Mr. Medhavi

Rating: 3.00/5

Critic Rating: (3.00/5)

“మిస్టరీ” మేధావి

షో, మిస్సమ్మ చిత్రాల దర్శకుడు నీలకంఠ ఆ సినిమాలతో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా జాతీయ, రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. మిస్సమ్మ చిత్రం క్లాస్ ఆడియన్స్ ఆదరణ పొందింది కూడా. అయితే ఆపై చేసిన సదామీ సేవలో, నందావనం చిత్రాలతో నీలకంఠ వెనుక పడ్డారు. ఆ చిత్రాల అనుభవంతో సీరియస్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టిన నీలకంఠ మిస్టర్ మేధావి అనే వెరైటీ ఎంటర్‌టైనర్ ని తలపెట్టారు. ఈ చిత్రం టైటిల్ కి తగ్గట్టుగానే మేధావి వర్గం మెచ్చే చిత్రంగా రూపొందింది. కథ బాగుంది కానీ కథనం బాగా నెమ్మదిగా సా…. గింది. లోపాలు పక్కన పెడితే క్లాస్ ఆడియన్స్ ఒక్క సారి చూడతగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ మిస్టర్ మేధావి. జనవరి 26న విడుదల అయిన ఈ చిత్రం పూర్తి వివరాలు ఇవి…

కథ:

విశ్వక్ సేన్ (రాజా) కేవలం తెలివి తేటలను పెట్టుబడిగా పెట్టి జీవితంలో పైకి వస్తాడు. ఎంబీఎ చేసిన విశ్వ తన మేధస్సు ఉపయోగించి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. చిన్నతనంలోనే తన స్కూల్ మేట్ అయిన శ్వేతని (జెనీలియా) ప్రేమిస్తాడు. ఆమె కెనడా వెళ్ళిపోయినా కూడా పన్నెండు సంవత్సరాలుగా ఆమెపై ప్రేమను పెంచుకుంటాడే కానీ చంపుకోడు. అయితే తాను పని చేస్తున్న కంపెనీ ఛైర్మన్ కూతురే శ్వేత. కెనడా నుంచి ఆమె తిరిగి రావడంతో మళ్లీ చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ ఒకటవుతారు. ఆమెతో తన ప్రేమను వ్యక్తం చేయకుండా శ్వేత చేతే తనకు ఐ లవ్ యూ చెప్పించుకుందామని ప్లాన్ వేస్తాడు మిస్టర్ మేధావి. కానీ శ్వేత తాను సిద్ధార్థ్ (సోనూ సూద్) అనే వ్యక్తిని ప్రేమించాను అని, అతనితో తనకు పరిచయం పెంచి ప్రేమ కుదిరేట్టు చేయమని విశ్వని కోరుతుంది శ్వేత. దాంతో కంగు తిన్న విశ్వ తప్పని పరిస్థితుల్లో వారిద్దరిని కలిపేందుకు సిద్ధపడతాడు. ఆపై ఏమి జరిగింది, కథ ఏ మలుపులు తిరిగింది అన్నది తెర మీద చూడాల్సిందే.

కథనం:

హీరో క్యారెక్టరైజేషన్ వైవిధ్యంగా రాసుకున్న నీలకంఠ దాని మీదే కథను అల్లుకున్నారు. మేధస్సుతో ఏదయినా చేయగలను అనుకునే పొగరుబోతు యువకుడికి కనువిప్పు కలిగించే అంశానికి ప్రేమ కథని జోడించి నీలకంఠ చేసిన ప్రయత్నం ప్రశంసనీయం. ముఖ్యంగా అతని ఆలోచనా విధానాన్ని అభినందించి తీరాలి. రొటీన్ కి భిన్నంగా చేయాలనే తపన చాలా చోట్ల కనిపించింది. అయితే ఈ క్రమంలో తన టార్గెట్ ఆడియన్స్ ని చాలా తగ్గించేసుకున్నారు. కథని టూ క్లాస్‌గా డీల్ చేయడం వలన సామాన్య ప్రేక్షకుడికి ఈ మేధావి వేవ్ లెంగ్త్ అంది చావదు. కథనం నత్త నడక నడుస్తుండడంతో పలు చోట్ల విసుగు పుడుతుంది. అయితే చక్కని హాస్యం, హీరో హీరోయిన్ల మధ్య అలరించే సన్నివేశాలు మేధావి వైపు ప్రేక్షకుడిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఇదంతా కేవలం ప్రథమార్థం వరకే పరిమితం అయింది. ద్వితీయార్థంలో స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ సీరియస్‌గా మారింది. ప్రథమార్థంలో ఉన్న సున్నిత హాస్యం కూడా బాగా తగ్గించేయడంతో అసలే నత్త నడక నడుస్తున్న కథనం ఒక్కో చోట అసహనం కలిగించే స్థాయికి విసుగెత్తిస్తుంది. హ్యూమన్ రిలేషన్స్ గురించి హీరోకి కనువిప్పు కలిగించే ప్రాసెస్ ను సైకాలజీ పాఠం చెప్తున్నట్టుగా మార్చడంతో స్క్రీన్‌ప్లే మరీ ఫ్లాట్ అయిపోయింది. క్లయిమాక్స్ బాగున్నప్పటికీ అంతకు ముందు జరిగే తంతు క్లయిమాక్స్‌లో ఆకర్షణని తగ్గిస్తుంది. ద్వితియార్థంలో పాటలకు చోటు లేకపోయినా బలవంతంగా కల్పించడంతో అవి పంటి కింద రాళ్ళాలా తగుల్తాయి. పైగా అవి వినసొంపుగా కూడా లేకపోవడంతో ఆ భారం మరింత పెరుగుతుంది. ప్రథమార్థంలో మేధస్సుని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్న హీరో చాలా యాక్టివ్‌గా కనిపిస్తాడు. కానీ ఒక్క సారి సోనూ సూద్ ఎంటర్ అయిన తర్వాత చేష్టలుడిగి చూస్తుండిపోతాడు. ఒక్కసారిగా ఐడియాలు తట్టని వాడిగా మారిపోవడమే కాదు, ఒక్కో చోట మేధావి కాస్తా బఫూన్ మాదిరి కనిపిస్తాడు. అతడిని కాస్త యాక్టివ్ మోడ్ లోనే ఉంచి ఐడియాస్ బ్యాక్ ఫైర్ అవుతున్నట్టు చూపిస్తే బాగుండేది. కేవలం హీరోని మిస్ లీడ్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల కావాలని ప్రేక్షకులని కూడా తప్పు దోవ పట్టించాలని చూడడం బాగోలేదు. మేధావులకి ఈ మేధావి మేధస్సు అర్థం అయినా కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం సగం సాల్వ్ చేసిన పజిల్‌లా మిస్టరీగా మిగిలిపోతాడు.

పాత్రధారుల ప్రతిభ: 

రాజా మేధావి పాత్రకు కావాల్సిన కన్నింగ్ నెస్‌తో  పాటు తాను ప్రేమించిన అమ్మాయిని కోల్పోతున్నప్పుడు అసహాయతను కూడా బాగా పలికించాడు. జెనీలియా మరోసారి చెప్పుకోదగ్గ పాత్రని పోషించింది. ఈమెకు వరుసగా కథానాయికకు ప్రాధాన్యమున్న సినిమాలే లభించడం గొప్ప విషయం. సోనూ సూద్ పాత్రకు తగ్గట్టుగా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడు. సుమన్, హేమ తమ పరిధిలో చక్కని అభినయం ప్రదర్శించారు. ఎమ్మెస్, ధర్మవరపు, బ్రహ్మానందం కామెడీ బాగుంది.

సాంకేతిక నిపుణుల పనితనం:
చక్రి సంగీతంలో రెండు పాటలు మెలోడియస్‌గా బాగున్నాయి. మిగిలినవి చిత్రానికి హెల్ప్ అయ్యేట్టు లేవు. రీరికార్డింగ్ పర్వాలేదు. నీలకంఠ స్వయంగా రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. సునీల్ రెడ్డి కెమెరా, నాగిరెడ్డి ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ నైపుణ్యం కనిపిస్తుంది. లో బడ్జెట్ సినిమా అయినా సినిమా రిచ్ గా కనిపించేందుకు ఎంచుకున్న లోకేషన్స్ దోహదపడ్డాయి. నీలకంఠ దర్శకుడిగా బాగానే మెప్పించారు కానీ ఒక్కోసారి నేల విడిచి సాము చేయడం ఇబ్బంది పెట్టింది. సామాన్య ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా తన పద్దతులు మార్చుకోగలిగితే నీలకంఠ సినిమాల రీచ్ పెరుగుతుంది. తనను తాను ఒక్క సెక్షన్‌కే రిస్ట్రిక్ట్ చేసుకోవడం ఆయనలో లోపం. కథనం వేగంగా నడపలేకపోవడం ప్రధాన సమస్య.

లోపాలు,బలాలు:

రాజా, జెనీలియా అభినయం, శుభ్రమయిన కామెడీ, వెరైటీ కాన్సెప్ట్ సినిమాకు బలాలు అయితే నీరసంగా సాగే కథనం, వీక్ సెకండ్ హాఫ్, మ్యూజిక్ బలహీనతలు. క్లాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి ఓటేసినా మాస్ కి బహు దూరంగా మేధావి మిగిలిపోతాడు. ఏ సెంటర్స్‌లో మంచి బిజినెస్ చేయగలిగే లక్షణాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ మీద జాగ్రత్త తీసుకుని ఉంటే మంచి సినిమా అనిపించుకుని ఉండేది.

-శ్రీనిధి

 

Give your rating:

We would like to hear your comments below: