పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘పులి’ ఈ నెలాఖరులో లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ‘ఖుషి’ ఫేమ్ ఎస్.జె. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శింగనమల రమేష్ నిర్మిస్తున్నాడు. రమేష్ ఇదివరకు తెలుగులో రాజశేఖర్‌తో ‘విలన్’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా తొలిసారి నటించబోతున్న పవన్, ఆ పాత్ర కోసం మీసాలు లావుగా పెంచాడు. జుట్టును దగ్గరగా కత్తిరించుకున్నాడు. దేహ దారుఢ్యాన్ని మెరుగు పరచుకున్నాడు. అయితే ఇప్పుడందరి కళ్లూ ఆ సినిమాలో నటించే హీరోయిన్ పైనే. ఇంతవరకు అధికారికంగా ఈ సినిమా హీరోయిన్ ఎవరో వెల్లడి కాలేదు. అయితే ఫిల్మ్‌నగర్ వర్గాల్లో పార్వతీ మెల్టన్ పేరు నానుతోంది. ‘జల్సా’లో ఆమె రెండో హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసిందే. అందులో ఆమె ‘సెక్సీ’గా కనిపించింది. అదే సంగతి హీరోయిన్ ఇలియానాతో కూడా ఆ సినిమాలో చెప్పించారు. పార్వతిని ఉద్దేశించి ‘అది నాకంటే సెక్సీగా వుంటుంది’ అంటుంది ఇలియానా. అదలా వుంచితే అందులో పార్వతి నటన పవన్‌ను బాగా ఆకట్టుకున్నదనీ, అతను ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించాడనీ వినిపిస్తోంది. అందుకే ‘పులి’లోనూ ఆమెను తీసుకోవాల్సిందిగా దర్శకుడు సూర్యకు అతను సూచించాడని టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అది హీరోయిన్ పాత్రా, లేక ‘జల్సా’లో మాదిరిగానే సెకండ్ హీరోయిన్ పాత్రా.. అన్నది వెల్లడి కాలేదు. ఏదేమైనా కొద్ది రోజుల్లో సస్పెన్స్ విడిపోనున్నది.