A bitter experience to NAGARAM producer!

నేటి రోజుల్లో సినీ నిర్మాణం ఎలా వుంటుందో ఒక కొత్త నిర్మాతకు అనుభవంలోకి వచ్చింది. పేరుపొందిన దర్శక నిర్మాతలే డిమాండ్ వున్న కొంతమంది నటులవల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారనేది వాస్తవం. ఆ సంగతి తెలియక కొంతమందీ, తెలిసినా చిత్రసీమలోని గ్లామర్‌ని దృష్టిలో వుంచుకుని కొంతమందీ సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతుంటారు. అలా శ్రీమిత్ర ఎస్టేట్స్ అధినేత ఎంవి  చౌదరి సైతం ‘నగరం’ సినిమాతో నిర్మాతగా మారారు. శ్రీకాంత్, కావేరి ఝా జంటగా నటించిన ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సి.సి. శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్ర పోషించగా, బాలీవుడ్ సీనియర్ తార మనీషా కొయిరాలా ఒక ఐటమ్ సాంగ్‌ని చేసింది. కాగా ఈ సినిమా డబ్బింగ్ సమయంలో నిర్మాతకు ఎదురైన ఒక అనుభవం ఆయనకు సినిమా నిర్మాణమంటే ఏమిటో తెలియజెప్పిందని టాలీవుడ్ అంతర్గత వర్గాలు తెలియజేశాయి. ఆ వర్గాల కథనం ప్రకారం డబ్బింగ్ చెప్పాల్సిన ఒక నటుడు తనకు అప్పటికప్పుడు డబ్బులు చెల్లించాలని పట్టుబట్టాడు. లేందంటే తాను షెడ్యూలు ప్రకారం డబ్బింగ్ చెప్పేదిలేదని మొండికేశాడు. ఆ సమయంలో నిర్మాత చౌదరి దూరప్రాంతంలో వున్నారు. తాను హైదరాబాదుకు వచ్చిన వెంటనే డబ్బు చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చినా సదరు నటుడు (హీరో శ్రీకాంత్ కాదు) మాత్రం అప్పటికప్పుడు తనకు డబ్బు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశాడు. చేసేదిలేక ఆ డబ్బును నిర్మాత అరేంజ్ చేశారు. ఈ అనుభవంతో ఖంగుతిన్న చౌదరి మళ్లీ సినీ నిర్మాణం జోలికి వెళ్లకూడదని ఒకానొక నిమిషంలో భావించారు. చిత్రసీమలో ఇలాంటివి మామూలేనని, వాటిని ఎదుర్కొంటూ పోవాలని శ్రీకాంత్‌తో బాటు ఆయన మిత్రులు ఆయనకు సర్దిచెప్పారు. దాంతో ఆయన కన్విన్స్ అయ్యారు. మొత్తానికి మునుముందు ఈ తరహా అనుభవాలు ఎదురైతే ఎలా సంభాళించుకోవాలో చౌదరికి తెలిసివచ్చింది.       

We would like to hear your comments below: