Pandurangadu

Rating: 3.25/5

Critic Rating: (3.25/5)

మనసుని రంజింపజేసే ‘పాండురంగడు’

వేసవిలో ఒక మంచి సినిమా కోసం ఎదురు చూసిన ప్రేక్షకుల నిరీక్షణ చాలా ఆలస్యంగా ఫలించింది. వేసవి సెలవులు ఇంకొద్ది రోజుల్లో ముగుస్తాయనంగా వారి మనసుల్ని రంజింపజేసే సినిమా వచ్చింది. చిత్రంగా అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. రెగ్యులర్ సోషల్ సినిమా కాదు. అది ఒక భక్తిరస చిత్రం. పూర్తిగా కల్పన మీద ఆధారపడిన పౌరాణికాంశాలు మేళవించిన ఫాంటసీ చిత్రం. అది ‘పాండురంగడు’. నిజమే. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ‘పాండురంగడు’ మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాదు, హృదయాల్ని ద్రవింపజేశాడు కూడా. ఎంతో కాలంగా ఎన్నో ‘పవర్‌ఫుల్’ పాత్రలు చేసినా మెప్పించలేక పోయిన నందమూరి బాలకృష్ణ స్త్రీలోలుడు, జులాయి నుంచి పరమ భక్తుడిగా రూపాంతరం చెందే ‘పుండరీక రంగనాథుడు’గా గొప్పగా రాణించి, మెప్పించాడు. ‘భైరవ ద్వీపం’ తర్వాత అంతకు మించిన చక్కని పాత్రతో తనేమిటో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఆయన సరసన స్నేహ, టాబు నటించారు. రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహనరావు ఆర్.కె. అసోసియేట్స్ బానర్ మీద నిర్మించిన ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

కథ:

ఎన్టీఆర్ నటించిన మునుపటి ‘పాండురంగ మహత్యం’ సినిమా చూసిన వాళ్లకు ‘పాండురంగడు’ కథ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా చూడనివాళ్లకు ‘పాండురంగడు’ను పరిచయం చేయాల్సిందే. పండరీపురంలోని పుండరీక రంగనాథుడి (బాలకృష్ణ)కి కృష్ణుడు ఆదర్శం. అంటే కృష్ణుడు లీలామానస చోరుడు, అష్ట భార్యలు, పదహారువేల మంది గోపికలతో ఎప్పుడూ శృంగారంలో మునిగి తేలుతూ వుంటాడు కాబట్టి తాను ఆ విషయంలో శ్రీకృష్ణుణ్ణి అధిగమించాలని భావిస్తుంటాడు. చిన్నతనంలో అతడు చేసే కొంటె చేష్టల్ని ఊరి జనం భరించలేక పోతారు. పెళ్లి చేసుకుంటేనైనా దారిలోకి వస్తాడేమోనని తల్లిదండ్రులు (కె. విశ్వనాథ్, శివపార్వతి) భావిస్తారు. దాంతో అతడు ఇల్లువిడిచి పలు దేశాలు తిరిగి, అక్కడి సుందరాంగులతో గడిపి, చాలా రోజుల తర్వాత తిరిగివస్తాడు. అతడు మారిపోయాడేమోనని ఆశించిన అతడి కుటుంబం అలా జరుగకపోయేసరికి విచారంలో మునుగుతుంది. ఆడపిల్లల తండ్రులొచ్చి రంగనాథుడిమీద చేసే ఫిర్యాదులకు అంతు వుండదు. ఆ సమయంలో పక్క గ్రామానికి వచ్చిన అమృత (టాబు) అనే అందమైన రంగసాని ఆకర్షణలో పడతాడు రంగనాథుడు. అప్పట్నించీ ఆమె జపమే. ఆమెతోడి శృంగారమే. మరో గ్రామంలోని లక్ష్మి (స్నేహ) అనే యువతి శ్రీకృష్ణుని పరమ భక్తురాలు. ఒకరోజు రాత్రి కలలో ఆమెకు కృష్ణుడు కనిపించి రంగనాథుడికి భార్యవి కమ్మని చెబుతాడు. అయితే తాను పెళ్లి చేసుకొననని సంబంధం కోసం వచ్చిన లక్ష్మి తండ్రి ఎదుటే చెబుతాడు రంగనాథుడు. దాంతో తనే రంగనాథుడి ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి చేరువవుతుంది లక్ష్మి. ఆ ఇంటి ఎదుట వున్న చెట్టుని ఆవాసం చేసుకుని శ్రీకృష్ణుని పూజిస్తూ నిరాహార దీక్ష చేస్తుంది. ఆమెను చూసి ‘పప్పుసుద్ద’ అని హేళన చేస్తాడు రంగనాథుడు. పెళ్లి మాత్రం చేసుకోననీ, కావాలంటే రెండు ఝాములు గడుపుతాననీ అమెతోటే అంటాడు. ఇదంతా దివినుంచి శ్రీకృష్ణుడూ, ఆయన అష్ట భార్యలూ గమనిస్తుంటారు. రంగనాథుడు, లక్ష్మిల పెళ్లి జరగడం కోసం స్వయంగా భువికి వస్తాడు కృష్ణుడు. ఆ పెళ్లి జరుగుతుంది. కానీ అమృత వూరుకుంటుందా? ఆమె ఏం చేసింది? రంగనాథుడు ఆమె వలలోంచి బయటపడి, లక్ష్మితో సంసారాన్ని సాగించాడా? తల్లిదండ్రుల పట్లా, భార్య పట్లా నిర్దయగా వ్యవహరించిన రంగనాథుడు చివరికి ఏమయ్యాడు? అనేది మిగతా కథ.    

కథనం:

ఇదివరకు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి భక్తిరస చిత్రాలను తనదైన విలక్షణ శైలితో రూపొందించి మెప్పించిన రాఘవేంద్రరావు మరోసారి ‘పాండురంగడు’తో తన దర్శక మాయాజాలాన్ని ప్రదర్శించాడు. రంగనాథుడు స్త్రీలోలుడు కాబట్టి, ప్రథమార్ధాన్ని రక్తికీ, ద్వితీయార్ధాన్ని భక్తినీ కేటాయించి ఇంద్రజాలం చేశాడు. ప్రథమార్ధంలో రంగనాథుడి శృంగార చేష్టలకు ప్రాధాన్యతనివ్వడం సినిమాకి కమర్షియల్ కోణాన్ని ఇచ్చేందుకేననేది స్పష్టం. ఇప్పటి రోజుల్లో కేవలం భక్తినే చూపిస్తే ఆదరించే ప్రేక్షకులు తక్కువ. అందుకే దర్శకుడు భక్తి రసానికి సమపాళ్లలో శృంగార రసాన్ని జోడించాడు. మునుపటి రెండు భక్తి చిత్రాలతో పోలిస్తే ‘పాండురంగడు’లో శృంగారం పాలు ఎక్కువ. ఆ పాత్ర తీరే అటువంటిది కాబట్టి దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత జె.కె. భారవి శృంగారానికి ఎక్కువ తావిచ్చారు. అయితే అమృత పాత్రని చేసిన టాబు మధ్యవయసుకు చేరువవుతున్న కాలంలో కురిపించిన శృంగారం రసికజనుల్ని అలరిస్తే సగటు మహిళా ప్రేక్షకులు మాత్రం కుర్చీల్లో ఇబ్బంది పడకుండా వుండలేరు. ‘పాండురంగ మహత్యం’లో కళావతిగా బి. సరోజాదేవి చేసిన పాత్రతో పోలిస్తే టాబు చేసిన అమృత పాత్ర పరిధి కూడా కాస్త పెద్దదే. ప్రథమార్ధంలో అమృతతో రంగనాథుడి శృంగారానికి పెద్దపీట వేసి అలరింపజేసిన దర్శకుడు లక్ష్మి పాత్రను వుపయోగించుకుంటూ క్రమంగా సినిమాను భక్తి మార్గం వైపు మళ్లించాడు. ఆ మళ్లించడంలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడని రాఘవేంద్రరావుకు బాగా తెలుసు. అందుకే శ్రీకృష్ణుడి పాత్రను లాఘవంగా వుపయోగించుకుంటూ, సన్నివేశాలలో బిగి సడలకుండా చూసుకుంటూ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం అయ్యేలా చేయడంలో ఆయన సఫలమయ్యాడు. అష్ట భార్యలు, నారదుడి (ఎల్బీ శ్రీరామ్)తో శ్రీకృష్ణుడి సన్నివేశాల్ని ఆయన బాగా చిత్రించారు. ద్వితీయార్ధంలో రంగనాథుడు, లక్ష్మి పాత్రల్ని ఆయన తీర్చిదిద్దిన తీరు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. చివరి అరగంట సినిమాకు ఆయువుపట్టు అనడంలో సందేహం లేదు. రసికుడి నుంచి భక్తుడిగా రంగనాథుడిలో పరివర్తన కలిగే తీరు ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుంది. ఆ సన్నివేశాలను రచయిత ఏమాత్రం విసుగు జనించని రీతిలో సృష్టిస్తే, వాటిని అంతే సమర్ధంగా చిత్రించాడు దర్శకుడు. అయితే అమృత పాత్రను అర్ధంతరంగా వదిలేయడం, ఆమె తల్లి దుర్మార్గానికి ముగింపు లేకపోవడం వెలితిగా తోస్తుంది. అలాగే ఒక సన్నివేశంలో అమృతలాగా వేషం వేసిన కృష్ణుడు స్వయంగా అమృత ఇంటినుంచి రంగనాథుణ్ణి అతని ఇంటికి తీసుకువచ్చి వదులుతాడు. కానీ ఆ మరుక్షణం నుంచి తనను అక్కడుకు తీసుకొచ్చిన అమృతను మరుస్తాడు రంగనాథుడు. అది దేవుడి లీలగా సరిపెట్టుకోవాలేమో.

నటీనటుల అభినయం:

రంగనాథుడిగా, శ్రీకృష్ణుడిగా బాలకృష్ణ అత్యత్తమ నటనను ప్రదర్శించాడు. మొదట స్త్రీలోలునిగా, తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలకి మచ్చతెచ్చే చెడ్డవానిగా, చివరలో పరివర్తన కలిగి, కృష్ణభక్తునిగా మారేవాడిగా పాత్రలోని భిన్న కోణాల్ని ఆయన గొప్పగా అభినయించాడు. చివరి సన్నివేశాల్లో అయితే ఆయన నటన పరాకాష్ఠకు చేరింది. ఇక శ్రీకృష్ణునిగా ఆయన అభినయం కూడా మెచ్చదగ్గది. ఎన్టీఆర్ తర్వాత ఆ పాత్రలోని అల్లరితనాన్నీ, మృదుత్వాన్నీ అంత అందంగా ప్రదర్శించగలిగేది తానేనని బాలకృష్ణ రుజువు చేసుకున్నాడు. కృష్ణ భక్తురాలు లక్ష్మిగా స్నేహ మరో చక్కని పాత్రలో పరిణతిని ప్రదర్శించింది. అలనాటి సినిమాలో రమగా చేసిన అంజలీదేవికి ఆమె సరితూగకపోయినా లక్ష్మి పాత్రకి న్యాయం చేసిందనడంలో సందేహం లేదు. బాగా ఆకట్టుకున్నది అమృత పాత్రధారిణి టాబు. వయసు మీదపడుతున్నా అంగాంగ ప్రదర్శనతోనూ, అభినయంతోనూ ఆమె అలరించింది. అయితే ఆమె నుంచి ఈస్థాయి వొంపుసొంపుల ప్రదర్శన ఊహించనిది. రంగనాథుని తల్లిదండ్రులుగా కె. విశ్వనాథ్, శివపార్వతి పాత్రోచితంగా నటించారు. అమృత తల్లి పాత్రలో చాలా రోజుల తర్వాత వై. విజయ కనిపించి, మెప్పించింది. శిరోజాల రాజాగా సునీల్ కొద్దిసేపు హాస్యాన్ని పంచాడు. రంగనాథుని కుటుంబంలోని వ్యక్తులుగా ప్రసాద్‌బాబు, సమీర్, సన, లక్ష్మి తండ్రిగా బాలయ్య, అన్నగా అనంత్, కృష్ణుని అష్ట భార్యలుగా వేద, సుహాసిని తదితరులు, నారదునిగా ఎల్బీ శ్రీరామ్, అమృత అక్కగా అపూర్వ పరిధుల మేరకు నటించారు. మోహన్‌బాబు కూడా కొద్దిసేపు కనిపించారు.  

సాంకేతిక నిపుణుల పనితనం:

సినిమాలో దర్శకుని తర్వాత మొదటగా చెప్పుకోవాల్సింది రచయిత గురించి. పాత్రల తీరుతెన్నులకు తగినట్లు, సందర్భోచితంగా సంభాషణలు రాసి సినిమాను రక్తి కట్టించాడు రచయిత భారవి. ఆ తర్వాత యం.యం. కీరవాణి గురించి చెప్పుకోవాలి. ఆయన సంగీతం సమకూర్చిన పాటలన్నీ మధురంగా వినిపించాయి. శ్లోకాలూ అలరించాయి. చాలాకాలం తర్వాత కర్ణపేయమైన సంగీతాన్ని విన్న అనుభూతి కలుగుతుంది. ఇక సన్నివేశాలకు ఆయన కల్పించిన నేపథ్య సంగీతం కూడా ఉత్తమ స్థాయిలో వుంది. వినేందుకు పాటలు ఎంత మధురంగా వున్నాయో, వాటిని అంత అందంగా తెరమీదకు తీసుకొచ్చాడు సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్. సంప్రదాయ లైటింగునే వినియోగించి ఒక కళాఖండంగా ‘పాండురంగడు’ కనిపించడంలో ఆయన తనవంతు పాత్ర నిర్వర్తించాడు. శృంగార సన్నివేశాలను ఎంత చక్కగా చిత్రించాడో, బరువైన సన్నివేశాల్ని కూడా అంత గాఢతతో చిత్రించి తన పనితనాన్ని చాటుకున్నాడు. ఈ తరహా సినిమాలకు కళాదర్శకుడికి పని ఎక్కువ. తన పనిని ఆయన సమర్ధవంతంగా నెరవేర్చాడు. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది.

బలాలు, లోపాలు:

రంగనాథుడు, శ్రీకృష్ణుడిగా ద్విపాత్రల్లో బాలకృష్ణ అత్యుత్తమ నటన, టాబు పోషించిన అమృత పాత్ర, ప్రథమార్ధంలోని శృంగారం, బిగువైన కథనం, క్లైమాక్స్ సన్నివేశాలు, సంగీతం, ఛాయాగ్రహణం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ బలాలు. మహిళలకి ఇబ్బంది కలిగించే శృంగార సన్నివేశాలు, ప్రధాన పాత్రలు మినహాయిస్తే మిగతా పాత్రలకు తగ్గ నటీనటుల్ని ఎన్నుకోకపోవడం (ఎక్కువగా టీవీ తారలు కనిపించడం), రంగనాథుడి పాత్రలోని చెడ్డ గుణాలు, అమృత, ఆమె తల్లి పాత్రలకు సరైన ముగింపు లేకపోవడం లోపాలు. హాస్యం తగుపాళ్లలో లేకపోవడం కూడా మరో లోపం. మొత్తంగా చూస్తే యువతరాన్ని కూడా ఆకట్టుకునే సమ్మోహన శక్తి ఈ సినిమాకి వుంది.

…యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: