కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌ను ‘మాస్’తో హీరో నాగార్జున దర్శకునిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దాని తర్వాత మరోసారి ‘డాన్’లో లారెన్స్ దర్శకత్వంలో నటించాడు నాగ్. దాని కలెక్షన్ల విషయంలో వున్న వివాదాన్ని పక్కనబెడితే ఆ సినిమా పట్ల విమర్శకులు పెదవి విరిచారు. నాగ్ కంటే లారెన్స్ పాత్రే పెద్దదిగా వుందనే, నాగ్ పాత్రని ఆ పాత్ర డామినేట్ చేసిందనే అభిప్రాయం సర్వత్రా వినిపించింది. కాగా మరోసారి ఆ ఇద్దరు కలిసి పనిచేయనున్నారనే ప్రచారం తాజాగా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. నాగ్ త్వరలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘కింగ్’ సినిమాను చేయబోతున్నాడు. దాని తర్వాత లారెన్స్‌తో అతను పనిచేస్తాడనేది ప్రచార సారాంశం. దీన్ని అన్నపూర్ణా స్టూడియోస్ బానర్ మీద నాగ్ స్వయంగా నిర్మిస్తాడట. దీన్నిబట్టి లారెన్స్ పట్ల నాగ్ పూర్తి విశ్వాసాన్ని వుంచినట్లు కనిపిస్తోంది. చూద్దాం. ఇది ఎంతవరకు నిజమవుతుందో..