ఒక్క మగాడికి చిక్కులెక్కువ!
భారీ అంచనాల నడుమ, ఎంతో హంగామాతో జనవరి 11న విడుదల అయిన ఒక్క మగాడు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో సాధించింది. స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన వైవీఎస్ చౌదరి, హరికృష్ణ తోనే హిట్స్ ఇచ్చిన వైవీఎస్ చౌదరి తొలి సారి నందమూరి ఫ్యామిలీలో అతి పెద్ద మాస్ స్టార్ అయిన బాలకృష్ణతో కలిసి పని చేయడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్ని చుంబించాయి. అయితే ఆ అంచనాలకు మైళ్ళ దూరంలోనే నిలిచిపోయాడు ఒక్క మగాడు. సరయిన కథ రాసుకోకుండా బాలకృష్ణ వంటి స్టార్ హీరో ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ మిస్ చేశాడు వైవీఎస్ చౌదరి. పూర్తి వివరాలలోకి వెళితే…
కథ:
వెంకటాపురం అనే పల్లెటూరి లో సత్యనారాయణ స్వామి ని(బాలకృష్ణ) ప్రజలు దేవుడిలా కోలుస్తూ ఉంటారు. ఆ ఊరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీరుస్తూ ఉండే స్వామికి శారాదమ్మ అలియాస్ బేబీ అనే బామ్మ (సిమ్రాన్) ఉంటుంది. పండు ముసలి అయిన ఈమెకు “వందేమాతరం” అన్న మాట వినిపిస్తే పూనకం వచ్చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక్క మగాడు (బాలకృష్ణ వృద్ధ వేషం) అనే వ్యక్తి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఆది చేసిన వారికి తగిన బుద్ధి చెప్తుంటాడు. అయితే ఇతను నిజంగా ఒక్క మగాడా, లేక స్వామి మరో వేషమా అన్నది సస్పెన్స్‌లో ఉంచారు. అయితే వరుస హత్యలతో సంబంధం ఉందని భావించి సీబీఐ వారు సత్యనారాయణ స్వామిని అరెస్టు చేస్తారు. అప్పటికే స్వామికి ముఖ్యమంత్రి నంబూద్రి తో(అశుతోష్ రాణా) గొడవ జరిగి ఉంటుంది. అది కూడా స్వామి అరెస్టు కి ప్రేరెపిస్తుంది. అప్పుడు ఏమీ జరిగింది, ఒక్క మగాడు ఎవ్వరూ? అనేది తెర మీదే చూడాలి.
కథనం:
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం భారతీయుడు కథకు బాగా దగ్గరిగా ఉన్న ఈ కథలో పలు సన్నివేశాలు, ముసలి బాల కృష్ణ వేషధారణ కూడా అందులో కమల్ గెటప్ ని పోలి ఉంది. అయితే భారతీయుడు చిత్రానికి, దీనికి ఉన్న ప్రధాన భేదం “కథనం”. శంకర్ పక్కా స్క్రీన్‌ప్లే తో చిన్న లొసుగు కూడా వదిలి పెట్టకుండా పకడ్బందీగా ఆ కథను రాసుకుంటే చౌదరి చవకబారు సన్నివేశాలతో సినిమాను బ్రష్టు పట్టించాడు. సినిమా అంతా లోప భూయిష్టం, లొసుగుల మయం.
ఎంతో సీక్రెట్‌గా ఉంచిన బాలకృష్ణ రెండో రూపాన్ని ఎంత థ్రిల్ చేస్తూ పరిచయం చేయాలి? కానీ అలాంటి హంగామా ఏమీ ఏర్పాటు చేయకుండా టైటిల్స్ లోనే బాలకృష్ణ రెండో గెటప్ చూపించేసాడు. ఆ గెటప్ ఎలా ఉందంటే బాలకృష్ణ తెర మీద కనిపించినా ప్రేక్షకులు, అభిమానులు కూడా అతను బాలకృష్ణ అని గుర్తించలేకపోయారు. అంటే మేకప్ అంత గొప్పగా ఉందేమో అనుకోకండి, బాలకృష్ణ అందమయిన రూపాన్ని అంత వికారంగా చూపించారు అంతే. నిజంగా బాలకృష్ణ పండు ముసలి వాడు అయిపొయినా కూడా ఆయన అలా కనిపించరు ఏమో. భారతీయుడు నుంచి స్పూర్తి పొందిన వైవీస్ పదేళ్ళ క్రితం వచ్చిన ఆ చిత్రంలో కమల్ కు వేసిన మేకప్ చాయలకు కూడా దీనిని తీసుకుని రాలేకపోయారు. అమెరికన్ మేకప్ నిపుణులు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. సిమ్రాన్ మేకప్ అయితే మరీ ఘోరంగా ఉంది.
ఇక తొలి సన్నివేశంలోనే రివీల్ అయిన వృద్ధ పాత్ర ఒక సాధారణ సన్నివేశం తో కథలో ప్రవేశిస్తుంది. ఈ పాత్ర మీద దర్శకుడు ఎంత మమకారం (!) పెంచుకున్నాడు అనే దానికి ఆ సన్నివేశమే ఉదాహరణ. ఇక నిషా కొఠారి, చిన్న బాల కృష్ణ నడుమ జరిగే సన్నివేశాలయితే సీ గ్రేడ్ చిత్రాలను తలపిస్తాయి. “టిఫిన్లు, భోజనాలు” అంటూ ఒక లేడీ జర్నలిస్ట్ ఒక మగాడి కోసం వెంపర్లాదడం వెగటు పుట్టిస్తుంది. అనేకానేక ఫార్సు సన్నివేశాలతో కథ అడ్డదిడ్డంగా సాగిపోతూ ఉండగా, విలన్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అతనితో పడుచు బాలకృష్ణ కులాల మీద ఒక రాజకీయ డైలాగ్ చెప్పాక, ఇకనుంచి అయినా కథ ట్రాక్ మీదకు వస్తుంది అనుకునే సరికి అనుష్క పాత్ర పరిచయం అవుతుంది. నిషా కొఠారి చేసిన పాత్రతో పోలిస్తే నీచత్వంలో ఏమాత్రం తగ్గను అంటూ అనుష్క తొలి సన్నివేశంలోనే చాటుకుంటుంది. మగ వాసన తెలియని దానిలా అతని మీద పడిపోతూ ఒక్క మగాడు అని పాట అందుకుంటుంది కూడా. జనాన్ని మిస్ లీడ్ చేసే సీన్‌తో ఇంటర్వెల్ కార్డు వేశాక ద్వితీయార్ధంలో జరిగే తంతు అంతా భారతీయుడు, సుభాష్ చంద్ర బోస్ ఇత్యాది సినిమాల్లో చూసినదే.
లాజిక్ గాలికి వదిలేసి ఇష్టానికి కథ నడిపించుకుంటూ పోయినందుకు దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరికి తగిన ఫలితమే కాచుకు కూర్చుంటుంది. దర్శకుడి మీద నిర్మాత అదుపు లేనపుడు ఇలాంటి సినిమాలే రూపొందుతాయి. ఈ ద్విపాత్రలను వైవీఎస్ స్వయంగా పోషించడం వలన ఒక్క మగాడు సినిమాకు అతనే ప్రథమ శత్రువు అయ్యాడు.
నటీనటుల అభినయం:
బాలకృష్ణ ద్విపాత్రల్లో చాలా సులభంగా ఒదిగిపోయారు. చిన్న బాలకృష్ణకు కథా పరంగా అంత ప్రాధాన్యత లేకపోయినా చాలా అందంగా కనిపించి హుందాగా నటించారు. పెద్ద బాలకృష్ణ పాత్ర కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు కానీ ఆ మేకప్ వలన హావ భావాలు అసలు కనిపించలేదు. పైగా గట్టిగా నవ్వే శివాజీ చిత్రంలోని రాజని తరహా మేనరిజం కూడా బాలేదు. సిమ్రాన్ పాత్రకు అనుగుణంగా తాను చేయగలిగింది చేసింది. అనుష్క, నిషా కొఠారిల గురించి చెప్పుకోకపోవడమే మంచిది. అశుతోష్ రాణా మరోసారి తాను తెలుగు సినిమాలకు విలన్‌గా పనికి రాను అని నిరూపించుకున్నాడు. తమిళ చిత్రాల్లో రాణించగలడు కానీ తెలుగులో ఇతనికి కష్టమే. రఘు బాబు చాలా చిత్రాల్లో చేసే రొటీన్ పాత్రనే పోషించాడు. ఇతను తప్ప మరే కమెడియన్ ఈ చిత్రంలో నటించలేదు.
సాంకేతిక నిపుణుల పనితనం:
1940ల కాలాన్ని, 2008 సమయాన్ని ఒకేలా చూపించిన కెమెరా శాఖ దారుణంగా ఫెయిల్ అయింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా స్వాతంత్ర్యం ముందు ఉన్న వాతావరణాన్ని ప్రతిబింబించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. చింతపల్లి రమణ సంభాషణలు బాగున్నాయి కానీ బాలయ్య సినిమాల్లో ఆశించే పవర్‌ఫుల్ డైలాగ్స్ కరువయ్యాయి. మణిశర్మ పాటలలో ద్వితీయార్ధంలో వచ్చే పాటలు బాగున్నాయి… సంగీత పరంగా, చిత్రీకరణ పరంగా కూడా. ఎప్పుడూ బాలకృష్ణ చిత్రాలకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే మణిశర్మ ఈసారి విఫలమయ్యాడు.
లాజిక్ కరువయిన సన్నివేశాలు:
ఈ చిత్రంలో దర్శకుడు లాజిక్ గాలికి వదిలేసాడు. ఒక్క మగాడు అంటే ఏదయినా చేయగల సామర్ధ్యం ఉన్న పాత్ర అని చూపించేందుకు దర్శకుడు తమిళ మాస్ సినిమాలలో కనిపించే “అతి” చేష్టలకు పోయాడు. 90 ఏళ్ల వయసున్న వృద్ధుడు చేయగలడు అని ఊహించడానికి కూడా సాధ్యం కానీ పనులని వైవీఎస్ సునాయాసంగా చేయించేసాడు. బహుళ అంతస్తుల భవనం మీది నుంచి దూకడం, కరెంటు ని చేత్తో ముట్టుకుని నవ్వులు చిందించడం, ఆకాశంలో ఎగిరే విమానంలో నుంచి గాయ పడకుండా బయట పడడం వంటి అనేక విపరీతాలు ఇందులో చోటు చేసుకున్నాయి.
బాక్సాఫీస్ ఫలితం:
సంక్రాంతి సెలవుల వరకు ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడం ఖాయం. సెలవుల తర్వాత దీని భవితవ్యం ఇకపై విడుదల అయ్యే ఇతర చిత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే అభిమానులను కూడా అలరించలేక పోతున్న ఈ చిత్రం నుంచి అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది. ఇప్పుడున్న టాక్ ప్రకారం బాలయ్య కెరీర్‌లో మరో ఫ్లాప్ సినిమాగా ఇది నిలిచిపోవడం ఖాయం. అయితే ఎంత పెద్ద ఫ్లాప్ అన్నదే వేచి చూడాలి. బాలకృష్ణ అభిమాని కాని పక్షంలో ఈ చిత్రాన్ని చూడకుండా స్కిప్ కొట్టేయవచ్చు.
-శ్రీనిధి