NTR fans unhappy over KANTRI publicity

ఈ వేసవిలో అతి పెద్ద సినిమా ‘జల్సా’ విడుదలై మూడు వారాలవడంతో ఇప్పుడందరి దృష్టీ ఎన్టీఆర్ సినిమా ‘కంత్రి’ మీదే వుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హన్సికా మొత్వానీ, తనీషా నాయికలు. వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ నిర్మాత. మణిశర్మ సంగీతం కూర్చిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే ఘన విజయం సాధించింది. అయినప్పటికీ ఆడియోను చడీ చప్పుడు లేకుండా, ఎలాంటి కార్యక్రమం లేకుండా అశ్వనీదత్ విడుదల చేయడం ఎన్టీఆర్ అభిమానుల్ని నిరాశకు గురిచేసింది. వాస్తవానికి రజనీకాంత్ చేతుల మీదుగా ఈ సినిమా ఆడియో విడుదలవుతుందని అంతకుముందు ప్రచారం జరిగింది. అదే రజనీకాంత్ ‘బుజ్జిగాడు’ ఆడియోను విడుదల చేయడంతో అశ్వనీదత్ కావాలనే ‘కంత్రి’ ఆడియో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మే 7న ‘కంత్రి’ విడుదలవుతుందని వార్తలు వస్తున్నా ఇంతవరకు సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారాన్ని అశ్వనీదత్ మొదలు పెట్టకపోవడం వారిలో అసంతృప్తిని రగిలిస్తోంది. దీని వెనుక చిరంజీవి వర్గం హస్తం వుందనే అనుమానాల్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కారణం.. చిరంజీవికి అశ్వనీదత్ అత్యంత సన్నిహితుడు కావడం. అయినప్పటికీ ‘కంత్రి’గా ఎన్టీఆర్ విజృంభిస్తాడనీ, బాక్సాఫీసు రికార్డులు నెలకొల్పుతాడనీ అభిమానులు ఆశిస్తున్నారు.

We would like to hear your comments below: