Pourudu Movie Review

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

పట్టులేని పౌరుడు

సుమంత్ సొంత బ్యానర్‌లో చాలా నమ్మకం పెట్టుకుని చేసిన చిత్రం కావడంతో పౌరుడు చిత్రం బాగుంటుందేమో అనిపించింది. దర్శకుడు రాజ్ ఆదిత్యపై పలువురు వ్యక్తం చేసిన నమ్మకం కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచింది. సంక్రాంతికి భారీ చిత్రాలకు భయపడకుండా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే నిర్మాతల నిర్ణయం సినిమాపై కొన్ని అంచనాలు నెలకోనేలా చేసింది. అయితే పౌరుడు అందుకు తగ్గట్టుగా మాత్రం లేదు. బలమయిన కథ, విషయమున్న దర్శకుడు ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే లోపాల వల్ల పౌరుడు పట్టు తప్పాడు. జనవరి 13న విడుదలయిన ఈ చిత్రం విశేషాలివి.

కథ:

జాకీర్ భాయ్(నాజర్) వద్ద నమ్మిన బంటు పాండు (సుమన్). ప్రజలకి మంచి చేయడమే వీరి పని. వీరికి ప్రత్యర్థి అయిన కాశి (కోటా శ్రీనివాస రావు) వీళ్లను అడ్డు తప్పించేందుకు తగిన సమయం కోసం చూస్తూ ఉంటాడు. పాండు కొడుకు అజయ్ సివిల్స్ ఎగ్జామ్ రాసి కలెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే తండ్రి రౌడీ కావడంతో అజయ్‌కి పలు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అజయ్ తన తండ్రిని ఆ దారి విడిచిపెట్టమని కోరితే, కొడుకు ఆశయంలోని  తిరిగి అతనే , భాయ్ దగ్గర పని చేద్దువు గాని రా అని పిలుస్తుంటాడు. ఇదిలా ఉండగా అజయ్ కి సంయుక్త (కాజల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు పాండుకి, ఆ ఊరికి కొత్తగా వచ్చిన సిన్సియర్ సీఐ కి(సుబ్బరాజు) పలుమార్లు గొడవలు అవుతాయి. పాండు మీద పగని అజయ్‌ని అరెస్ట్ చేయడం ద్వారా తీర్చుకోవాలని అనుకుంటాడు సీఐ. ఒకసారి అజయ్‌ని అరెస్ట్ చేసి చావగొడతాడు కూడా. తండ్రి వలనే తన లక్ష్యానికి అడ్డంకులు అని భావించిన అజయ్ అతనికి దూరంగా వచ్చేస్తాడు. కొన్ని సంఘటనలు పాండులో మార్పు తీసుకొస్తాయి. కానీ అంతలోనే కాశి, అతని మనుషులు పాండుని చంపేస్తారు. ఆపై అజయ్ ఏం చేశాడు? అతని లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది మిగిలిన కథ.

కథనం:

సొసైటీలో గౌరవంగా బతకాలి అని కోరుకునే కొడుకు, ప్రజలకు మంచి చేయడం కోసం కత్తి పట్టినా తప్పు లేదని భావించే తండ్రి మధ్య జరిగే మానసిక సంఘర్షణ ఈ కథలో మెయిన్ పాయింట్. ఈ పాయింట్‌ను బాగానే చూపించినా కానీ కథకు అతి కీలకమయిన పలు అంశాలను దర్శకుడు విస్మరించాడు. నాజర్, కోటా మధ్య ఉన్న రిలేషన్ కన్‌ఫ్యూజ్ చేస్తుంది. సుమన్ అడ్డు తొలగించుకున్న తర్వాత సుమంత్ తో అతను చేతులు కలిపి కోట మీద రివర్స్ అవడం రాంగ్ స్ట్రాటజీ. నాజర్ పాత్రలో నెలకొన్న కన్‌ఫ్యూజన్ అసలే వీక్‌గా ఉన్న ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దృశ్యాలను మరింత బలహీన పరచింది. సుమన్ పాత్రను ఇంటర్వల్ ముందే ముగించి ఉంటే హీరోయిజం ఎలివేట్ అవడానికి సమయం చిక్కేది. కానీ క్లయిమాక్స్ ముందు వరకూ ఆ పాత్రను డ్రాగ్ చేయడంతో హీరోకు తడాఖా చూపించడానికి తగిన సమయం మిగలలేదు. అంతే కాకుండా సీరియస్ కథను మేరీయీ భారంగా నట్ట నడక కథనంతో, తగిణణంత వినోదం లేకుండా నడిపించడం మరో ప్రధాన లోపం. లవ్ స్టోరీ కూడా ఉన్నా కూడా అది ప్రధాన కథతో ప్యారలెల్‌గా నడవడం వలన అది కథకు ఒనగూర్చిన ప్రయోజనం శూన్యం.
ఇక క్లయిమాక్స్ అయితే మరీ ఫార్సు. హీరో ఉన్నతాశయాన్ని పక్కన పెట్టించి అతనితో హత్యలు చేయించి కూడా మళ్లీ కలెక్టర్ కావడానికి ఇంటర్వ్యూకి వెళ్ళమని ఒక పోలీస్ తో అనిపించడం మింగుడు పడదు. బాధ్యతాయుతమయిన కలెక్టర్ పోస్టు కి ట్రై చేసే పౌరుడు వ్యక్తిగత కక్షలతో కత్తి పట్టకూడదు. ఒకవేళ పట్టినా అతని ఆశయం ఇక అంతటితో వదిలి పెట్టి పూర్తిగా తండ్రి మార్గాన్ని తీసుకుని ప్రజలకు న్యాయం చేసేందుకు సిద్ధపడాలి తప్ప మళ్లీ క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు ఉన్నత పదవి వైపు అడుగులు వేయడం సబబు కాదు.

పాత్రధారుల ప్రతిభ:

సుమంత్ పరిణతి కలిగిన నటనను ప్రదర్శించాడు. అతని పాత్రకు సామాజిక బాధ్యత, ప్రేమ, స్నేహం వంటి మంచి లక్షణాలతో పాటు చెడు మార్గంలో పయనించే తండ్రి పట్ల వాత్సల్యం, అతడిని మార్చలేక పోతున్నాననే అసహనం, అతను చనిపోతే రగిలే ఆవేశం ఇలా భిన్న పార్శ్వాలున్నాయి. అన్నిటినీ సమర్ధవంతంగా పోషించిన సుమంత్ ఎక్కడా ఓవర్ దిబోర్డ్ వెళ్లలేదు. కాజల్ ఇందులో గ్లామరస్ పాత్రను పోషించింది. సుమన్ తన పాత్రకు అతికినట్టు సరిపోయారు. శివాజిలో చేసిన విలన్ క్యారెక్టర్ తర్వాత సుమన్ కు మరో చెప్పుకోదగ్గ పాత్ర ఇది. నాజర్, కోట అనుభవానికి పరీక్ష పెట్టే పాత్రలు లభించలేదు. చిరుతలో చేసిన పాత్రను పోలి ఉన్న పాత్రనే ఆలీ ఇందులో చేశాడు. ఆ పాత్ర ఒక్కోసారి పరిధులు దాటింది. మిగిలిన కమెడియన్స్ నవ్వించడంలో విఫలమయ్యారు.

సాంకేతిక వర్గం నైపుణ్యం:

సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీకి ఎక్కువ మార్కులు పడతాయి. యమదొంగ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన ప్రేమ్ రక్షిత్ మరో సారి కొరియోగ్రాఫర్‌గా రాణించాడు. మణిశర్మ పాటలు బాగానే ఉన్నాయి, అతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఎస్సెట్. మరుధూరి రాజా తనదయిన శైలిలో చిన్న చిన్న సంభాషణలు రాశారు. ఫైట్స్‌లో అసహజ ఫీట్సు ఎక్కువయ్యాయి.  

బలాలు, బలహీనతలు:

సుమంత్, సుమన్ నటన, సాంకేతిక విలువలు ఈ చిత్రానికి ప్రధాన బలం కాగా ఎంటర్‌టైన్‌మెంట్ లోపించడం, నిదానంగా సాగే స్క్రీన్ ప్లే బలహీనతలు. యాక్షన్ ప్రియులకు మినహా ఇతర వర్గాల ప్రేక్షకులను మెప్పించే లక్షణాలు ఈ చిత్రంలో లేవు. సంక్రాంతి సీజన్ ఈ చిత్రాన్ని గట్టెక్కించే కలెక్షన్స్ తీసుకొస్తే మంచిదే. స్క్రిప్ట్ పరంగా ఉన్న సమస్యలను అధిగమించి ఉన్న కొద్ది బలాలతో ఈ చిత్రం ఎన్ని రోజులు నిలబడగలదో చూడాలి.

– శ్రీనిధ

 

Give your rating:

We would like to hear your comments below: