సీనియర్ నటుడు మోహన్‌బాబు మరోసారి విలన్ పాత్రను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల హీరోగానే నటిస్తూ వస్తున్న ఆయన నిన్న ‘యమదొంగ’లో యముడిగా నటించి, నేడు ‘బుజ్జిగాడు’లో హీరోయిన్ త్రిష అన్న పాత్రని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక సినిమాలో విలన్ పాత్రను చేయడానికి ఆయన అంగీకరించినట్లు చిత్రమాలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ సినిమాను ఒక నాలుగు చిత్రాల దర్శకుడు రూపొందించనున్నాడు. ఇందులో హీరోగా ఒక నిర్మాత కుమారుడు నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమా సబ్జెక్ట్, అందులో విలన్ పాత్ర మోహన్‌బాబుకు నచ్చాయనీ, వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ ఫిల్మ్‌నగర్ అంతర్గత వర్గాలు తెలిపాయి. ఒకప్పుడు విలన్ పాత్రలతో మోహన్‌బాబు ఎంతగా పేరు తెచ్చుకున్నారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. డైలాగ్ మాడ్యులేషన్లో ఒక కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. కాగా ఆయన విలన్‌గా నటించే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో చిత్రమాల వెల్లడించనున్నది.