Sawaal

Rating: 2.25/5

Critic Rating: (2.25/5)

ప్రేక్షకులకు బస్తీమే ‘సవాల్’
తెలుగులో ప్రస్తుతం యాక్టివ్‌గా వున్న లేడీ డైరెక్టర్ జయ బి. ఒక్కరే. ‘చంటిగాడు’ నుంచి ఆమె వరుసగా సినిమాలు రూపొందిస్తూ వస్తున్నారు. ‘సవాల్’ ఆమెకు దర్శకురాలిగా నాలుగో చిత్రం. తొలి రెండు సినిమాల్ని (చంటిగాడు, ప్రేమికులు) ప్రధానంగా ప్రేమకథలతో రూపొందించిన ఆమె మూడో సినిమా (గుండమ్మగారి మనవడు)ను హాస్యం మేళవించిన సెంటిమెంట్ సినిమాగా తీశారు. ‘సవాల్’ను ఆ మూడింటికీ భిన్నమైన మాస్ ఇతివృత్తంతో ఆమె ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. బ్లాకులో టికెట్లు అమ్ముకునే ఒక కుర్రాడు ఒక పోలీసాఫీసర్‌తో ‘సవాల్’ చేసి, ఆమె కూతురు తనని ప్రేమించేలా చేయడం ఈ సినిమా ప్రధానాంశం. ఈ మాస్ కథకు హీరోగా లేత వయసు కుర్రాడు భరత్, ‘తూనీగా తూనీగా’ ఫేమ్ టీనేజ్ చిన్నది సుహానీని హీరోయిన్‌గా ఆమె ఎంచుకున్నారు. ఏప్రిల్ 4న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి భావనని కలిగిస్తున్నదంటే..
కథ:
తిరుపతి (భరత్) సినిమా థియేటర్ల వద్ద బ్లాకులో టికెట్లు అమ్ముకునే కుర్రాడు. అయినా అతడి వెనుక ఏకంగా 10 వేలమంది జనముంటారు. అనాథ అయిన అతడికి వాళ్లే సర్వస్వం. పోలీసాఫీసర్లకైనా, ఎమ్మెల్యేలకైనా అతడంటే హడల్. తనుండే బస్తీలో మంచినీటి కోసం నేరుగా మంత్రి (దండపాణి) తోటే తలపడతాడు. కీర్తన అనే అందమైన పొగరుబోతు అమ్మాయితోటీ గిల్లికజ్జాలు మొదలవుతాయి. ఆ యేరియాకు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహం (సాయాజీ షిండే)కు ఇన్‌ఫార్మర్‌గా మారి అక్కడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు సహకరిస్తాడు. అవన్నీ మంత్రికి సంబంధించినవే. ఒకరోజు బాగా తాగిన తిరుపతి, నరసింహం మధ్య క్లాస్, మాస్ అనే గొడవ వస్తుంది. తిరుపతిని లోక్లాస్ వాడివి అంటూ ఎద్దేవా చేసిన నరసింహం చేతనైతే తన కూతుర్ని ప్రేమలో పడేయమని అతడికి ‘సవాల్’ విసురుతాడు. గెలిస్తే పది లక్షలిస్తాననీ, ఓడితే జీవితాంతం తన వద్ద ఊడిగం చేయాలంటాడు. తిరుపతి ఆ సవాలును స్వీకరిస్తాడు. తీరా చూస్తే తనతో తరచూ గొడవపడుతున్న కీర్తనే నరసింహం కూతురు. ఆ సవాలులో ఎవరు గెలిచారు? కీర్తనను సొంతం చేసుకోవాలనుకున్న మంత్రి కొడుకు వినాయక్ (వినాయక్) ఊరుకున్నాడా? తన చీకటి పనులమీద దెబ్బకొట్టిన తిరుపతిని మంత్రి ఊరికే వదిలిపెట్టాడా?.. అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
కథనం:
‘సవాల్’ సినిమా చూశాక మాస్ సినిమాలు తీయడంలోపురుషులకి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకునే యత్నాన్ని జయచేశారనే భావన కలుగుతుంది. హీరో, హీరోయిన్ పాత్రల చిత్రణే కాదు,పోలీసాఫీసర్‌తో పాటు ప్రతి నాయకుల పాత్రల్ని ఆమె చిత్రించిన తీరు,సన్నివేశాల్ని కల్పించిన తీరు ఈ సంగతిని బాగా పట్టిస్తాయి. హీరోతిరుపతి, హీరోయిన్ కీర్తన, పోలీసాఫీసర్ నరసింహ పాత్రలు అతిగాప్రవర్తిస్తాయి. అతిగా మాట్లాడుతాయి. చింతల్ బస్తీలో వుండే తిరుపతి వెనుకపదివేల మంది జనం వున్నారనడం అతిశయోక్తి. ఒక బస్తీలో అంతమంది జనంవుండడం మన ఊహకు అందని విషయం. పైగా బ్లాకులో టికెట్లు అమ్మే కుర్రాడివెనుక అంతమందా! మనకున్న సాధారణ పరిజ్ఞానం ప్రకారం బ్లాకులో టికెట్లూమ్మడం నేరం. అది గౌరవప్రదమైన ఉద్యోగం కాదు. ఆ ఉద్యోగం చేసేవాణ్ణిగౌరవంగా చూసే జనం బహు అరుదు. కానీ దాన్ని హీరోయిజంలాగాపాజిటివ్‌గా చూపించడం వల్ల ఆ పాత్రపట్ల ప్రేక్షకుల్లో గౌరవ భావంకలగకుండాపోయే అవకాశం ఏర్పడింది. హీరోకు ప్రతినాయకుడితో సంఘర్షణహైలైట్ అయితేనే అందం, ఆసక్తి. ఇందులో హీరో ‘సవాల్’ చేసేదిప్రతినాయకుడైన మంత్రి లేదా అతడి కొడుకుతో కాదు. చట్ట వ్యతిరేకకార్యకలాపాల్ని అరికట్టే పోలీసాఫీసర్‌తో. అదీ మద్యం మత్తులో చేసినాసవాల్’. అందువల్ల కథ డీవియేట్ అయిపోయి, ప్రతినాయకుడు డీలాపడ్డాడు.ఫలితంగా కథనంలో మజాకు అవకాశం లేకుండా పోయింది. పదే పదే క్లాస్, మాసంటూ.. రెండు వర్గాల మధ్య ఉన్నతేడాను, క్లాస్ కంటే మాస్ గొప్పదనే భావనను హైలైట్ చేయాలనుకోవడంచేజేతులా ప్రేక్షకుల్లో అసహనాన్ని ప్రేరేపించడమే. హీరో హీరోయిన్ల మధ్యకలిగే ప్రేమ భావనను మరీ నాటుగా, మొరటుగా చిత్రించారు. సున్నితత్వమేప్రేమకు ఆలంబన. ప్రేమ భావన హృదయాన్ని రాగరంజితం చేస్తుంది. ఆపరంగా చూస్తే ‘సవాల్’లోని నాయికా నాయకుల మధ్య ప్రేమ ఏమాత్రమాకట్టుకోదు. ‘ఐ లవ్ యు’ చెప్పకపోతే దూకేస్తానంటూ బిల్డింగ్ మీదికెక్కిహీరోయిన్ చేసే బ్లాక్‌మెయిల్, ఆ సన్నివేశంలో హీరో ఆమెను ‘ఒసేయ్’ అంటూసంబోధిస్తూ చెప్పే డైలాగులు భరించడానికి చాలా ఓపిక కావాలి. హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు అందంగా వస్తే ఆహ్లాదానికి వీలు కలిగేది. ఈసినిమాలో ఆ ఆహ్లాదం కనిపించదు. బ్రహ్మానందం, కోవై సరళల టీవీచానల్ ఎపిసోడ్ నవ్వించేందుకు యత్నించినా అది సరిపోదు. 
పాత్రధారుల అభినయం:
తిరుపతి పాత్రలో భరత్ మరీ పిల్లవాడిలాగున్నాడు. ‘టెన్త్ క్లాస్’లో టీనేజ్ కుర్రాడిలా చూసిన అతణ్ణి ‘సవాల్’లో పక్కా మాస్ పాత్రలో చూడాల్సి రావడం కష్టమే. అతడి బాడీ లాంగ్వేజ్‌కి తిరుపతి క్యారెక్టర్ సూట్ కాలేదు. పైగా ఆ పాత్రకి అతడి వాయిస్ కూడా సరిపోలేదు. ఆ పాత్రలో అతడి నటన, డైలాగ్ మాడ్యులేషన్.. రెండూ అపరిపక్వతనే సూచించాయి. కీర్తనగా సుహాని కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆమెకు రాసిన సంభాషణలు పాత్రకి మించి వుండటంతో అవి ఎబ్బెట్టును కలిగించాయి. మొదట సి.ఐ. నరసింహగా, తర్వాత ఎసిపిగా సాయాజీ షిండే ఓవరాక్టింగ్ చేశాడు, పాత్రకు తగ్గట్లే. అయినప్పటికీ అతడి పాత్రే కాస్త ఆకట్టుకుంటుంది. కాకపోతే వచ్చీరాని తెలుగులో అతడు చెప్పిన డైలాగులు కొన్నిచోట్ల పంటికింద రాళ్లులా తగులుతాయి. ‘ఏమండీ’ అనడానికి బదులు ‘ఎమండీ’ అనడం అందుకు ఉదాహరణ. దండపాణి క్రూరత్వాన్ని బాగా ప్రదర్శించాడు. వినాయక్ పాత్రలో వినాయక్ అలియాస్ సుందర్ ఓ మోస్తరుగా వున్నాడు. రఘుబాబుకు సన్నివేశాలు చాలావున్నా అతడిని కామెడీకి సరిగా వుపయోగించుకోలేక పోయారు. బ్రహ్మానందం, కోవై సరళ జోడీ కాస్త నవ్విస్తుంది. ఎమ్మెస్ నారాయణ, ఏవీఎస్, అలీ నాలుగైదు నిమిషాలసేపు నవ్వించేందుకు యత్నించారు. దండపాణి బావమరిదిగా జీవాకి కూడా నటించేందుకు అవకాశం దొరకలేదు. సినిమా ఆరంభంలో ఎమ్మెల్యేగా పరుచూరి గోపాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించి తమదైన తరహాలో డైలాగులు చెప్పారు. 
టెక్నీషియన్ల పనితనం:
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేలను దర్శకురాలు స్వయంగా సమకూర్చారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా లేకపోవడం సినిమాను దెబ్బతీశాయి. వెలిగొండ శ్రీనివాస్ సంభాషణలు కామెడీ సన్నివేశాల్లో మినహాయిస్తే మిగతా చోట్ల ఆకట్టుకోలేక పోయాయి. సంభాషణలు చాలా సందర్భాల్లో పాత్రోచితంగా వున్నట్లు అనిపించలేదు. జెస్సీ గిఫ్ట్ స్వతహాగా చక్కని సంగీతకారుడు. ఈ సినిమా కోసం అతను మంచి ట్యూన్లనే ఇచ్చాడు కానీ సాహిత్యమే అంత వినసొంపుగా లేదు. ఎక్కువ సందర్భాల్లో అవి సిగరెట్ పాటలుగానే మిగిలాయి. చివరి పాట శంకర్ సినిమాల్లోని పాటల అనుకరణలా తోస్తుంది. అరుణ్‌కుమార్ సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. చాలా సందర్భాల్లో అతని కెమెరా చురుగ్గా పనిచేసింది. యాక్షన్ సన్నివేశాల్లో అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. హీరోయిన్‌కు రఘుబాబు హీరో ఫ్లాష్‌బ్యాక్ చెప్పే సన్నివేశం ఎఫెక్టివ్‌గా రాని సంగతి ఎడిటర్ గుర్తించలేదు. యాక్షన్ సన్నివేశాలు బాగానే వున్నాయి కానీ హీరో భరత్‌కు అవి హెవీ అయ్యాయి.
బలాలు, లోపాలు:
వినోదకర సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, సాయాజీ షిండే పాత్ర బలాలు. కొత్తదనం కానరాని కథ, అతిగా వ్యవహరించే పాత్రలు, హీరో హీరోయిన్లకు రాంగ్ క్యాస్టింగ్, హీరో హీరోయిన్ల ప్రేమలో ఏమాత్రం సున్నితత్వం లేకపోవడం, పాత్రధారులు చిత్తం వచ్చినట్లు సంభాషణలు చెప్పడం లోపాలు. హీరోకీ, హీరోయిన్ తండ్రికీ మధ్య సాగే ఈ ‘సవాల్’ ప్రేక్షకులకి కూడా ఒక సవాలే.
..యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: