరులుగా లక్ష్మీపతి, కొండవలస, దువ్వాసి, గౌతంరాజు తదితరులు పరిధులమేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితనం:

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే బాధ్యతల్ని ముళ్లపూడి వెంకటరమణ తీసుకున్నారు. వీటిలో మాటల రచయితగా మాత్రమే ఆయన మెప్పించ గలిగారు. కథ, స్క్రీన్‌ప్లేల వల్లే ఈ చిత్రం అనాకర్షకంగా తయారయ్యింది. సంభాషణలు మాత్రం ఆయన పేరుని నిలబెడతాయి. పింకీని వర్మ ‘నీకు తమ్ముళ్లు లేరా?’ అనడిగితే పింకీ ‘మా అమ్మ రామాయణకాలం నాటి సీత. ఆ సీత గుండెలోని గుడిలో ఒకడే రాముడున్నాడు’ అని చెప్పడం ముళ్లపూడిలోని సమయస్ఫూర్తికే చెల్లు. విద్యాసాగర్ సంగీత బాణీలు మునుపటి బాపు సినిమాల స్థాయిలో లేవు. ఒకటి రెండు మినహా మిగతా వాటిలో గుర్తుండే పాటలు లేవు. శరత్ నేపథ్య సంగీతం ఓకే. పిఆర్‌కె రాజు సినిమాటోగ్రఫీ, శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ ప్రమాణాలకు తగ్గట్లున్నాయి.

బలాలు, లోపాలు:

ఛార్మి నటన, సంభాషణలు, సినిమాటోగ్రఫీ బలాలు. నేటి కాలానికి ఆమడ దూరంగా వున్న కథ, కథనాలు, సన్నివేశాల చిత్రణ, హాస్యాస్పదమనిపించే రాజకీయ పాత్రలు, హీరో హీరోయిన్ల రొమాన్సుని మిస్సవడం, హీరో పాత్ర డమ్మీలా కనిపించడం లోపాలు. అటు యువతకి గానీ, ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులకి గానీ ఈ సినిమా నచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: