చెట్లకు డబ్బులు కాయవేమో గానీ చిరంజీవి కుటుంబ వృక్షానికి వారసులు మాత్రం ఒకరి తర్వాత ఒకరు కాస్తున్నారు. వారితో వేరే వాళ్లు పోటీ పడాల్సిన అవసరం లేకుండా వారితో వారే పోటీ పడుతున్నారు. ఇప్పటికే చిరు కుటుంబంలోని పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్ సినిమాలకు పోటీ వాతావరణం ఏర్పడింది. తాజాగా మరో వారసుడు ఆ కుటుంబం నుంచి రానున్నాడని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వారసుడు నాగబాబు కుమారుడన్నది విశేషం. అతని పేరు వరుణ్‌బాబు. ఇప్పటికే ఒక యువ దర్శకుడు వరుణ్ని దృష్టిలో వుంచుకుని ఒక స్క్రిప్టును సిద్ధం చేశాడనీ, దాన్ని నాగబాబుకు వినిపించాడనీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి. నాగబాబుకు కూడా ఆ కథ నచ్చింది. అయితే రాముడికి లక్ష్మణుడి మాదిరిగా అన్న మాటను జవదాటడనే పేరున్న నాగబాబు మొదట అన్న చిరంజీవి అనుమతి తీసుకున్నాకనే వరుణ్‌ను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. మరోవైపు వరుణ్ కూడా నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అతని సినిమా ఎప్పుడు మొదలవుతుందో, అన్నదమ్ముల సవాల్ (రాంచరణ్, వరుణ్) ఏ తీరున వుంటుందో చూడాల్సిందే.