త్వరలో సెట్స్ మీదకు ‘పులి’గా అడుగు పెట్టబోతున్నడు పవన్ కల్యాణ్. దానికి ఎస్‌జె సూర్య దర్శకుడనే సంగతి మనకు తెలుసు. 2009 జనవరిలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. అదే నెలలో పవన్ తదుపరి సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఆ సినిమా నిర్మాత నూకారపు సూర్యప్రకాశరావు. సూర్య దినపత్రిక అధినేత అయిన నూకారపు ఇప్పటికే ఎస్పిఆర్ ఎంటర్టైన్మెంట్స్ బానర్‌పై ‘అదిరందయ్యా చంద్రం’, ‘బ్రహ్మాస్త్రం’ చిత్రాల్ని నిర్మించారు. ఆయన తాజా చిత్రం ‘నిన్న నేడు రేపు’ విడుదలకు సిద్ధంగా వుంది. కాంగ్రెస్ నాయకుడు కూడా అయిన నూకారపు దృష్టి టాప్ హీరోల మీద వుంది. పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలని భావిస్తున్న ఆయన అధిక మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇప్పటికే పవన్‌కు ఆయన 2 కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించినట్లు ఫిల్మ్‌నగర్ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నూకారపు ఇంటికి వచ్చిన పవన్, ఆయనతో కలిసి అక్కడే భోజనం చేశారని తెలిసింది. ఈ సందర్భంగా ‘పులి’ పూర్తయిన వెంటనే నూకారపుకు సినిమా చేస్తానని పవన్ హామీ ఇచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఆ ప్రాజెక్ట్ 2009 జనవరిలో మొదలవుతుంది. ఈ సినిమాకు దర్శకుడెవరనేది వెల్లడి కావలసి వుంది.