Nee Sukhame Ne Korutunna

Rating: 1.50/5

Critic Rating: (1.50/5)

నీ సుఖమే నే కోరుతున్నా. . . ?
పదిహేనేళ్ల తర్వాత గిరిబాబు దర్శకత్వం వహించారనేసరికి, ఆ సినిమాలో ఎంతోకొంత ‘విషయం’ వుంటుందని ఎవరైనా ఆశించడం తప్పుకాదు. ఒకప్పుడు ‘దేవతలారా దీవించండి’, ‘మెరుపు దాడి’ వంటి జనాకర్షక, యాక్షన్ చిత్రాలు తీసిన ఘనత వుంది ఆయనకి. నేటి ట్రెండుని దృష్టిలో పెట్టుకుని ప్రేమకథని తీశానని ‘నీ సుఖమే..’ విడుదలకు ముందు ఆయన చెప్పారు. కానీ చూస్తున్నంత సేపూ కుర్చీల్లో మహా ఇబ్బంది పెట్టిన ఈ సినిమాని చివరిదాకా చూసినవాళ్లకి నిర్మాతలే ఎదురు డబ్బులు ఇవ్వాలి. అంటే ప్రేక్షకుడి సహనానికి ఈ సినిమా పెద్ద పరీక్ష. 30, 40 రూపాయలు పెట్టి వినోదిద్దామని వెళ్లిన ప్రేక్షకులకి తీవ్ర ఆశాభంగం ఈ సినిమా.
కథ:
మధు (రాజా), స్వప్న (స్నేహ) క్లాస్‌మేట్స్. వందలాది సినిమాల్లో మాదిరే ప్రేమించుకుంటారు. మరో క్లాస్‌మేట్ శేఖర్ (టీవీ నటుడు చక్రవర్తి) కూడా స్వప్నని ప్రేమించి భంగపడతాడు. మధు, స్వప్నల ప్రేమ స్వప్న అన్న (రఘుబాబు)కి ఏమాత్రం ఇష్టముండదు. స్వప్న పుట్టినరోజుకి వచ్చిన మధుని అతను అందరిముందూ కొట్టి అవమానిస్తాడు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళతాడు మధు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరిన అతణ్ణి అక్కడే పనిచేసే శాంతి (హేమశ్రీ) ఇష్టపడుతుంది. శాంతి ఇంట్లోనే అద్దెకుంటాడు మధు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కు వచ్చిన రమ్య (సఖి) అనే స్వప్న స్నేహితురాలు.. మధు, శాంతి కలిసి ఆఫీసుకు వెళ్లడం చూసి, ఇంటి పనిమనిషి చెప్పిన సంగతి విని ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని స్వప్నకు ఫోన్ చేసి చెబుతుంది. సందేహాన్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చిన స్వప్నకు ఆ ఇద్దరూ సన్నిహితంగా కనిపిస్తారు. దాంతో ఆమె మనసు విరిగిపోతుంది. ఆ విరిగిన మనసు తిరిగి అతుక్కుందా, లేదా? అతుక్కుంటే ఎలా అతుక్కుంది? అనేది మిగతా కథ.
కథనం:
ఇంత కలగాపులగం కథ (?)లోని కథనం గురించి చెప్పాలంటే చాలా ఓపిక కావాలి. కథలో ఎన్ని మలుపులు.. ఎన్ని ముడులు.. సాఫీగా చెప్పగలిగిన కథని ఊరికే ముడులు వేసుకుంటూ వెళ్లాడు గిరిబాబులోని కథకుడు. వాటిని విప్పుకుంటూ వెళ్లేసరికి తెల్లారిపోయింది. కథ విప్పాక చుట్టూ చూసుకుంటే జనం లేరు. ఎక్‌స్ట్రా పాత్రల సంగతి అలా వుంచితే, ప్రధాన పాత్రల్లో ఒక్కదానినీ సక్రమంగా మలచలేకపోయాడు దర్శకుడు. ఫైట్లు వచ్చినప్పుడు తప్పితే మిగతా సన్నివేశాల్లో మధులో హీరోయిజమే కనిపించదు. ఆ పాత్ర అంత డల్‌గా వుంది. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమ ఎస్టాబ్లిష్ అయ్యేది కూడా వేరే పాత్ర వల్ల కావడంతో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు సైతం బోర్ కలిగిస్తాయి. అవనే కాదు సినిమా ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశం ఒక్కటీ కనిపించదు. ప్రథమార్ధం అనుకుంటే ద్వితీయార్ధం దాని తాతలాగా వుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే బయటకి పరుగులు తీయాలనిపిస్తుంది. రఘుబాబు పాత్ర ఎప్పుడు చూసినా కల్లు తాగిన కోతిలా  ఎందుకు ప్రవర్తిస్తుందో తెలీదు. అతన్ని విలన్‌గా ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే దాని మీద దర్శకుడికి ఏమాత్రం క్లారిటీ లేదు. స్నేహ తల్లిదండ్రులు కోటీశ్వరులు. కానీ ఎప్పుడూ కోడుకు చేష్టల్నీ, కూతురి కష్టాల్నీ చూసి ఏడుస్తూ వుంటారు. రమ్య, శాంతి పాత్రలు సినిమాకి తగినంత మోతాదులో చికాకుని తీసుకొచ్చి పెట్టాయి. బ్రహ్మానందం, కోవై సరళల జంట చేసేది కామెడీ అని భావించుకుని మనం వినోదించాలి! క్లైమాక్స్‌లో మధు కత్తిపోట్లు తగిలి హాస్పిటల్‌లో చేరతాడు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ‘ఆపరేషన్ సక్సెస్’ అంటారు. నిజమే. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ బతికాడు. ప్రేక్షకులే చచ్చారు.
నటీనటుల అభినయం:
నీరసమైన పాత్రలు కావడంతో రాజా, స్నేహ వీలైనంత నీరసంగా కనిపించడానికీ, నటించడానికీ కృషి చేశారు. పాత్రల, కథల ఎంపికలో శ్రద్ధ వహించకపోతే రాజా కెరీర్ ఒక్క అంగుళం ముందుకు కదలదు. స్నేహకి ఇది మరిచిపోదగ్గ సినిమా. టీవీ సీరియళ్లలో మాదిరిగా ఆమె గొంతు రెండు రకాలుగా వినిపించింది. అంటే తొలి అర్ధగంట దాకా ఒక గొంతు, మిగతా సినిమాకి మరో గొంతు వినిపిస్తుంది. ఈ సినిమాలోని క్వాలిటీకి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఏముంటుంది. సినిమాలో రాంగ్ కేస్టింగ్ ఎక్కువ. శేఖర్ పాత్రకి టీవీ నటుడు చక్రవర్తి ఏమాత్రం అతకలేదు. స్నేహకి తమ్ముడిలాగా కనిపించాడు. కథలో కీలక మలుపుకి కారణమయ్యే రమ్య పాత్రని చేసిన నటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. ఆమె ముఖం ఎంత అనాకర్షకంగా వుందో, ఆమె కనిపించే సన్నివేశాలు అంత ఘోరంగా వున్నాయి. బ్రహ్మానందం తల్లిదండ్రులు కొండవలస, అపూర్వ. కొండవలస ఓకే. బ్రహ్మానందంకు తల్లి అపూర్వ అంటేనే నవ్వు వస్తుంది. ఆమె మేకప్ చూస్తే అతనికి చెల్లెలిలాగా వుంది కానీ తల్లిలా లేదు. ఈమధ్య ఎక్కువ కామెడీ పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తున్న రఘుబాబు అనవసరంగా విలన్ పాత్ర చేసి ఇబ్బందిపెట్టాడు. స్నేహ తల్లిదండ్రులుగా కోట, అన్నపూర్ణ పాత్రల ప్రకారం నటించారు.
టెక్నీషియన్ల ప్రతిభ:
సంగీత దర్శకుడు ఒక్క మాధవపెద్ది సురేష్ మినహా మిగతా టెక్నీషియన్లు ఈ సినిమా అనాకర్షకంగా తయారవడంలో తమవంతు సహకారాన్ని అందించారు. చిత్రీకరణ అధ్వాన్నంగా వుండటంతో వెన్నెలకంటి రాసిన పాటలు వినడానికే బావుంటాయి. గౌరీశంకర్ సంభాషణలు సన్నివేశాలకు తగ్గట్లే నీరసాన్ని కలిగించాయి. స్క్రీన్‌ప్లే రచయితగా గిరిబాబుది పూర్తి వైఫల్యం. సురేష్ సినిమాటోగ్రఫీ బాగా డల్‌గా వుంది. సన్నివేశాలు అనాకర్షకంగా వుండటంలో దాని పాత్ర కూడా వుంది.
బలాలు, లోపాలు:
సంగీతం ఒక్కటే బలమైన ఈ సినిమాలో మిగతావన్నే లోపాలే. ప్రేక్షకుడికి ఏమాత్రం గిట్టుబాటు కాని ఈ సినిమాకి వెళ్లకపోవడమే శ్రేయస్కరం.
..యజ్ఞమూర్తి 

Give your rating:

We would like to hear your comments below: