శ్రీకాంత్ చేజార్చుకున్న ఒక సినిమాను జగపతిబాబు చేజిక్కించుకున్నాడు. ఫిల్మ్‌నగర్ బాతాఖానీ ప్రకారం ఇటీవల డైరెక్టర్ కావాలనే కోరిక వున్న ఒక సినిమాటోగ్రాఫర్ కథ చెబ్దామని శ్రీకాంత్ వద్దకు వెళ్లాడు. విని బాగానే వుందన్న శ్రీకాంత్ ఒక ‘కోటి’ ఇస్తే చేస్తానన్నాడు. దాంతో ఆ సినిమాటోగ్రాఫర్ కాస్త ఖంగుతిని, కాస్త ధర తగ్గించమని కోరాడు. శ్రీకాంత్ తనది ఒకటే మాటన్నాడు. దాంతో చేసేది లేక బయటకొచ్చిన ఆ సినిమాటోగ్రాఫర్ మనసులో చటుక్కుమని జగపతిబాబు మెదిలాడు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి కథ చెప్పాడు. గంటన్నరసేపు శ్రద్ధగా కథను ఆలకించిన జగపతి వెంటనే ఓకే అనేశాడు. ఎన్ని రోజులు తన కాల్షీట్లు కావాలంటే అన్ని తీసుకొమ్మని కూడా చెప్పాడు. ‘గాయం’ తర్వాత తనను అంతగా ఇన్స్పైర్ చేసిన కథ అదేనని జగపతి ఫీలయ్యాడు. అంటే భావోద్వేగాలు మేళవించిన యాక్షన్ కథ అది. ప్రస్తుతం జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో నటిస్తున్న జగపతి, దాని తర్వాత ఈ సినిమానే చేయనున్నాడు. ఆ సినిమాటోగ్రాఫర్ పేరు రమణ సాల్వ. ‘సత్తా’, ‘రెండేళ్ల తర్వాత’ అనే సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.