తెలుగులో గోపీచంద్ సరసన నటించిన ‘ఒంటరి’ ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది మలయాళ సుందరి భావన. కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా వున్న ఆమెకు తొలి తెలుగు సినిమా హిట్టుని ఇవ్వకపోయినా ‘పక్కింటమ్మాయి’ ఇమేజ్ను తీసుకొచ్చింది. అదే నితిన్‌తో చేసే అవకాశాన్నీ ఇచ్చింది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘హీరో’లో ఆమె హీరోయిన్. విలన్ పాత్రలతో అందరికీ తెలిసిన జీవీ సుధాకర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. మన్యం ఎంటర్టైన్మెంట్స్ బానర్‌పై మన్యం రమేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. సినీ హీరో కావాలని కలలుకనే కుర్రాడి కథ ఈ సినిమా. ఈ పాత్ర కోసం తన కుడి భుజం మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు నితిన్. కాగా ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభమైనప్పట్నించీ నితిన్, భావన మధ్య సాన్నిహిత్యం పెరిగిందనీ, ఆ ఇద్దరూ చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తున్నారనీ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ లేని రోజుల్లో ఇద్దరూ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకుంటున్నారనీ, చూస్తుంటే ఆ ఇద్దరి వ్యవహారం ప్రేమానుబంధంగా మారేట్లు కనిపిస్తున్నదని కూడా ఆ ప్రచారంలో భాగం. అయితే తన సన్నిహితుల వద్ద తమ మధ్య అలాంటి వ్యవహారమేమీ నడవటం లేదనీ, తానసలు సినిమా రంగానికి చెందిన వ్యక్తి ప్రేమలో పడే ప్రశ్నే లేదనీ భావన స్పష్టం చేసినట్లు సమాచారం.