పవన్‌కల్యాణ్ దర్శకత్వం వహించనున్న ‘సత్యాగ్రహి’ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధమైంది. ఈ సినిమాను ఎస్పిఆర్ ఎంటర్టైన్మెంట్స్ బానర్‌పై నూకారపు సూర్యప్రకాశరావు నిర్మించనున్న సంగతి చిత్రమాల పాఠకులకు విదితమే. ఎఎం రత్నం వదులుకున్న ఆ ప్రాజెక్టును ఆయన చేపట్టారు. 2009 జనవరిలో ‘సత్యాగ్రహి’ సెట్స్ మీదకు వెళ్లనున్నది. కాగా 2007లో వార్తల్లో నిలిచిన పవన్ ‘కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’.. ఆతర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు. అయితే ఇప్పటిదాకా అది 15 మందికి సాయపడినట్లు పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆ కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మనకు ‘సత్యాగ్రహి’లో దర్శనమివ్వనున్నది. కాగా పవన్ హీరోగా బెల్లంకొండ సురేష్ ఒక సినిమాను నిర్మించనున్నారనేది ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారంలోకి వచ్చిన సంగతి. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ‘పులి’ తర్వాత బెల్లంకొండతో పనిచేయడానికి పవన్ అంగీకరించాడనీ, అయితే అనుకోకుండా ‘సత్యాగ్రహి’ రంగం మీదికి వచ్చిందనీ తెలిసింది. ఇప్పటికే పవన్‌కు బెల్లంకొండ అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వినిపిస్తోంది. అదే నిజమైతే ‘సత్యాగ్రహి’ తర్వాత పవన్, బెల్లంకొండ కాంబినేషన్ సినిమా వుండవచ్చు.