2009లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి నందమూరి వారసులు సిద్ధంగా వున్నారు. పార్టీలో లేకపోయినా బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ టిడిపి తరపున ప్రచారం చేసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. ఇదివరలో టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు వారితో సమావేశమైన సంగతీ, వారు ప్రచారంలో పాల్గొంటామని ఆయనకు హామీ ఇచ్చిన సంగతీ పాఠకులకు తెలుసు. అయితే మరో నందమూరి వారసుడు మాత్రం తాను ప్రచారంలో పాల్గొననని అలిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అతను తారకరత్న. అంటే అతని పేరు కూడా ఎన్టీఆరే. కాకపోతే అతని అసలు పేరు ఓబులేష్. జూనియర్ ఎన్టీఆర్ రంగం మీదికి వచ్చాక, తానే దివంగత ఎన్టీఆర్‌కు అసలైన వారసుణ్ణని అనిపించుకోవడానికి ‘ఎన్టీఆర్’ పేరు వచ్చేలా తన పేరును తారకరత్నగా మార్చుకున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ఇప్పుడూ నటిస్తున్నాడు. కానీ ఇంతదాకా అతనికి ఒక్కటంటే ఒక్క విజయమూ లభించలేదు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యత, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు ఇస్తున్న ప్రాముఖ్యత తారకరత్నకు ఏమాత్రమూ నచ్చడం లేదని తెలుస్తోంది. పైగా ప్రచార సాధనాల్లోనూ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ల పేర్లే తరచూ వస్తూ, తనని ఎవరూ పట్టించుకోకపోవడం అతనికి మనస్థాపం కలిగిస్తున్నదని చెప్పుకుంటున్నారు. అందుకే తాను టిడిపి తరపున ప్రచారంలో పాల్గొననని తన కుటుంబంతోనూ, సన్నిహితులతోనూ అంటున్నాడు. అయినప్పటికీ ఎవరూ అతని మాటల్ని పట్టించుకోవడం లేదు. జనంలో తారకరత్నకు కనీస ఇమేజ్ లేకపోవడమే దీనికి కారణం. దాంతో తారకరత్న మరింత బాధపడుతున్నట్లు సమాచారం.