Ontari

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

గజిని+నా ఊపిరి=ఒంటరి

తమిళంలోనే గాక తెలుగులోనూ ‘గజిని’ పెద్ద హిట్టయ్యింది. స్కూలు పిల్లల్లోనూ ఆ సినిమాలోని ‘హృదయం ఎక్కడున్నది..’ పాపులరయింది. అలాంటి కథ కాకపోయినా ఆ తరహా కథనంతో వచ్చిన సినిమా ‘ఒంటరి’. ‘గజిని’లా పాపులర్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమా తెలుగులో రెండున్నరేళ్ల క్రితం ఒకటి వచ్చింది. దాని పేరు ‘నా ఊపిరి’. ఆ సినిమాకీ ‘ఒంటరి’కీ కూడా బాగా పోలికలున్నాయి. అంటే ‘గజిని’, ‘నా ఊపిరి’ సినిమాల మేళవింపు ‘ఒంటరి’ అని చెప్పడం పొరబాటు కాబోదు. అదెలాగో ‘కథ’, ‘కథనం’లో మనకి తెలుస్తుంది. తెలుగు చిత్రసీమలో ఈతరం ఫిలిమ్స్‌కి ప్రత్యేక స్థానముంది. అభ్యుదయ, సామాజిక ప్రయోజన చిత్రాల నిర్మాణ సంస్థగా దానికి మంచి పేరుంది. ‘యజ్ఞం’ నుంచి ఆ ధోరణిని ఆ సంస్థ విడిచిపెట్టినట్లు మనకి తోస్తుంది. ‘రణం’తో అది ఖాయమయింది. ఆ రెండు సినిమాల్లోనూ హీరో గోపీచందే. ‘ఒంటరి’ మూడో సినిమా. ఇదివరకు ‘గౌరి’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాని రూపొందించిన బి.వి. రమణ ఈ సినిమాకి దర్శకుడు.

కథ:

వంశీకృష్ణ (గోపీచంద్) విశాఖపట్నంలోని ఒక ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబానికి చెందిన కుర్రాడు. కనక మహాలక్ష్మి అలియాస్ బుజ్జి (భావన) అనే అందమైన కాలేజీ అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అనాథ అయిన ఆమె ప్రేమ పొందడం కోసం తాను సిబిఐ ఆఫీసర్‌నని అబద్ధమాడి ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. కాలక్రమంలో తాను అబద్ధం చెప్పానని అతడే ఒప్పుకుంటాడు. ఆమె అతణ్ణి ద్వేషిస్తుంది. పాండా (అజయ్) అనే గూండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అతడికి బుద్ధి చెప్పి, ఆమె ప్రేమను పొందుతాడు వంశీ. హైదరాబాద్‌లో బడా గూండా అయిన లాల్ మహంకాళి (ఆశిష్ విద్యార్థి) తమ్ముడు ఆ పాండా. తమ్ముడికి జరిగిన అవమానానికి పగతో రగిలిన అతగాడు హాయిగా సాగుతున్న వంశీ, బుజ్జిల ప్రేమాయణంలో విషం చిమ్ముతాడు. ‘ఒంటరి’ అయిన వంశీ ఏం చేశాడు? తనని ఆ స్థితికి గురిచేసిన వారిని ఎలా అంతం చేశాడు? అనేది మిగతా సినిమా.

కథనం:

‘ఒంటరి’ కథనమంతా ‘గజిని’ కథనంతో పోలి వుంది. ‘గజిని’లో సూర్య తన ప్రేయసి అసిన్‌ను చంపిన హంతకుల్ని ఒకరొకరిగా చంపుతూ వుంటే సూర్య, అసిన్ మధ్య సాగే ప్రేమకథ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తూ ఉంటుంది. ‘ఒంటరి’ లోనూ అదే ఫార్మట్‌ని దర్శకుడు ఉపయోగించుకున్నాడు. వీర్రాజు (సుప్రీత్) అనే లాల్ మహంకాళి మనిషిని వంశీ రివాల్వర్‌తో కాల్చి చంపడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత విడతలు విడతలుగా కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి, వర్తమానంలోకి వస్తుంటుంది. వీర్రాజుని చంపాక అతడు వైజాగ్‌నుంచి హైదరాబాద్‌కు ప్రయాణమవుతాడు. అతడెక్కిన ట్రైన్‌లోనే బుజ్జి (భావన) కూడా హైదరాబాద్‌కు వస్తుంది. మరి ‘నా ఊపిరి’కీ, ఈ సినిమాకీ పోలికేమిటంటారా? ‘నా ఊపిరి’లో హీరో నవీన్ ‘విజువల్ హలూసినేషన్స్’తో బాధ పడుతుంటాడు. ఆ మెడికల్ టరమ్‌కి అర్ధం.. లేని వస్తువులు లేదా మనుషులు ఉన్నట్లుగా కంటికి కనిపించడం. అంటే అందులో తన భార్య (సంగీత)ని అమితంగా ప్రేమించిన నవీన్ ఆమె చనిపోయినా ఆమె తన వద్దే వున్నట్లు భ్రమిస్తూ, ఆమెతో మాట్లాడుతుంటాడు. అదే మానసిక స్థితి గోపీచంద్‌ది. కాకపోతే ‘నా ఊపిరి’ రివెంజ్ సినిమా కాదు. ఆ రివెంజ్‌ని ‘గజిని’ నుంచి తీసుకున్నారు కథకులు. ఈ సినిమాకి మొత్తం ముగ్గురు కథకులున్నట్లు టైటిల్స్‌లో చూపించారు. అంటే ఆ ముగ్గురూ జనం అంతగా చూడని ‘నా ఊపిరి’ అనే కూరలోకి, జనం బాగా చూసిన ‘గజిని’ అనే మసాలాని దట్టించి వండారన్నమాట.

వంశీ ఇంటి సన్నివేశాలనీ; వంశీ, బుజ్జి మధ్య పరిచయం కలిగే సన్నివేశాల్నీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా  చిత్రించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అంతదాకా తనకి మిత్రుడిగా కనిపించిన కార్మిక మంత్రి రాఘవ (రాజీవ్ కనకాల) తలని కత్తితో వంశీ నరకడం ప్రేక్షకులకి ఒక షాక్. అదే ఇంటర్వల్ బ్యాంగ్. ఇలా ఆసక్తికరమైన సన్నివేశాలతో నిండిన ఈ సినిమాకి ప్రతిబంధకంగా మారినదేమిటి? కొంత కథ, కొంత కథనం. గజినిలో ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలన్నీ డైరీల ద్వారా మనకు తెలుస్తాయి. వాటిని వేరే పాత్రలు.. మొదట పోలీసాఫీసర్ అయిన రియాజ్ ఖాన్, తర్వాత రెండో హీరోయిన్ అయిన నయనతార ద్వారా రివీలవుతాయి. ఇందులో హీరో వంశీ పాత్ర ద్వారానే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు రావడంవల్ల కథనం కాస్త కుంటుపడింది. ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్ నుంచి వర్తమానంలోకి వచ్చినప్పుడు ప్రేక్షకుడు కన్‌ఫ్యూజ్ అవుతాడు. దీనిని నివారించడం కోసం డైలాగుల ద్వారా ఇదివరకు కథ ఎక్కడ ఆగిందో ఆ సన్నివేశాన్ని చెప్పాల్సి వచ్చింది. ఉదాహరణకి లాల్, పాండాలు లిఫ్ట్‌లో వున్నప్పుడు ఆ లిఫ్ట్ వైర్లని తెగ్గొట్టి వాళ్లని చంపాలని చూస్తాడు వంశీ. లిఫ్ట్ అమాంతం కిందపడుతుంది. ఆ తర్వాత కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతుంది. ఆ ఎపిసోడ్ అయిపోయి, కథ వర్తమానంలోకి వచ్చాక లాల్, పాండాలు దెబ్బలతో కనిపిస్తారు. వారా స్థితిలో ఎందుకున్నారనే కన్‌ఫ్యూజన్ తలెత్తుతుంది. ‘గజిని’లో కథనం ఆసక్తిగా వుండడానికీ, ‘ఒంటరి’లో అలా లేకపోవడానికీ అదే కీలకం. తొలి అర్ధభాగంలో వచ్చే మూడు పాటలు కూడా హీరో ఇమాజినేషన్‌లోవే కావడం కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ‘విజువల్ హలూసినేషన్స్’తో బాధపడే వంశీ అంత కిరాతకంగా ఎందుకు శత్రువుల్ని చంపుతాడనేది ఒక సందేహం. సునీల్, అలీ వంటి టాప్ కమెడియన్లని దర్శకుడు సమర్ధవంతంగా వినియోగించుకోలేక పోయాడు. చెప్పడం మరిచాను. ‘గజిని’, ‘నా ఊపిరి’ సినిమాల్లో హీరోయిన్ అనాథ. ‘ఒంటరి’లోనూ సేమ్ టు సేమ్.

పాత్రధారుల అభినయం:

వంశీకృష్ణగా గోపీచంద్ మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమికుడిగా ఉన్నప్పుడు రవితేజ తరహా సరదా యాక్షన్‌ని ప్రదర్శించిన అతను, ఆ తర్వాత తన జీవితంలో విషం చిమ్మిన కిరాతకులపై ప్రతీకారం తీర్చుకునే యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గానూ బాగా రాణించాడు. వాస్తవానికి ఈ రెండో కోణం అతడికి అలవాటైన పనే. సరదా నటనలోనే అతను కాస్త ఇబ్బంది పడేవాడు ఇదివరకు. ‘ఒంటరి’లో ఆ అంశంలో అతను మంచి పరిణతి కనపరిచాడు. కనక మహాలక్ష్మి పాత్రతో తెలుగు తెరకి ఓ చక్కని నటి లభించింది. ఆమె భావన. ఇప్పటికే మలయాళ, తమిళ చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ అమ్మాయి కనక మహాలక్ష్మి అలియాస్ బుజ్జి పాత్రలో ముచ్చటగా ఉంది. తన నటనతో ఆకట్టుకుంది. తప్పకుండా ఆమెకి తెలుగులో భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఆశిష్ విద్యార్థి, అజయ్ ప్రతినాయక పాత్రలకు తగ్గట్లు రాణించారు. పోలీసాఫీసర్‌గా సాయాజీ షిండే తనదైన తరహాలో కనిపించాడు. రాజీవ్ కనకాల నటనా సామర్థ్యం మనకి తెలిసిందే. ఒక గోముఖ వ్యాఘ్రం వంటి పాత్రని అలవోకగా చేశాడు. సునీల్, అలీలను సక్రమంగా వినియోగించుకోలేక పోయారు. విలన్ వెంటవుండి అతడిమీదే చెణుకులు విసిరే పాత్రలో రఘుబాబు మెప్పిస్తాడు. హీరో తండ్రిగా పరుచూరి వెంకటేశ్వరరావు, అన్నగా నరేష్ పరిధుల మేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితనం:

తెలుగు ప్రేక్షకులు సాధారణంగా ఇష్టపడనటువంటి క్లైమాక్స్ వున్న ఈ సినిమాకి దర్శకుడు రమణే స్క్రీన్‌ప్లేని అందించాడు. ముందే చెప్పుకున్నట్లు అది ‘గజిని’ని గుర్తుకు తేవడం ఈ సినిమాకి మైనస్‌గా మారింది. మరుధూరి రాజా సంభాషణలు చాలా సన్నివేశాల్లో సాధారణంగా వున్నాయి. కొన్నిచోట్లే అతని కలం పదునుగా కనిపించింది. మణిశర్మ సంగీతం బాగుంది. పాటలన్నీ ఎక్కడో విన్నట్లనిపిస్తాయి. ఎక్కువ సన్నివేశాలకు లీడ్ కుదరకపోవడం వల్ల బలవంతంగా అవి వచ్చినట్లనిపిస్తాయి. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ ప్రమాణాలకు తగ్గట్లు వుంది. సన్నివేశాల్లోని మూడ్‌ని అతని కెమెరా బాగా పట్టుకుంది. విజయ్ సమకూర్చిన స్టంట్స్ మాస్‌ని బాగా మెప్పిస్తాయి. గౌతంరాజు ఎడిటింగ్ మెప్పించలేక పోయింది. కథనంలోని కన్‌ఫ్యూజన్‌ని అది విప్పలేకపోయింది. మధుసూదనరెడ్డి ఆడియోగ్రఫీ ఆకట్టుకుంది.

బలాలు, లోపాలు:

గోపీచంద్, భావన నటన, మణిశర్మ సంగీతం, సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్లు బలాలు. ‘గజిని’ని గుర్తుకు తెచ్చే కథనం, కథనంలో కన్‌ఫ్యూజన్, ‘నా ఊపిరిని’ని జ్ఞప్తిచేసే హీరో పాత్ర, తెలుగు ప్రేక్షకుల సెంటిమెంటుకు విరుద్ధమైన క్లైమాక్స్ ఈ సినిమాకి బలహీనతలు. యువ ప్రేక్షకులు ఆదరించే తీరుపైనే ఈ సినిమా బాక్సాఫీసు ఫలితం ఆధారపడి వుంది.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: