వినాయక్ దర్శకత్వంలో నటించిన ‘కృష్ణ’ ఘన విజయం సాధించడంతో హీరో రవితేజ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచినట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన ‘కృష్ణ’ చిత్రం 2008 తొలి బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. అదే సమయంలో బాలకృష్ణ ‘ఒక్క మగాడు’, ఎమ్మెస్ రాజు ‘వాన’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మట్టి కరిచాయి. ప్రధానంగా ‘ఒక్క మగాడు’ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. దాంతో వారిలో కొంతమంది దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి ఆఫీసు వద్ద ఆందోళనకు కూడా దిగారు. ఎలాగైతేనేం వారిని సముదాయించి పంపడంలో చౌదరి సఫలీకృతుడయ్యాడు. కాగా హీరోగా పెరిగిన ఇమేజ్‌తో రవితేజ తన రెమ్యూనరేషన్‌ని 5 కోట్ల రూపాయలకు పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో అతనితో కొత్తగా సినిమాలు తీద్దామనుకున్న నిర్మాతలు ఖంగుతిని అంతగా పెంచడం సరికాదని సలహా ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దాంతో పారితోషికం విషయంలో అతను పునరాలోచనలో పడ్డాడనీ, తన కెరీర్‌కు ఇబ్బంది కలగని రీతిలో పారితోషికాన్ని వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడనీ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం అతను సురేష్ ప్రొడక్షన్స్‌లో నటించబోతున్నాడు. ఆ సంస్థ మాత్రం అధిక రెమ్యూనరేషన్ ఇవ్వదనేది ఇండస్ట్రీలోని వారందరికీ తెలిసిన సంగతే.