ఈటీవీ నుంచి ఉద్వాసనకు గురైన వ్యాఖ్యాత, నటుడు ప్రభాకర్ మాటీవీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామోజీరావు కుమారుడు సుమన్‌కు అత్యంత సన్నిహితునిగా మెలగుతూ, ఈటీవీలో క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించడమే గాక, పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ చాలాకాలం తిరుగులేకుండా కొనసాగాడు ప్రభాకర్. ఇదే అతనికి చేటు తీసుకొచ్చింది. ప్రభాకర్ ఎదుగుతున్న తీరు, అతనికి లభిస్తున్న ప్రచారం చూసి గిట్టని వాళ్లు రామోజీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన రంగంలోకి దిగి, ఈటీవీలో ప్రభాకర్‌కు నిజంగానే సుమన్ తర్వాత అంతటి స్థాయి లభిస్తుండటం నిజమేనని నిర్ధారించుకుని, బయటకు వెళ్లిపొమ్మని చెప్పారు. దాంతో ఈటీవీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు ప్రభాకర్. అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణలో ఆరితేరిన ప్రభాకర్‌ను మాటీవీ కోసం వినియోగించుకోవాలని నాగార్జున భావించారని టాలీవుడ్ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ వర్గాల ప్రకారం నాగార్జున అతనితో సంప్రదింపులు జరిపారు. కొన్ని కార్యక్రమాల్ని రూపొందించమని ఆయన ప్రభాకర్‌కు అవకాశమిచ్చారు. చిత్రమాలకు అందిన సమాచారం ప్రకారం ఆయా కార్యక్రమాలకు ప్రభాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తాడు. అందుకు గాను అతనికి రెగ్యులర్ రెమ్యూనరేషన్‌తో పాటు 10 శాతం లాభం కూడా అందుతుంది. ఈ ప్యాకేజీకి ప్రభాకర్ కూడా సుముఖత వ్యక్తం చేశాడు. తనకు తలనొప్పిగా తయారైన జీ తెలుగు పోటీని తట్టుకోవడానికి ప్రభాకర్‌ను ఉపయోగించుకోవడమే మార్గమని నాగార్జున భావిస్తున్నట్లు ఆ వర్గాలంటున్నాయి. అదే నిజమైతే త్వరలోనే ప్రభాకర్ మనకు మాటీవీలో దర్శనమివ్వవచ్చు.