Premabhishekam

Rating: 1.75/5

Critic Rating: (1.75/5)

అపహాస్యాభిషేకం

అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధ కాంబినేషన్‌లో 1981లో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం కలెక్షన్లలో చరిత్రని సృష్టించింది. అంతకుమించి ప్రేమకథా చిత్రాల్లో ఒక మరపురానిదిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఆ సినిమా పేరుతో మరో సినిమా రావడంలో ఎలాంటి తప్పూ లేదు. ఆ కథనీ, ఆ పాత్రల్నీ అనుకరిస్తూ వినోదాన్ని అందించాలనుకోవడమూ తప్పు కాదు. అయితే మునపటి సినిమా మీద ప్రేక్షకుల్లో వున్న అందమైన భావన మీద దాడి చెయబోవడం మాత్రం తప్పుకుండా పొరబాటే. తనే రూపొందించిన ఆనాటి ‘ప్రేమాభిషేకం’ని అపహాస్యం చేసే ఈనాటి ‘ప్రేమాభిషేకం’కు కథను అందించి ముందుగా దాసరి నారాయణరావే పొరబాటు చేశారు. ‘వీడికి కేన్సర్ లేదు’ అంటూ టైటిల్ దగ్గర్నుంచే ఆ అపహాస్యం మొదలైంది. పాపులర్ నటుల్నీ, సినిమాల సన్నివేశాల్నీ అనుకరిస్తూ స్టేజీ మీద వినోదాన్ని సృష్టించడం వేరు, వెండితెరమీద వాటిని ఆవిష్కరించడం వేరు. తాను స్టేజీమీద చేసిన పనుల్ని వెండితెర మీదా చేసి మెప్పించాలని వేణుమాధవ్ ‘ప్రేమాభిషేకం’ చేశాడు. నవ్వుల పాలయ్యాడు.. కథలో పాత్రకి మల్లే.

కథ:

ఈ సినిమాలోని పాత్రలకు పాత ప్రేమాభిషేకంలో నటించిన తారల పేర్లు యథేచ్ఛగా వాడుకున్నారు. నాగేశ్వరరావు (వేణుమాధవ్) రాయలసీమ కుర్రాడు. సినిమాలో ఒక పాత్ర చెప్పినట్లు టామ్ అండ్ జెర్రీ కథలో జెర్రీ లెక్కన వుంటాడు. బామ్మ శకుంతల (తెలంగాణ శకుంతల) తన మనవరాలు (గీతాసింగ్)నిచ్చి మనవడికి పెళ్లి చేయాలనుకుంటుంది. కానీ భారీ ఆకారం కలిగిన మరదలిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని నాగేశ్వరరావు తను హైదరాబాదులో చదువుకునేప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాననీ, ఆమెనే పెళ్లి చేసుకుంటాననీ ఒక అబద్ధం ఆడేస్తాడు. సరేనన్న బామ్మ దానికి వంద రోజులు గడువిస్తుంది. ఆ లోపు అతను ఆ అమ్మాయిని చేసుకోలేకపోతే మరదల్ని చేసుకోవాల్సిందేనంటుంది. సరేనని హైదరాబాద్‌కు వచ్చి మిత్రుడు మురళీ మోహన్ (సునీల్)ను కలుస్తాడు నాగేశ్వరరావు. ఒక గుడిలో శ్రీదేవి (ప్రియా మోహన్)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించేస్తుంది.. ఉత్త పుణ్యానికే. నాగేశ్వరరావుకు తన ఆరోగ్యం మీద తనకు బాగా డౌటు. శ్రీదేవితో నిశ్చితార్థం జరిగిన రోజు కళ్లుతిరిగి, ఆస్పత్రికివెళతాడు. డాక్టర్ గుమ్మడి (ధర్మవరపు) ఫోన్‌లో మరో డాక్టర్‌తో ఒక పేషెంట్ గురించి చెప్పిందివిని, అది తన గురించే అనుకుని, తనకి కేన్సర్ అని భావిస్తాడు. తను 6 నెలల్లో చనిపోతాడు కాబట్టి శ్రీదేవికి అన్యాయం చేయకూడదని తలచి, ఆమెతో పెళ్లి తప్పడం కోసం ఆమె దృష్టిలో చెడ్డవాడిగా కనిపించేందుకు నాటకాలాడతాడు. పేరుపొందిన మోడల్ జయసుధ (రుతిక)తో ప్రేమ నాటకమాడతాడు. ఆమె అన్న బాంబేలో పేరుమోసిన డాన్ హరీభాయ్ (శ్రీహరి). ఆ తర్వాత నాగేశ్వరరావు ఎలాంటి విషమ స్థితిలో చిక్కుకున్నాడు? ఎలా దాన్నుంచి బయటపడ్డాడు? అన్న ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

ప్రధాన పాత్రలకు అప్పటి ‘ప్రేమాభిషేకం’లో నటించిన నటీనటులు పేర్లు పెట్టారు. ఆ పాత్రల్ని తెరమీద చిత్రీకరించిన తీరుచూస్తే సదరు నటీనటులు గుండెలు బాదుకోకుండా వుండలేరు. మిగతా పాత్రల తీరు ఒకెత్తయితే జయసుధ (రుతిక) పాత్ర చిత్రణ ఒకెత్తు. పాత సినిమాలో జయసుధ ఒక వేశ్యయినా, ఆమెకు ఒక హృదయమున్నట్లు, కథానాయకుడి క్షేమం కోసం ఆమె తల్లడిల్లినట్లు చిత్రించి, దర్శకుడు దాసరి ఆమె పాత్రకూ ఉదాత్తతని చేకూర్చారు. కానీ ఈ సినిమాలో రుతిక చేసిన ఆ పాత్ర ప్రవర్తన నీచం. తన కంటికెవడు నచ్చినా ‘ఓహ్.. సెక్సీ బేబీ’ అంటూ అతడి పిర్రని గట్టిగా పట్టుకుంటూ వుంటుంది. ప్రేక్షకులకు ఆ పాత్ర తగిన పాళ్లలో చీదర కలిగించింది. శ్రీదేవి పాత్రకి ఒక వ్యక్తిత్వం లేకుండా తయారుచేశారు. ఆమె నాగేశ్వరరావును ఎందుకు ప్రేమిస్తుందో మనకు అర్ధంకాదు. ఉద్యోగం సద్యోగం లేని అతడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలంటే 25 లక్షలు సంపాదించుకు రమ్మంటాడు ఆమె తండ్రి (ప్రదీప్). చాలా సినిమాల్లో ఇప్పటికే చూపించిన తరహాలో మనవాడు ఒక యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం సంపాదించి చాలా తక్కువ టైములో అంతకంటే ఎక్కువే సంపాదించేస్తాడు. తన తెలివితేటలతో ఉద్యోగాన్నీ, దానితో బాటు డబ్బునీ సంపాదించినవాడు తనకు లేని జబ్బుని వున్నట్లుగా భావించుకోవడమే విడ్డూరమనిపిస్తుంది. కాస్త తెలివి వున్నవాడెవడైనా తన హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తాడు. కానీ వేణుమాధవ్ ‘ప్రేమాభిషేకం’లో మాటలతోటే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమలు పుడతాయి. జబ్బులూ పుడతాయి. పాత సినిమాలో మురళీమోహన్ రెండో హీరో అయితే ఇక్కడ విలనైపోయాడు. నాగేశ్వరరావును తప్పించి, శ్రీదేవిని తనదాన్ని చేసుకోవాలని అతడు కుయుక్తులు పన్నుతుంటాడు. ఒకసారి ఆమె నడిపే జీపు బ్రేకులు ఫెయిలయ్యేట్లు చేసి, తనే కాపాడతాడు. నిజానికి అందులో అతను తన ప్రాణాలను రిస్క్ చేశాడు. అలాంటప్పుడు అతను కూడా హీరోయే అవుతాడు. అతణ్ణి విలన్‌గా చిత్రించాలనుకుని దర్శకుడు అతన్ని కూడా హీరోనే చేశాడన్న మాట. చిత్రంగా అతను బ్రేకుల్లేని జీపులోంచి శ్రీదేవితో బాటు కిందికిదూకినప్పుడు కావలించుకుని పల్టీలుకొట్టే దృశ్యాలు సైతం చానల్స్‌లో ప్రత్యక్షమవుతాయి. అంటే అలాంటిదేదో జరగబోతోందని ముందే తెలిసి చానళ్లవారు ముందుగానీ అక్కడకు వచ్చి శ్రీదేవి, మురళీ మోహన్ వాటేసుకుని పొల్లికింతలు పడే అందమైన దృశ్యాన్ని కూడా తమ కెమెరాలతో బంధించేశారని మనం అర్ధం చేసుకోవాలి. పేరడీ సినిమా కాబట్టి ఏదైనా సాధ్యమే. లాజిక్కుల కోసం వెతక్కూడదు కదూ! సినిమాలో మనల్ని కొద్దో గొప్పో ఆకట్టుకునేది శ్రీహరి చేసిన డాన్ పాత్రే. ఆ పాత్రను మాత్రం ఆసక్తికరంగా దర్శకుడు చిత్రించగలిగాడు. ‘సిబిఐ.. చితాభస్మం ఇన్‌టైమ్’ అంటూ బ్రహ్మానందం బ్యాచ్ కూడా అలరిస్తుంది. మొత్తంగా చూస్తే తొలి సగం పరమ బోర్‌నీ, రెండో సగం బోర్‌నీ కలిగించేవిధంగా సినిమా నడచింది.  హోమ్‌మంత్రి కూతుర్ని టెర్రరిస్టులు చంపబోతుంటే, ‘కేన్సర్‌తో ఎటుతిరిగీ చస్తాను. ఒక మంచి పని చేశాననే తృప్తి వుంటుంది’ అనుకుని ధైర్యంగా టెర్రరిస్టుల వద్దకువెళ్లి, వాళ్లకి వ్యతిరేకంగా వీరోచితమైన డైలాగులు చెప్పి, వారివద్ద వున్న పాపను కాపాడిన నాగేశ్వరరావు.. బాంబేలో ప్రతి దానికీ గడగడా వణికిపోవడం హాస్యాస్పదం. అంత భయపడేవోడు అంతకుముందు టెర్రరిస్టులనే ఎలా ఎదుర్కోగలిగాడు?.. అని మనం అడక్కూడదు.. వేణుమాధవ్ ఎప్పుడు ఏది చేస్తే అదే కరెక్టు.

నటీనటుల అభినయం:

వేణుమాధవ్ తన ఆకారానికి పనికివచ్చే కథలు ఎంచుకోవడం శ్రేయస్కరం. కమెడియన్‌గా అతను సామాన్య ప్రేక్షకుల్లో మంచిపేరే సంపాదించుకున్నాడు. హీరోగా చేసేప్పుడు తన రూపాన్ని అతను దృష్టిలో వుంచుకోవాల్సిందే. నాగేశ్వరరావుగా అతను కామెడీని చేయాలనుకున్నాడు గానీ తను బఫూన్ అవుతున్న సంగతి అతను గ్రహించలేకపోయాడు. బఫూనరీయే అతడికి కావలసిందనుకుంటే.. ఆ బఫూనరీలోనూ హాస్యం పండలేదు. ఇతర నటులవద్దా, హీరోయిన్ల వద్దా అతను ఒక విదూషకుడి తరహాలో కనిపించాడే తప్ప కథానాయకుడిగా ఏ సన్నివేశంలోనూ గోచరించలేదు. మునుముందు ఈ సంగతిని అతను గమనంలో వుంచుకుంటే అందరికీ ప్రయోజనం. అందరిలోకీ ఆకట్టుకునేది డాన్ హరీభాయ్ పాత్రధారి శ్రీహరి. యాక్షన్ సన్నివేశాల్లో తన ఇమేజ్‌కి తగ్గట్లు కనిపించిన ఆయన తెలంగాణ మాడ్యులేషన్‌తో చెప్పే డైలాగులు అలరిస్తాయి. ఆ తర్వాత అలీ, సునీల్ తమ పాత్రలతో మెప్పిస్తారు. వేణుమాధవ్ పనిచేసే యాడ్ ఏజెన్సీలో రైటర్ కనకాంబరంగా అలీ హాస్యాన్ని పంచాడు. ఇద్దరు హీరోయిన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇద్దరిలో ఏ ఒక్కరూ తమ పాత్రలకి కనీస న్యాయం చేయలేకపోయారు. వాళ్లనని లాభంలేదు. ఆ పాత్రలకు వాళ్లని ఎంచుకున్నవాళ్లనీ, ఆ పాత్రల్ని అలా తయారు చేసినైవాళ్లనీ అనాలి. మరో డాన్ నాగుభాయ్‌గా నాగబాబుది మరీ చిన్న పాత్ర. శ్రీహరిముందు తేలిపోయాడు. మిగతావాళ్లు పరిధుల మేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాకు నలుగురు రచయితలు సంభాషణలు రాశారు. ఆ నలుగురిలో వేణుమాధవ్ కూడా వున్నాడు. శ్రీహరికి రాసిన సంభాషణలు బాగా కుదిరాయి. ఆ నలుగురిలో ఆ క్రెడిట్ ఎవరిదో.. మిగతా సన్నివేశాలకు సంభాషణలు సోసోగా వున్నాయి. చక్రి సంగీతం ఫర్వాలేదు. వేణుమాధవ్‌లోని నిర్మాత పాటలకోసం కాస్త కసరత్తు చేసినట్లు తోస్తుంది. వాటి చిత్రీకరణ కూడా క్వాలిటీగానే వుంది. వాసు సినిమాటోగ్రఫీ ఓకే. యాక్షన్ ఎపిసోడ్లనూ, పాటల్నీ అతని కెమెరా బాగా చిత్రీకరించింది. బలహీనమైన సన్నివేశాల్నీ, కథన లోపాల్నీ నాగిరెడ్డి ఎడిటింగ్ పసిగట్టలేకపోయింది. ఎస్ఎస్ విక్రమ్‌గాంధీ దర్శకత్వం నిరాశపరిచింది.

బలాలు, లోపాలు:

శ్రీహరి పాత్ర, ఆయన నటన, అలీ, బ్రహ్మానందం అందించిన వినోదం, చక్రి సంగీతం బలాలు. హీరో పాత్ర చిత్రణలో లోపాలు, హీరోయిన్ల పాత్రలు, వాటిని పోషించిన తారలు, హాస్యం కంటే అపహాస్యం కలిగించే సన్నివేశాల కల్పన, విసుగెత్తించే కథనం, అలనాటి ‘ప్రేమాభిషేకం’ స్థాయికి దరిదాపుల్లోకి రాని పేరడీ సన్నివేశాలు, పాత్రలు.. లోపాలు. ఓవరాల్‌గా ‘ప్రేమాభిషేకం.. వీడికి కేన్సర్ లేదు’ సినిమా ‘అపహాస్యాభిషేకం’గా నిలుస్తుంది.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: