Parugu

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

‘పరుగు’లెత్తిన ప్రథమార్ధం.. బరువెక్కిన ద్వితీయార్ధం!

ఇదివరకు తండ్రీ కొడుకుల మధ్య వుండే అనుబంధాన్ని ‘బొమ్మరిల్లు’లో గొప్పగా చిత్రీకరించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన దర్శకుడు భాస్కర్ ఇప్పుడు ఒక తండ్రి తన కూతుళ్లను ఎంతగా ప్రేమిస్తాడో, వారి కోసం ఎంతగా తపన పడతాడో చూపిస్తూ ‘పరుగు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కథాంశాన్నీ, డైలాగుల్నీ పరిగణనలోకి తీసుకుంటే, ‘పరుగు’ సినిమా చిరంజీవి కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని స్ఫురణకు తీసుకు వస్తుంది. ‘ప్రేమించడం తప్పు కాదు కానీ, తల్లిదండ్రుల అభీష్ఠానికి విరుద్ధంగా లేచిపోవడం తప్పు’ అని ఈ సినిమా ద్వారా చెప్పాడు భాస్కర్. తన కుటుంబానికి సంబంధించిన కథే కావడంతో అల్లు అర్జున్ ఎంతో ఇన్వాల్వయి, కథానాయకుడి పాత్రను సమర్థవంతంగా పోషించాడు. తండ్రి పాత్రను ప్రకాష్‌రాజ్, కూతుళ్ల పాత్రల్ని పూనమ్ బజ్వా, షీలా చేసిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బానర్‌పై దిల్ రాజు నిర్మించారు. మే 1న ఈ సినిమా విడుదలయ్యింది. 

కథ:

మందీ మార్బలం అధికంగా వుండే నీలకంఠం (ప్రకాష్‌రాజ్) పెద్ద కూతురు సుబ్బలక్షి (పూనమ్ బజ్వా) పెళ్లి రోజు తన ప్రియుడు ఎర్రబాబుతో లేచిపోతుంది. ఇది భరించలేని నీలకంఠం ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు. తన కూతురి ప్రియుడి స్నేహితుల్ని పట్టుకుని వారి ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి యత్నిస్తాడు. ఆ స్నేహితుల్లో కృష్ణ (అల్లు అర్జున్) ఒకడు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణ సరదా కుర్రాడు. నీలకంఠం ఊరికి వచ్చిన అతను అక్కడ తెల్లవారుజాము లేలేత మంచులో ఒక అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెవరో కాదు నీలకంఠం చిన్న కూతురు మీనా (షీలా). అయితే ఆ సంగతి మొదట కృష్ణకు తెలీదు. తెలిశాక ఏం చేశాడు? మీనా కూడా అతణ్ణి ప్రేమించిందా? తన అక్క మాదిరే తను కూడా కృష్ణతో లేచిపోవాలనుకుందా? లేక తండ్రి మాటకు విలువిచ్చి ఆయన చూసిన సంబంధాన్నే చేసుకుందా? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.  మందీ మార్బలం అధికంగా వుండే నీలకంఠం (ప్రకాష్‌రాజ్) పెద్ద కూతురు సుబ్బలక్షి (పూనమ్ బజ్వా) పెళ్లి రోజు తన ప్రియుడు ఎర్రబాబుతో లేచిపోతుంది. ఇది భరించలేని నీలకంఠం ఆమె కోసం వెతకడం మొదలు పెడతాడు. తన కూతురి ప్రియుడి స్నేహితుల్ని పట్టుకుని వారి ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి యత్నిస్తాడు. ఆ స్నేహితుల్లో కృష్ణ (అల్లు అర్జున్) ఒకడు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణ సరదా కుర్రాడు. నీలకంఠం ఊరికి వచ్చిన అతను అక్కడ తెల్లవారుజాము లేలేత మంచులో ఒక అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమెవరో కాదు నీలకంఠం చిన్న కూతురు మీనా (షీలా). అయితే ఆ సంగతి మొదట కృష్ణకు తెలీదు. తెలిశాక ఏం చేశాడు? మీనా కూడా అతణ్ణి ప్రేమించిందా? తన అక్క మాదిరే తను కూడా కృష్ణతో లేచిపోవాలనుకుందా? లేక తండ్రి మాటకు విలువిచ్చి ఆయన చూసిన సంబంధాన్నే చేసుకుందా? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా. 

కథనం:

దర్శకుడు భాస్కర్‌లో ప్రతిభా సామర్థ్యాలకు కొదవ లేదనే సంగతికి ‘పరుగు’ మరో ఉదాహరణ. ఒక క్లిష్టమైన కథాంశాన్ని ఎంచుకుని దానికి అతడు రాసుకున్న సన్నివేశాలు ఆ సంగతిని స్పష్టం చేస్తాయి. ప్రథమార్ధాన్ని అతడు చాలా బాగా చిత్రించాడు. వినోదానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చి సన్నివేశాల్ని కల్పించాడు. ‘బొమ్మరిల్లు’ కథ తండ్రీకొడుకులదైనా, హాసిని (జెనీలియా) పాత్రను ఎలా ఉన్నతంగా చిత్రించాడో అలాగే, ‘పరుగు’ కథ తండ్రీకూతుళ్లదైనా, కృష్ణ (అర్జున్) పాత్రను అంత చక్కగా తెర మీదకు తీసుకు వచ్చాడు. ఆ పాత్రను మనం ఇన్‌స్టంట్‌గా ప్రేమించేస్తాం. తనతో సహా తన బృందాన్ని నీలకంఠం ఒక కొట్టంలాంటి ఇంట్లో బంధిస్తే, అక్కణ్ణించి అతడు చేసే సరదా చేష్టలు మనల్ని వినోదింప జేస్తాయి. అక్కణ్ణించే అతడు నీలకంఠం చిన్న కూతురితో జరిపే సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి. నీలకంఠం బృందాన్ని అతడు ఆటాడించే తీరు కూడా ముచ్చటేస్తుంది. తను లేత మంచులో చూసిన దివ్య మంగళ రూపం, అప్పటిదాకా ముఖం చూడకుండా తను సంభాషిస్తూ వచ్చిన నీలకంఠం చిన్న కూతురు మీనాదేనని అతడికి తెలిసే సన్నివేశం మనలో మంచి ముద్ర వేస్తుంది. దాన్నే ఇంటర్వెల్ సన్నివేశంగా మలచుకోవడం దర్శకుడి సృజనాత్మకతను పట్టిస్తుంది. ఇక్కడవరకు బాగానే వుంది. ఆ తర్వాతే భాస్కర్ కథను ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే విషయంలో తికమకకు గురయ్యాడు. రెండు భిన్న భావనల్లో ఏది సరైనదనే సంగతిని స్పష్టం చేయడానికి అతడు కల్పించిన సన్నివేశాలు ఆ తికమకకు తావిచ్చాయి. 
‘ప్రేమించడం తప్పు కాదు. ప్రియుడితో లేచిపోవడం తప్పు కాదు’ అని నమ్మే కృష్ణ చివరకు ‘నేను తప్పు చేశాను’ అనే భావనకు వస్తాడు. ఎందుకంటే సుబ్బలక్ష్మి, ఎర్రబాబు లేచిపోవడానికి సాయపడింది అతడే. సుబ్బలక్ష్మి అలా చేయడం వల్ల నీలకంఠంలోని తండ్రి ఎంతగా కుమిలిపోతున్నాడో, ఆమె క్షేమం గురించి తలచుకుని ఎంతగా అల్లాడిపోతున్నాడో కృష్ణ ప్రత్యక్షంగా చూశాడు. ఆ భావన అతడిలో కలగడానికి సుబ్బలక్ష్మిని అన్వేషించడంలో నీలకంఠంతో బాటుగా అతడూ ప్రయాణాన్ని కొనసాగించినట్లు సన్నివేశాలు అల్లాడు దర్శకుడు. అది బాగానే వుంది. కానీ భాస్కర్ అదే భావనని సుబ్బలక్ష్మిలో కలగజేసి ఉంటే అది మరింత రక్తి కట్టి వుండేది. సుబ్బలక్ష్మిని నీలకంఠం కనిపెట్టి, ఆమె ప్రియుణ్ణి కొట్టినప్పుడు ఆమె ఏమంటుంది? "అతడి మీద మరో దెబ్బ వేస్తే ఊరుకోను. నేనతణ్ణి ఇష్టపడే అతడితో పాటు వచ్చేశాను. అతణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే మీరు ఒప్పుకునేవారా? ఎందుకు మా వెంట కుక్కల్లా పడతారు?" అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలకి భాస్కర్ సమాధానం చెప్పలేకపోయాడు. నిజమే. సుబ్బలక్ష్మి తన ప్రేమ సంగతి చెబితే నీలకంఠం ముమ్మాటికీ ఒప్పుకునేవాడు కాదు. అలాంటప్పుడు ప్రేమికులకు ఏది గతి? అనేది ప్రశ్న. ‘ఖచ్చితంగా లేచిపోవడం మాత్రం కాదు’ అని చెప్పాలనుకుంటే దానికి పరిష్కారాన్ని అతడు సూచించాలి. అయినా సుబ్బలక్ష్మి తండ్రిని ‘మావెంట కుక్కల్లా ఎందుకు వెంటపడతారు?’ అని అడగడం దారుణమనిపిస్తుంది. ఆ మాటలతో నీలకంఠం మనసు గాయపడుతుంది. తాగి అతడు తన కూతురి పట్ల వున్న ప్రేమని వ్యక్తీకరిస్తుంటే కృష్ణ చలించిపోతాడు.  
అంతదాకా మీనాను తనతో పాటు లేపుకుపోయి నీలకంఠానికి గట్టి బుద్ధి చెప్పాలనుకున్న అతడు మనసు మార్చుకుంటాడు. కానీ అతడిలో కలిగిన కనువిప్పు సుబ్బలక్ష్మిలో కలుగలేదు. తను చేసిన పని సరైనదేననే అభిప్రాయంతోటే వుంది. కోటీశ్వరుల ఇంట్లో పుట్టినా మురికి కంపుకొట్టే లాడ్జిలో వుండేందుకు కూడా ఆమె ఇబ్బంది పడలేదు. ఆ తర్వాత కూడా ఆమె తన ప్రియుడి సమక్షాన్నే కోరుకుంది. అలాంటప్పుడు సుబ్బలక్ష్మి కరెక్టా, నీలకంఠం కరెక్టా? కూతురు తను ఎర్రబాబుతోటే వుంటానని అన్నప్పుడు ఒక్కసారిగా మంచివాడై పోవడమేమిటో అర్ధం కాదు. అతడిలో అంతటి మంచితనమే వుంటే కృష్ణ బృందాన్ని చిత్రహింసలు పెట్టలేదు. కొట్టంలో బంధించి వుండలేడు. అంటే నీలకంఠం పాత్ర చిత్రణలో లోపముంది. మీనా పాత్ర కూడా తక్కువ తినలేదు. ఆమె మరీ అమాయకంగా వ్యవహరిస్తుంది. ఆమెకు సొంత వ్యక్తిత్వమంటూ కనిపించదు. ‘కుర్రాళ్ల కళ్లలో కళ్లుపెట్టి చూస్తే పడగొట్టేస్తారు’ అని పనిమనిషి చెబితే దాన్ని నిజమనుకుని, కృష్ణ కళ్లలో కళ్లుపెట్టి చూడటానికి భయపడుతుంది. అంటే ఆమెకు తనమీద తనకే నమ్మకం లేదన్నమాట. చివరిదాకా ఆమె ప్రవర్తన అంతే. అందుకే ఆ పాత్ర తీరు మనకి చికాకు తెప్పిస్తుంది. ద్వితీయార్ధంలో కథ హైదరాబాద్‌కు మారినప్పట్నించీ వినోదం పాలు బహుతక్కువై మెలోడ్రామా బరువు ఎక్కువైంది. అది సినిమాకు నష్టాన్ని కలుగజేసింది. అందువల్లే ప్రథమార్ధాన్ని ఆస్వాదించగలిగే సగటు ప్రేక్షకుడు ద్వితీయార్ధాన్ని ఆమోదించలేడు. క్లైమాక్స్ సన్నివేశాలు అల్లు అర్జున్ ఇమేజ్‌కి అడ్డం వచ్చాయి. ‘దేశముదురు’లో దుండగుల్ని చావచితగ్గొట్టిన అతడు ఆ వెంటనే వచ్చిన ‘పరుగు’లో సెంటిమెంటుతో ముడిపడిన బరువైన క్లైమాక్స్‌లో బరువైన డైలాగులు చెబుతుంటే అతడి అభిమానులే జీర్ణం చేసుకోలేరు.  

పాత్రధారుల అభినయం:

నటుల పరంగా ఈ సినిమా ఇద్దరిదని చెప్పాలి. ఒకరు అర్జున్, మరొకరు ప్రకాష్‌రాజ్. కృష్ణ పాత్రకి అర్జున్ అతికినట్లు సరిపోయాడు. దర్శకుడి ఊహల్లోని కృష్ణ పాత్రకు ఆహార్యం దగ్గర్నుంచి న్యాయం చేసుకుంటూ వచ్చాడు. ప్రథమార్ధం ఆంతా తానై సినిమాకి జీవం తెచ్చాడు. సరదా సన్నివేశాలు చేయడంలో ఇప్పటికే తానేమిటో తెలియజేసిన అర్జున్ ఇందులోనూ ఆ తరహా సన్నివేశాల్ని అలవోకగా చేసుకుపోయాడు. ద్వితీయార్ధంలోని బరువైన సన్నివేశాల్ని కూడా సమర్ధవంతంగా చేసి మెప్పించాడు. తనలో ఆల్‌రౌండర్ ఉన్నాడనిపించుకున్నాడు. నీలకంఠం పాత్రను ప్రకాష్‌రాజ్ గొప్పగా పోషించాడు. అయితే ఆ పాత్రను చేయడానికి అతడి ఇమేజే అడ్డయిందని చెప్పక తప్పదు. ఆ పాత్రలోని ద్వైదీభావానికి తగ్గట్లు నటించాడు. ద్వితీయార్ధం అతడి పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ. పెద్దకూతురు సుబ్బలక్షి ప్రవర్తనకు బాధపడే సన్నివేశాల్లోనూ, క్లైమాక్స్‌లో ఎక్కడ చిన్న కూతుర్ని కృష్ణ లేపుకు పోతాడోనని ఆదుర్దా ప్రదర్శించే సన్నివేశాల్లోనూ ప్రకాష్‌రాజ్ నటన అత్యున్నత స్థాయిలో వుంది. కథానాయిక మీనా పాత్రను షీలా బాగానే చేసింది. ఆ పాత్ర ధోరణిని అర్ధం చేసుకుని అందుకు తగ్గట్లు నటించింది. కానీ ఆమె చూడగానే మోహించేంత సుందరాంగి కాకపోవడమే మీనా పాత్రకు జరిగిన అన్యాయం. ఆమె ముఖంలో కట్టిపడేసే సౌందర్యమేమీ లేదు. ఆ పాత్రకి అందమైన అమ్మాయిని తీసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మిగాతా నటుల్లో ఆకట్టుకునేది సునీల్. అర్జున్ స్నేహితుల్లో ఒకడిగా అతడు వినోదాన్ని పంచాడు. అర్జున్ తల్లిగా కనిపించేది తక్కువ సేపయినా జయసుధ మరోసారి ఆకట్టుకుంటుంది. ప్రకాష్‌రాజ్ తమ్ముడి పాత్రకి సుబ్బరాజు సరిపోయాడు.

టెక్నీషియన్ల పనితనం:

దర్శకుడి తర్వాత టెక్నీషియన్లలో మొదట ఆకట్టుకునేది మణిశర్మ సంగీతమే. అతడు సంగీతం సమకూర్చిన పాటలు చాలావరకు వినసొంపుగా వున్నాయి. తొలిపాట ‘చల్ చల్ చలో’ నుంచే అది స్పష్టం. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. ‘పరుగులు తీయకే పసిదానా’ పాటను చిత్రీకరించిన తీరు దర్శకుడి ప్రతిభకు మరో నిదర్శనం. మణిశర్మ కూర్చిన నేపథ్య సంగీతమూ ఉన్నత స్థాయిలో వుంది. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్‌నెస్ తీసుకువచ్చింది. ప్రథమార్ధంలో కృష్ణ బృందం పారిపోవడానికి యత్నించే సన్నివేశాలు, మంచులో మీనాని కృష్ణ చూసే సన్నివేశంలో కెమెరా గొప్పగా పనిచేసింది. త్వరలోనే టాప్ సినిమాటోగ్రాఫర్ల లిస్టులో అతను చేరతాడు. అయితే గ్రాఫిక్ వర్క్ విషయంలో మరింత శ్రద్ధపెట్టి వుండాల్సింది. ఈ సినిమా కథకు సంభాషణల ప్రాధాన్యం ఎక్కువ. ఆ పనిని బివిఎస్ రవి సమర్ధంగా నిర్వర్తించాడు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ప్రథమార్ధం ఆకట్టుకుంది. అయితే ద్వితీయార్ధంలో మెలోడ్రామా అధికమై కథ బరువెక్కిన సంగతిని ఆయన గ్రహించలేక పోయాడు.

బలాలు, లోపాలు:

ప్రథమార్ధం, కామెడీ సన్నివేశాలు, అల్లు అర్జున్, ప్రకాష్‌రాజ్ నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ బలాలు. ద్వితీయార్ధంలోని మెలోడ్రామా, ‘పరుగు’ తగ్గిన కథనం, కృష్ణ పాత్రకు అడ్డుపడే అర్జున్ ఇమేజ్, హీరోయిన్ పాత్రలో ఆకట్టుకోని షీలా, బలహీనమైన క్లైమాక్స్ లోపాలు. దర్శకుడి ప్రతిభకు దర్పణంగా నిలిచే ‘పరుగు’ ప్రేక్షకుల్ని ఏ రీతిన మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. 

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: