బహు భాషల్లో నటిస్తున్న తెలుగు తార రంభకీ, తమిళ హాస్య నటుడు గౌండమణికీ మధ్య గొడవ జరుగుతున్నట్లు తమిళ చిత్రసీమలో ప్రచారమవుతున్నది.. అదీ ఆర్థిక పరమైన అంశాల వల్ల. ప్రస్తుతం గౌండమణి ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడినప్పటినుంచీ ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అందువల్లే గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు. గౌండమణి, సెంథిల్ జంట’90 లలో తమిళ సినిమాని ఓ వూపు వూపారు. ఆ ఇద్దరూ తమిళ లారెల్, హార్డీ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వడివేలు, వివేక్ వంటి హాస్య నటుల రాకతో గౌండమణికి కాస్త డిమాండ్ తగ్గిన మాట నిజం. దానికి అనారోగ్యం తోడయ్యేసరికి ఆయన వచ్చిన అవకాశాలని సైతం ఉపయోగించుకోలేక పోయారు. ఈ ఏడాది జూలైలో ఆయన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. నటునిగా మంచి డిమాండ్ ఉన్న కాలంలో నటి రంభకు ఆయన ఓ ఇల్లు సమకూర్చి పెట్టారని చెప్పుకుంటారు. అప్పట్లో కేవలం 10 లక్షల రూపాయల ఖరీదు చేసిన ఆ ఇల్లు విలువ నేడు ఒకటిన్నర కోట్లకు చేరుకున్నదని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఇంటిని రంభ అద్దెకు ఇచ్చిందని తెలుస్తున్నది. అందుకే దానిని అమ్మి తనకు సాయం చేయాల్సిందిగా రంభని ఆయన అడుగుతున్నాడనీ, కానీ ఆమె అందుకు ససేమిరా అంటున్నదనీ కాలీవుడ్లో గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. వీటిలో నిజమెంతో వారికి మాత్రమే తెలుసు.