రజనీకాంత్ కథానాయకుడిగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ‘కుచేలుడు’ చిత్రానికి తెలుగులో వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. జగపతిబాబు కూడా మరో హీరో పాత్రను చేస్తున్న ఈ సినిమాకి తెరవెనుక మరో నిర్మాత ఉన్నట్లు చిత్రమాలకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఆయన పేరు శశిభూషణ్. ఒకప్పుడు కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్ హీరోలుగా నటించగా శతదినోత్సవం జరుపుకున్న ‘అన్నదమ్ముల సవాల్’కు ఆయనే నిర్మాత. అయితే తదనంతర కాలంలో ఆయన తీసిన సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాగా నష్టపోయారు. కొన్నేళ్లుగా చిత్రసీమకు దూరంగా ఉంటున్నారు. అలాంటి ఆయనకు సాయం చేసే సదుద్దేశంతో రజనీకాంత్ ‘కుచేలుడు’ను తెలుగులో చేసే అవకాశాన్ని ఆయనకు ఇచ్చారు. దాంతో తెగ ఆనందపడిపోయిన శశిభూషణ్ తెర వెనుకే ఉండేందుకు ఇష్టపడి, తెరముందుకు అశ్వనీదత్ని తీసుకు వచ్చారనేది అంతర్గత వర్గాల భోగట్టా. ఈ ఉదంతం రజనీకాంత్లోని ఉదారతని మరోసారి బయటపెట్టింది. ఇదివరకు స్వర్గీయ శివజీ గణేశన్ కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతోటే ఆయన ‘చంద్రముఖి’ని వారి బానర్ కింద చేశారు. మన తెలుగు హీరోలు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని దీన్నిబట్టి తెలియడం లేదూ!