Nagaram

Rating: 2.00/5

Critic Rating: (2.00/5)

అదే పాత ‘నగరం’!

 ఇటీవలి కాలంలో పాత్రలతో ప్రయోగాలు చేస్తున్న శ్రీకాంత్ ఇప్పుడు పక్కా యాక్షన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఖడ్గం’ సినిమా తర్వాత అంతటి సీరియస్ పాత్రలో అతడు కనిపించింది ‘నగరం’లోనే. కాకపోతే అది పోలీసాఫర్ పాత్రయితే, ఇది దానికి పూర్తి విరుద్ధమైన గూండా పాత్ర. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు గూండాల సినిమాలు చాలానే చూశారు. అలాంటప్పుడు ‘నగరం’ సినిమాని దేనికోసం చూడాలి? అందులో కొత్తగా వున్న సంగతేమిటి? అనేవి ప్రశ్నలు. కథ పాతదే అయినా దర్శకుడు కొత్తగా చెప్పాడని సినిమా విడుదలకు ముందు శ్రీకాంత్ తెలిపాడు. కృష్ణవంశీ వద్ద పనిచేసిన సిసి శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయమయ్యాడు. శ్రీకాంత్ చెప్పినట్లు అతను సినిమాని కొత్త తీరులో చూపించాడా? నిజానికి ‘నగరం’ ఒక రీమేక్ సినిమా. తమిళంలో హిట్టయిన ‘తలైనగరం’ దీనికి మాతృక. అలాంటప్పుడు దర్శకుడు కొత్తగా చూపించేదేముంది? మార్చి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో జగపతి బాబు తన నిజ జీవిత పేరుతో ఆంటే వి.జె. చౌదరి పేరుతో ఒక నిజాయితీపరుడైన పోలీసాఫీసర్‌గా స్పెషల్ పాత్రలో దర్శనమిచ్చాడు.

కథ:

హైదరాబాద్ నగరంలో రైట్ (శ్రీకాంత్) అంటే అందరికీ హడల్. పేరుమోసిన గూండా ఖాసింభాయ్ (ప్రదీప్ రావత్)కి కుడి భుజం లాంటివాడు కావడాన అందరూ అతణ్ణి రైట్ అనే పిలుస్తారు. అతడి అసలు పేరు చంద్రశేఖర్ అనే సంగతి చివరలో తెలుస్తుంది. ఖాసింభాయ్ చెప్పిన పని.. అది హత్యయినా సరే.. చేసి అతడిచ్చే డబ్బుతో తన గ్యాంగ్‌తో జీవితాన్ని గడిపే రైట్ ఒక సంఘటన కారణంగా ఖాసింభాయ్‌నే ఎదిరిస్తాడు. దాంతో ఖాసిం కొడుకు నాజర్ (జీవీ) ఒక కేసులో రైట్‌ను జైలుకు పంపిస్తాడు. అక్కడ తన మనుషులతో అతణ్ణి చంపించాలని చూస్తాడు. సహజంగానే రైట్ వాళ్లని చావగొడతాడు. నాజర్ చేసిన పని తెలుసుకున్న రైట్ ప్రధాన అనుచరుడు బాలు అతణ్ణి చంపేస్తాడు. పగతో రగలిన ఖాసిం వెంటనే బాలుని రైట్ కళ్లముందే హత్యచేస్తాడు. బాలు చావుతో రైట్‌లో ప్రతీకారానికి బదులు మానవత్వం మేల్కొంటుంది. తను చేసిన హత్యలు ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపివుంటుందో అతడికి తెలిసి వస్తుంది. దాంతో తన అనుచరులతో కలిసి ఎసిపి చౌదరి (జగపతి బాబు) వద్ద లొంగిపోతాడు రైట్. తాను చేసిన నేరాల్ని ఒప్పుకుంటాడు. మారిన అతణ్ణి వదిలేస్తాడు ఎసిపి. దాంతో తనకు మిత్రుడైన మంత్రి (అశోక్‌కుమార్) సహకారంతో చౌదరిని అక్కణ్ణించి బదిలీ చేయించి అవినీతిపరుడైన మరో ఎసిపి (కళాభవన్ మణి)ని అక్కడకు తీసుకు వస్తాడు ఖాసిం. ఆ తర్వాత ఖాసిం తన పగ తీర్చుకున్నాడా? గూండాగిరి మానివేసి నవ్య (కావేరి ఝా) ఇచ్చిన సలహాతో ‘మళ్లీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో’ను నెలకొల్పిన రైట్ తనను చంపడానికే వచ్చిన కొత్త ఎసిపితో బాటు ఖాసింను ఎలా ఎదుర్కొన్నాడు?.. అన్న ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా. 

కథనం:

సినిమాని స్టైలిష్‌గా తీయడంలో దర్శకుడు శ్రీనివాస్ సక్సెస్ అయినా ప్రేక్షకుల్ని మెప్పించే కీలక అంశాల చిత్రీకరణలో మాత్రం ఫెయిలయ్యాడు. ప్రధాన పాత్రలను అతడు మలచిన విధానం కూడా దీనికి తోడయ్యింది. కొన్ని సందేహాలకు సమాధానాలు లభించవు. మరికొన్ని సన్నివేశాలకు లాజిక్కులు కనిపించవు. ఒకసారి రైట్‌తో ‘నా వద్దే వుండిపో’ అని ఖాసిం అంటే ‘నాకు నచ్చిందే చేస్తా’ అంటాడు రైట్. అతడికి నచ్చిన పనులేమిటి? హత్యలు! ఖాసిం చెప్పగానే వెనకాముందూ చూడకుండా హత్యలు చేసే రైట్ మంచివాడుగా మారిపోయానని చెప్పినంత మాత్రాన ఒక బాధ్యతాయుతమైన పోలీసాఫీసర్ అతణ్ణి వొదిలేయడమేమిటి? అతడు అంతదాకా చేసిన హత్యలు.. హత్యలు కాకుండా పోతాయా? అతను శిక్షార్హుడు కాకుండా పోతాడా? రైట్ ఖూనీలు మానేసి ‘మళ్లీపెళ్లి మ్యారేజ్ బ్యూరో’ పెట్టడం బాగానే వుంది. అంటే విడాకులు తీసుకున్నవాళ్లకీ, భర్త లేదా భార్య మరణించిన వాళ్లకీ ఉద్దేశించి పెట్టిన ఆ మ్యారేజ్ బ్యూరోని దర్శకుడు వినోదానికి వాడుకుని రైట్ మంచివాడుగా మారిన ఉద్దేశాన్ని అపహాస్యం చేసేశాడు. ఆ బ్యూరోలో ఒక్క పెళ్లినైనా వాళ్లు సక్రమంగా కుదిర్చినట్లు కనిపించదు. ప్రతిసారీ కామెడీ ఆఫ్ ఎర్రర్సే. పెళ్లి సంబధం కోసం వచ్చిన ప్రతివాళ్లతో ఏదో ఒక అల్లరే. రౌడీల మీద రీసెర్చి చేయడానికి వచ్చి రైట్ ఇంట్లో తిష్ఠవేసిన నవ్య ఆ పని మానేసి రైట్‌ను ప్రేమిస్తుంది. దీనికి ఆమెను పురిగొల్పే గట్టి కారణంగానీ, బలమైన సన్నివేశాలు గానీ లేవు. అయినా ఆ ఇద్దరి మధ్య రొమాన్స్‌ని దర్శకుడు అసలు ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎస్టాబ్లిష్ చేసినట్లయితే సినిమాలో కొంత ఆహ్లాదానికి వీలు కలిగేది. ఆ సంగతిని దర్శకుడు విస్మరించాడు. సినిమా ముగింపు ఎంత ఆదరా బాదరాగా వుందీ అంటే అప్పటికే బాగా ఆలస్యమైందన్నట్లు చాలా అంశాల్ని విపులీకరించకుండానే వదిలేశాడు దర్శకుడు. బాలు భార్యా బిడ్డలకు కూడా కథలో ప్రాముఖ్యత వుంది. వారేమయ్యారో ప్రేక్షకులకి తెలీకుండా పోయింది. రైట్ చెల్లెల్ని పోలీసులు చెరిస్తే, దానికి ఆమె చేయి కోసుకుని చనిపోతే, ఆ సంగతి హీరోకి ఎలా తెలియాలి? ఆ సంగతి తెలిసినప్పుడు అతను ఎలా రియాక్ట్ కావాలి? ‘నగరం’లో చూపించినంత అతి మామూలుగా, అన్ఎఫెక్టివ్‌గా మాత్రం కాదు. క్లైమాక్స్ అయితే దిగ్భ్రాంతి కలిగిస్తుంది. లీడ్ సన్నివేశాల ప్రకారం విలన్ ఖాసిం దృష్టిలో హీరో రైట్ చనిపోయాడు. కానీ చివరి సీనులో ఒక రాంగ్ ఇన్‌ఫర్మేషన్‌తో తన మిత్రుడైన మంత్రినీ, అతనితో గడుపుతున్నది తన ఉంపుడుగత్తె అని భావించి ఆమెనీ చంపి, అప్పుడు ఆమె తన ఉంపుడుగత్తె కాదని గుర్తించి, తాను మోసపోయానని తెలుసుకున్న ఖాసిం వెంటనే అది రైట్ పని అని ఎలా గ్రహిస్తాడు? అప్పటికే రైట్ చనిపోయాడనే భావనలో అతడున్నాడాయె. విమర్శకుడికే కాదు.. సగటు ప్రేక్షకుడికీ ఈ సందేహం వస్తుంది. అంటే సన్నివేశాల కూర్పులోనో లేదంటే స్క్రీన్‌ప్లేలోనో తప్పు దొర్లిందన్నమాట. స్పష్టంగా తెలిసిపోతున్న ఆ లోపాన్ని దర్శకుడు గుర్తించలేకపోవడం విడ్డూరం. ఫస్టాఫ్‌లో వినోదం పాలు తక్కువ. రఘుబాబు, రాజేష్‌ల శంకర్‌దాదా ప్రహసనం కాస్త నవ్విస్తుంది. సెకండాఫ్‌లో ‘మళ్లీపెళ్లి మ్యారేజ్ బ్యూరో’తో వినోదం అందించేందుకు దర్శకుడు యత్నించాడు. అలీ రెండు సీన్లు, బ్రహ్మానందం, వేణుమాధవ్ తలో సీనూ చేశారు. అయితే అవి రైట్ పాత్ర దృష్ట్యా చూస్తే ఔచిత్య భంగాలు.

పాత్రధారుల అభినయం:

 రైట్‌గా శ్రీకాంత్ మెరుగైన నటనని ప్రదర్శించాడు. తక్కువ మాటలు, ఎక్కువ హావభావాలతో ఆకట్టుకున్నాడు. మాస్ పాత్రలకీ తాను పనికి వస్తానని అతను రుజువు చేసుకున్నాడు. ఎసిపి చౌదరిగా చేసిన ప్రత్యేక పాత్రలో జగపతి బాబు సైతం కొత్తగా కనిపిస్తాడు. అతడు కనిపించే తొలి సన్నివేశాల్లో అతడి చేష్టలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కావేరి ఝా ముఖంలో ఆకర్షణ బహు తక్కువ. అభినయపరంగానూ మార్కులు తక్కువ పడతాయి. పాటల్లో మాత్రం వంపుసొంపులతో అలరించాలని యత్నించింది. వాటిలో కృష్ణవంశీ చిత్రీకరించిన బీచ్ పాట ముఖ్యమైంది. శ్రీకాంత్ స్నేహితునిగా అజయ్ మరో చెప్పుకోతగ్గ పాత్ర చేసి మెప్పించాడు. ఖాసింభాయ్‌గా ప్రదీప్ రావత్ సరిగ్గా సరిపోయాడు. ఎసిపిగా కళాభవన్ మణి ఓకే. రఘుబాబు, రాజేష్ జోడీ బాగా కుదిరింది. వాళ్లు నవ్వించారు. అశోక్‌కుమార్, జీవీ సుధాకర్, బండ రమేష్ వంటి నటులు పాత్రోచితంగా నటించారు.

 

టెక్నీషియన్ల పనితనం:

స్వామీజీ విజయ్ సంభాషణలు కొన్నిచోట్ల మాత్రమే ఫర్వాలేదనిపించాయి. టెక్నీషియన్లలో ఎక్కువ ఆకట్టుకున్నది సినిమాటోగ్రాఫర్ శరత్, కళాదర్శకుడు శ్రీనివాసరాజు పనితనాలు. ఆయా సన్నివేశాలకు శరత్ కెమెరాయే ప్రాణమిచ్చింది. సినిమా స్టైలిష్‌గా రావడానికి అతను కృషిచేశాడు. దానికి శ్రీనివాసరాజు తోడ్పాటునందించాడు. సన్నివేశాలకు తగ్గట్లు నేపథ్యాన్ని సృష్టించడంలో ఆయన ప్రతిభ ప్రదర్శించాడు. గౌతంరాజు ఎడిటింగ్ చివరిలో అసంతృప్తి కలిగించింది. ఇటీవలి కాలంలో విజృంభించి యాక్షన్ కంపోజ్ చేస్తున్న రామ్‌లక్ష్మణ్ జోడీ ఈ సినిమాలోనూ మాస్‌ని ఆకట్టుకునే యాక్షన్ ఎపిసోడ్లని సృష్టించారు. వైర్‌వర్క్ తగ్గితే అవి మరింత ఎఫెక్టివ్‌గా వుండేవి. చక్రి సంగీతం ఆకట్టుకోలేకపోయింది. మనీషా కొయిరాలా చేసిన ఐటమ్ సాంగ్ కంటే మోనాలిసా చేసిన ఐటమ్ మెరుగ్గా వుంది. డ్యూయెట్లు కూడా అతి సాధారణంగా వున్నాయి. 

బలాలు, లోపాలు:

శ్రీకాంత్ నటన, సినిమాటోగ్రఫీ, యాక్షన్ ఎపిసోడ్లు బలాలు. ఆకట్టుకోలేని కథాంశం, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఆసక్తికరంగాలేని సన్నివేశాల చిత్రణ, వినసొంపుగాలేని సంగీతం, ఆదరాబాదరాగా సాగిన క్లైమాక్స్ లోపాలు. అయితే గియితే కొద్దిస్థాయిలో మాస్ ప్రేక్షకుల్ని మాత్రమే ఈ సినిమా ఆకట్టుకోవచ్చు. ఇంకొకర్ని చూడమని రికమెండ్ చేయదగ్గ సినిమా కాదు.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: