ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై’ సినిమాని చేస్తున్న ప్రభాస్, దాని తర్వాత ఓ భక్తి సినిమాని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో గట్టిగా ప్రచారమవుతోంది. తన పెదనాన్న కృష్ణంరాజు నటించగా ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్న ‘భక్త కన్నప్ప’ పాత్రలో నటించాలని ఆయన కోరుకుంటున్నారు. బాపు దర్శకత్వం వహించగా 1976లో వచ్చిన ఆ సినిమా అమోఘమైన విజయాన్ని సాధించడమే గాక కృష్ణంరాజుకు నటునిగా చాలా పేరుని తీసుకొచ్చింది. ఆ సినిమా అంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. అందుకే ఆ పాత్రని చేయాలనే ఆశ అతనిలో ఉంది. అన్నీ అనుకూలంగా వుంటే ఈ సినిమాని ఎస్.ఎస్. రాజమౌళి డైరక్ట్ చేసే అవకాశాలున్నాయి. రాజమౌళి సైతం ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తితో ఉన్నట్లు వినిపిస్తోంది. ‘యమదొంగ’ వంటి సోషియో ఫాంటసీ తీసి సక్సెస్ అయిన ఆయన భక్తి సినిమాని సైతం తాను జనరంజకంగా తీయగలనని అనిపించుకోవాలని భావిస్తున్నారు. ‘యమదొంగ’ని నిర్మించిన విశ్వామిత్ర క్రియేషన్స్ సంస్థే దీన్ని నిర్మించే అవకాశాలున్నాయి. రామ్‌చరణ్ సినిమాని డైరెక్ట్ చేశాక రాజమౌళి ఈ సినిమా మీద పని ప్రారంభించవచ్చు.