కొత్త తారలతో రూపొందించిన ‘హ్యాపీ డేస్’తో తెలుగు చిత్ర సీమలో ఓ ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో, అందులో ఏ హీరో నటిస్తాడో ఇంతదాకా స్పష్టం కాలేదు. వెంకటేష్, మహేష్‌బాబు.. ఇద్దరూ శేఖర్‌తో పని చేయనున్నట్లు తెలిపినా ఆ ప్రాజెక్టులు ఎప్పుడు వుంటాయో చెప్పలేదు. శేఖర్ సైతం ఈ విషయంలో ఇంకా గుంభనని పాటిస్తూ వస్తున్నాడు. కాగా అతను ఇటీవల ఓ నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్నట్లు టాలీవుడ్ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ నిర్మాత డేగా దేవకుమార్‌రెడ్డి. ఆయన ఇదివరకు ‘అమ్మాయి బాగుంది’, ‘మనసు పలికే మౌనరాగం’ సినిమాల్ని నిర్మించారు. ‘హ్యాపీ డేస్’ చూసిన ఆయన శేఖర్ దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే గట్టి అభిప్రాయానికి వచ్చి, అతనిని ఒప్పించి, అడ్వాన్స్ కూడా చెల్లించారనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు వుంటుందనే సంగతీ వెల్లడవలేదు.