Okka Magaadu

Rating: 2.50/5

Critic Rating: (2.50/5)

‘ఒక్క మగాడు’.. తూచ్!

ఎన్ని అంచనాలు.. ఎన్ని ఆశలు.. తెలుగు సినీ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘ఒక్క మగాడు’ బయటకి వచ్చాడు. బాలకృష్ణ, వైవిఎస్ చౌదరి కలయికలో వచ్చిన సినిమా కాబట్టి అందరూ ఈ సినిమాలో ఎన్నో ఆశించారు. కానీ ఆ ఆశలు ఫలించేట్లు కనిపించకపోవడమే విషాదం. బాలకృష్ణ గంభీరమైన నటనని చూడగలిగాం గానీ చౌదరికి సొంతమనుకున్న కథన సామర్థ్యాన్ని మాత్రం తిలకించలేకపోయాం. ప్రధానాకర్షణ బాలకృష్ణ తర్వాత ఈ సినిమాలో ఆకట్టుకున్న అంశం మణిశర్మ సంగీతం మాత్రమే. టైటిల్‌లోని ఫోర్స్.. కథా కథనాల్లో లోపించడం వల్ల బాలకృష్ణ అభిమానుల్నయినా ‘ఒక్క మగాడు’ ఆకట్టుకుంటుందా.. అనేది అనుమానం. ఏడేళ్ల క్రితం ఇదే రోజున (జనవరి 11) వచ్చి బాక్సాఫీసు రికార్డుల్ని బద్దలుకొట్టిన ‘నరసింహనాయుడు’ను ‘ఒక్క మగాడు’ మరిపిస్తాడని వారు పెట్టుకున్న ఆశలు, నమ్మకం నిలబడడం అసాధ్యమనే చెప్పాలి.

కథ:

వెంకటాపురంలో ఉండే వీరవెంకట సత్యనారాయణప్రసాద్ అలియాస్ సత్యం (బాలకృష్ణ) కొన్ని ఆదర్శాలను నమ్ముకుని ఊళ్లొవారందరికీ తలలో నాలుకలా మెలుగుతూ, ఎప్పుడు ఎవరికే కష్టం వచ్చినా ఆదుకుంటూ ఉంటాడు. అందరూ అతణ్ణి దేవుడిలా కొలుస్తుంటారు. పోలీసులకూ, ప్రభుత్వాధికారులకూ అతడంటే హడల్. అతడి సమీపానికి రావడానికే వాళ్లు భయపడుతుంటారు. ఒకసారి ఇద్దరు ప్రేమికులకి దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు సత్యం. ఇది రాష్ట్ర మంత్రి (అశుతోష్ రాణా)కి కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. కారణం.. పెళ్లికొడుకు స్వయానా అతని కొడుకు. దాంతో అతను సత్యం మీద కక్షగడతాడు. అదే సమయానికి ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఓ వృద్ధుడు ప్రత్యక్షమై, అవినీతిపరుల్ని అంతం చేస్తుంటాడు. ఆ వృద్ధుడి పోలికలు సత్యం పోలికలు ఒక్కలా ఉన్నాయని సందేహించిన పోలీసులు సత్యంను తీసుకువచ్చి ఇంటరాగేట్ చేస్తారు. అప్పుడు అసలైన వృద్ధుడు అక్కడకి వచ్చి, తానే ఆ హంతకుణ్ణని చెబుతాడు. ఆ వృద్ధుడు రఘుపతి రాఘవ రాజారాం. 1940ల కాలంలో బ్రిటీష్ వాళ్లను గడగడలాడించిన స్వాతంత్ర్య సమరయోధుడు (‘భారతీయుడు’ గుర్తుకొస్తున్నాడా?). సత్యంకి తాత. ఎన్నడో అరవై యేళ్ల క్రితం స్వాతంత్ర్య పోరాటం చేసిన ఆయన ఇన్నాళ్లూ ఎక్కడున్నాడు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? నిజానికి అందరూ భావిస్తున్నట్లు అవి హత్యలేనా?.. అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.

కథనం:

మూస కథలతోటే మ్యాజిక్కులు చేసి మెప్పించగల నేర్పరిగా పేరు తెచ్చుకున్న వైవిఎస్ చౌదరి ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్కుని చూపించలేకపోయాడు. అసలు ఈ తరహా ఇతివృత్తాన్ని అతడెందుకు ఎంచుకున్నాడో అర్థం కాని సంగతి. దేశభక్తిని చొప్పించి తీసిన సినిమాలు ఎన్నడోకానీ తెలుగులో సత్ఫలితాన్నివ్వలేదు. శంకర్ తమిళంలో తీసిన ‘భారతీయుడు’ తెలుగులోనూ హిట్టయ్యిందంటే ప్రధాన కారణం.. అందులో భారతీయుడు పాత్రని అతను మలిచిన విధానంతో బాటు, ఎంటర్‌టైన్‌మెంట్. ‘ఒక్క మగాడు’లో లోపించింది అదే. రాజారాం లేదా ఒక్క మగాడు పాత్రని ‘భారతీయుడు’ స్ఫూర్తితోటే చౌదరి మలిచాడని స్పష్టంగా తెలిసిపోతోంది. జనంలో ఇప్పటికే పాపులర్ అయిన ఓ సినిమా లేదా ఓ పాత్ర ప్రేరణతో సినిమా తీయడమంటే చిన్న విషయం కాదు. కత్తి మీద సాము వ్యవహారం. ఆ సాహసానికి పూనుకున్నప్పుడు అసలుకుదానికి మించి మెప్పించగల నేర్పు ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ‘ఒక్క మగాడు’లో జరిగింది సరిగ్గా అదే. ‘భారతీయుడు’ ఆహార్యం మనల్ని ఆకట్టుకుంటుంది. అసలు ఆ పాత్రని చేసింది కమల హాసన్ యేనా అన్నంత ఇదిగా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేశాడు కమల్. ఒక్క మగాడు ఆహార్యం బాలకృష్ణకు అంతగా నప్పలేదు. ఆ పాత్రని ఆకర్షవంతంగా మలచడంలో చౌదరి నిస్సందేహంగా ఫెయిలయ్యాడు. సినిమాని రిచ్‌గా తీయడానికి పడిన తాపత్రయంలో కథనం, ప్రధాన పాత్రల తీరుతెన్నుల మీద పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇంతకంటే సినిమా బాగా వచ్చివుండేది.

ఫ్లాష్‌బ్యాక్‌లోని 1940ల నాటి కథ, నేటి కథకి మ్యాచ్ కావకపోవడం కథనంలో దొర్లిన ఓ ప్రధాన లోపం. అయితే కథలో రాజారాం పాత్ర ప్రవేశించే సన్నివేశాల్ని బిగువుగా, భావోద్వేగ పూరితంగా తీయడంలో మాత్రం నేర్పు ప్రదర్శించాడు చౌదరి. కానీ 90 యేళ్లకు చేరువలో ఉన్న వృద్ధుడు బహుళ అంతస్తుల భవనం మీదనుంచి సునాయాసంగా కిందికి దూకి తప్పించుకు పోవడమన్నది సాఫ్ట్‌వేర్ యుగపు యువతకు రుచిస్తుందా? వాళ్లని మెప్పించగలుగుతుందా? సత్యం పాత్రని మరింత ఆకర్షవంతంగా చిత్రించి ఉండాల్సిందనే భావన కలుగుతుంది. రాజారాం పాత్రకంటే ఆ పాత్ర నిడివి పెద్దది. స్టైలిష్‌గా కనిపిస్తుంది. కానీ.. అందులో ప్రేక్షకుల్ని పట్టుకునే విషయం లేదు. ప్రధాన ప్రతినాయక పాత్ర సైతం బలహీనం. మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి.. అతడెంత దుర్మార్గుడైనా.. హాస్పిటల్‌కు అర్థనగ్నంగా రావడమేమిటి? ఇలాంటి సన్నివేశాలు వినోదాన్నివ్వకపోగా, ఎబ్బెట్టుగా తోస్తాయని దర్శకుడు గుర్తించలేక పోయాడు. పైగా మంత్రిని దుష్టుడుగా చూపించడంలోనూ దర్శకుడు పరిణతి ప్రదర్శించలేదు. అతని దుర్మార్గాలు అంతగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు ఓ మలయాళీ మన రాష్ట్ర మంత్రి అవడమే అసహజంగా ఉంది. ఇటీవలి కాలంలో హీరోయిన్‌లను చక్కగా చూపిస్తున్న సినిమాలు వస్తుంటే, చౌదరి మళ్లీ వాళ్లని ఆట బొమ్మలుగానే చూపించాడు. హీరో వెంటపడటానికీ, అతనితో ఆడిపాడటానికి మినహా వాళ్ల ప్రయోజనం కథలో ఏమీలేదు. రాజారాం భార్యగా చేసిన సిమ్రాన్ పాత్ర చాలావరకు నయం. రాజారాం పాత్ర గొప్పతనాన్ని చెప్పడానికి అది ఉపయోగపడింది. క్లైమాక్స్ సన్నివేశాల్ని దర్శకుడు చిత్రించిన తీరు మరీ కృతకం. నాయక పాత్ర గొప్పదనాన్ని ప్రదర్శించేందుకు నేలవిడిచి సాము చేసే సన్నివేశాల్ని తీసే అలవాటుని చాలామంది తెలుగు దర్శకులు ఇప్పటికీ వదిలించుకోలేక పోతున్నారు. కొండను ఢీకొట్టిన విమానం ధ్వంసమై, ప్రతినాయకులందరూ బూడిదగా మారిపోతే, రాజారాం మాత్రం చొక్కా నలక్కుండా ఠీవిగా నడిచి వస్తాడు. ‘ఒక్క మగాడు’ కదా మరి!

పాత్రధారుల అభినయం:

పాత్రల తీరుతెన్నులు ఎలా ఉన్నా ‘ఒక్క మగాడు’ ఖచ్చితంగా బాలకృష్ణ సినిమా. సత్యం పాత్రలో గ్లామర్‌గా కనిపించిన ఆయన రాజారాంగా చక్కని నటనను ప్రదర్శించారు. తాతామనవళ్లుగా రెండు పాత్రల మధ్య తేడాలకు తగ్గట్లు విభిన్నత్వాన్ని తన నటనలో చూపారాయన. రాజారాం పాత్రలోని భావోద్వేగాల్ని తనకి మాత్రమే సొంతమైన రీతిలో చక్కగా పరదర్శించారు. అయితే రాజారాం గెటప్ ఆయనకు అంతగా నప్పలేదనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత తెలుగులో కనిపించిన సిమ్రాన్ అర్థవంతమైన పాత్రలో ఆకట్టుకుంది. కొంత గ్లామర్, ఎక్కువ అభినయానికి అవకాశమున్న పాత్రలో హావభావ ప్రదర్శనతో మెప్పించింది. అయితే వృద్ధవేషం ఆమెకి సరిగా నప్పలేదు. మేకప్ సహజంగా లేదు. ముందే చెప్పుకున్నట్లు ప్రియాంక (నిషా) కొఠారి, అనుష్కలకు నటించేందుకు కాస్తకూడా అవకాశం లభించలేదు. ఇందులో నిషా చేసిన పాత్ర చూశాక లేడీ టీవీ రిపోర్టర్ల మీద జాలి కలుగుతుంది. ఇద్దరు హీరోయిన్లు కురుచ దుస్తులు వేసుకుని, నడుములు ఊపడానికి ఒకరితో ఒకరు పోటీపడ్డారు. బాలీవుడ్ ‘దుష్మన్’లో సైకోగా నటించి ప్రేక్షకుల వెన్నులో చలి పుట్టించిన అశుతోష్ రాణా మంత్రి పాత్రలో హాస్యాస్పదమైన నటనని ప్రదర్శించాడు. ఆ పాత్రని దర్శకుడు మలిచిన విధానమే అలా ఉంటే.. అతడు మాత్రం ఏంచేస్తాడు! కామెడీ కోసం కల్పించిన కృష్ణభగవాన్, రఘుబాబు కష్టపడ్డారు కానీ నవ్వించలేకపోయారు. మిగతావాళ్లలో రవి కాలే, సుబ్బరాజు పరిధుల మేరకు నటించారు.

టెక్నీషియన్ల పనితనం:

టెక్నీషియన్లు అందరిలోకీ మెప్పించింది సంగీత దర్శకుడు మణిశర్మ. ఆయన బాణీలు కూర్చిన పాటల్లో కనీసం నాలుగు వినసొంపుగా ఉన్నాయి. ప్రధానంగా ‘దేవాధి దేవా’, ‘నను పాలించగా, ‘ఒక్క మగాడు’ పాటలు వినడానికీ, చూసేందుకూ బాగున్నాయి. రీరికార్డింగ్ సైతం ఉన్నత స్థాయిలో ఉంది. తర్వాత చెప్పుకోవాల్సింది చింతపల్లి రమణ సంభాషణల్ని. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన కలం బాగా పనిచేసింది. కొన్ని సన్నివేశాలకు ఆయన రాసిన మాటలే బలాన్నిచ్చాయి. ‘దేవదాసు’కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మధు ఎ. నాయుడు ఈ సినిమాకీ బాగా కష్టపడ్డాడు. కానీ సన్నివేశాల్లోని డొల్లతనం, పాత్రల చిత్రణ వల్ల అతని పనితనం ఎందుకూ కొరగాకుండా పోయింది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఆశించిన స్థాయిలో సామర్థ్యాన్ని చూపించలేక పోయారు.   

బలాలు, లోపాలు:

బాలకృష్ణ సినిమాలకి ప్రధాన బలం ఆయన నటనే. ఇందులోనూ ఆయన సినిమాకి ఎస్సెట్‌గా నిలిచారు. మణిశర్మ సంగీతం, చింతపల్లి మాటలు ఇతర బలాలు. ప్రధాన పాత్రల బలహీన చిత్రణ, ‘భారతీయుడు’ను గుర్తుకుతెచ్చే బాలకృష్ణ పాత్ర తీరు, కొత్తదనం కానరాని కథ, గ్రిప్పింగ్ లేని స్క్రీన్‌ప్లే, ఫ్లాష్‌బ్యాక్‌కీ, వర్తమానానికీ సమన్వయం కుదరకపోవడం లోపాలు.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: