Mister Medhavi

Rating: 2.75/5

Critic Rating: (2.75/5)

‘మిస్టర్ మేధావి’

దర్శకుడు నీలకంఠ ‘మిస్టర్ మేధావి’ని ప్రకటించగానే చాలామంది ఆసక్తిని కనబర్చారు. జెనీలియా, రాజా కాంబినేషన్‌తో ఆ సినిమాని ఆయన చేస్తుండడం దానికి కారణం. తొలినాటి చిత్రాలు ‘షో’, ‘మిస్సమ్మ’లను స్క్రీన్‌ప్లే బలంతో ఆసక్తికరంగా మార్చిన నీలకంఠ చిత్రంగా ఆ తర్వాత ఆ పట్టును కోల్పోయాడు. అందుకు ‘సదా మీ సేవలో’, ‘నందనవనం 120 కి.మీ.’ ఉదాహరణలు. ఆ లోపాన్ని అధిగమించి ‘మిస్టర్ మేథావి’తో ఆయన మళ్లీ మునుపటి స్థాయిని సాధిస్తారనే అభిప్రాయం వ్యాపించింది. చాలాకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్న బొద్దులూరి రామారావు ఈ సినిమాని నిర్మించారు. ‘మిస్సమ్మ’ని నీలకంఠ రూపొందించిన తీరుచూసి, ముచ్చటపడి ఆయన ఈ సినిమాతో మళ్లీ చిత్ర నిర్మాణంలోకి కాలుమోపారు. కానైతే ఇందులోనూ కథ, కథనాలు బలహీనంగా ఉన్నాయని చెప్పక తప్పదు. 

కథ:

కోడూరులో చిన్నతనంలోనే మొదట తల్లినీ, తర్వాత తండ్రినీ కోల్పోయిన ఒక చిన్న పిల్లాడిని శంకరం మాస్టారు (తనికెళ్ల భరణి) చేరదీసి అక్షరాలు నేర్పించి విష్వక్‌సేన్ అనే పేరు పెడతాడు. విష్వక్ ఎనిమిదో క్లాసులో ఉండగా శ్వేత పరిచయమవుతుంది. అమ్మమ్మకు బాగా లేదని కెనడానుంచి వస్తుందామె. అక్కడ ఉన్నన్ని రోజులూ విష్వక్‌తో బాటే చదువుకుంటుంది. ఆమె అంటే అప్పుడే విష్వక్‌లో ప్రేమ భావన కలుగుతుంది. ఇద్దరి మధ్యా చనువు పెరిగి స్నేహితులవుతారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కెనాడా తిరిగి వెళ్లిపోతుంది శ్వేత. శంకరం మాస్టారు కూడా చనిపోవడంతో అనాథ అయిన విష్వక్ స్కాలర్‌షిప్స్ తోటే చదువు కొనసాగిస్తాడు. చిన్నతనం నుంచే మేథావిగా పేరు తెచ్చుకున్న అతను తన తెలివితేటలతో ఏదైనా సాధించగలననే గట్టి నమ్మకాన్ని ఏర్పరచుకుంటాడు. చదువు పూర్తిచేసి ఓ కార్పొరేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాన్ని సంపాదిస్తాడు విష్వక్ (రాజా). కృష్ణకుమార్ (సుమన్) అనే ఆ ఛైర్మన్ కూతురు కెనడానుంచి వస్తుంది. ఆమె ఎవరో కాదు శ్వేత (జెనీలియా). చిన్ననాటి స్నేహితులు మళ్లీ దగ్గరవుతారు. అయితే అప్పట్నించీ తన తెలివిని వుపయోగించి శ్వేత ప్రేమని సంపాదించడం కోసం జిమ్మిక్కులు చేయడం మొదలు పెడతాడు విష్వక్. అవి ఫలించాయా? అనుకోకుండా తమ మధ్యకు వచ్చిన సిద్ధార్థ (సోనూసూద్) వల్ల అతడు ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.

కథనం:

ఇది ఒక నీతి కథలాగుంది. మేథావితనాన్ని ప్రేమని పొందడం కోసం వుపయోగించకూడదనీ, మిగతా విషయాల్లో మాదిరిగా కాలిక్యులేషన్స్‌కి ప్రేమ లొంగదనీ చెప్పడం ఆ నీతి. రాజా పోషించిన విష్వక్‌సేన్ పాత్ర దానికోసం సృష్టించిందే. తన చిన్ననాటి నేస్తం శ్వేతని ప్రేమించిన విష్వక్ ఆమెనుంచే ప్రేమ ప్రపోజల్ రావాలని తన మేథస్సుని ఉపయోగిస్తాడు. తనే ఆమెకి పెళ్లి సంబంధం చూసి, తనే దాన్ని చెడగొడతాడు. ఆమె దృష్టిలో తను హీరో కావడానికి నానా రకాలుగా యత్నిస్తాడు. హృదయంతో గాక, మెదడుతో ఆమెని గెలవాలనుకుంటాడు. అనూహ్యంగా సిద్ధార్థ అనేవాడు రంగం మీదికొచ్చేసరికి అతడి మీదినుంచి ఆమె దృష్టిని మళ్లించేందుకు తంటాలు పడతాడు. అతడికి సరిగ్గా వ్యతిరేకమైన పాత్ర సిధార్థది. జీవితాన్ని లెక్కలతో తూసేవాడిలో మానవత్వం చచ్చిపోతుందనే మానవతావాది సిద్ధార్థ. విష్వక్‌లో మార్పు తెచ్చేది అతడే. తనకంటే సిద్ధార్థే శ్వేతకు సరైనవాడుగా విష్వక్ గుర్తించాడు. మిగతా పనిని శ్వేత పూర్తి చేస్తుంది. నైతిక దృష్టిని ప్రధానంగా పెట్టుకుని నీలకంఠ ‘మిస్టర్ మేధావి’ని చిత్రించాడు. అది మంచి పనే. దాన్ని ఆసక్తికరంగా మలచడంలోనే వుంది కీలకమంతా. ఇక్కడే నీలకంఠలోని కథకుడూ, దర్శకుడూ.. ఇద్దరూ వైఫల్యం చెందారు.
విష్వక్ ప్రధానాయుధం అతడి మేథస్సు. దర్శకుడు ఆ అంశం మీదే తన దృష్టిని ఎక్కువ ఫోకస్ చేయడంతో కథనంలో ఎక్కడా బిగువు కనిపించలేదు. విష్వక్ వేసే ఎత్తులతోటే కథంతా సాగిపోతే మజా ఏముంటుంది? ఎత్తుకి పైఎత్తు వేసేవాడు ఇంకొకడు వుంటే ఆట రంజుగా వుంటుంది. ఇందులో విష్వక్‌కి ప్రత్యక్షంగా ప్రత్యర్ధి ఎవడూ లేదు. అతడు వేసే పాచికలు చివరికి అతడికే చేటు తెస్తాయి. అతడిలో పరివర్తన కలిగించే సన్నివేశాలు బలంగా లేవు. సినిమా ‘బోర్’ అనిపించడానికి అదే ప్రధాన కారణం. చిన్నతనంలో ఏక సంథాగ్రాహిగా కనిపించి, శంకరం మాస్టారి ఆదరాన్నీ, ఆయన వద్ద ఆశ్రయాన్నీ పొందినవాడు పెద్దయ్యాక వేరే పనేమీ లేనట్లు తన తెలివినంతా శ్వేత ప్రేమని పొందడం కోసమే వెచ్చించడంతో ఆ పాత్ర ప్రేక్షకులకి సన్నిహితం కాలేకపోయింది. చివరికి అతడిలో పశ్చాతాపం కలిగినా అప్పటికే సమయం మించిపోయింది. అలా అని శ్వేత అయినా మెప్పించ గలిగిందా అంటే అదీలేదు. ఆమె పాత్రలో గాఢత బాగా తక్కువ. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఒక మరబొమ్మ మాదిరిగానే కనిపించింది తప్పితే బలమైన వ్యక్తిత్వం ఉన్నదానిలా తోచలేదు. ఆ పాత్రని బలంగా మలచగలిగే వీలుండి కూడా నీలకంఠ ఆ పని సరిగా చేయలేకపోయాడు. ప్రేక్షకుల్ని కొద్దో గొప్పో ఆకట్టుకుంది సిద్ధార్థ. బలమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా కనిపించింది అతడే.
ద్వితీయార్ధం సాగేకొద్దీ కథమీద ఆసక్తి సన్నగిల్లిపోతూ వచ్చింది. అది కథనంలో వేగం లోపించిన ప్రభావం. కథ జరుగుతూ వుంటే ఘడియ ఘడియకీ విష్వక్ జోక్యం చేసుకుని స్వఘోష వినిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇది కథనాన్ని బాగా నీరస పర్చేసింది. ఈ తరహా కథనాన్ని నీలకంఠ ఎంచుకోవడం ఆశ్చర్యకరం. ఆలోచిస్తే శ్వేత ప్రేమని పొందడానికి విష్వక్ అంత సంఘర్షణ పడాల్సిన అవసరం కనిపించదు. అతడి సంఘర్షణ ప్రేక్షకుడి సంఘర్షణ కాలేక పోయింది. ఈ విషయంలో విష్వక్‌నే అంటిపెట్టుకుని వుండే జాకిర్ (సుమన్‌శెట్టి) పాత్రని దర్శకుడు సమర్థవంతంగా వాడుకోలేక పోయాడు. జాకిర్ అంటే శ్వేతకూ అభిమానముంది. విష్వక్, శ్వేత ఒకటి కావాలని జాకిర్ ఆశపడుతుంటాడు. అలాంటప్పుడు జాకిర్ పాత్రతో విష్వక్ మంచి గేమే ఆడించవచ్చు. కానీ ఎందుకనో ఆ పాత్రని దర్శకుడు ఉపేక్షించాడు.
 

పాత్రధారుల అభినయం:

విష్వక్‌సేన్‌గా రాజా పరిధుల మేరకు నటించాడు. పాత్రలోని కన్నింగ్‌నెస్‌నీ, తన ఎత్తులే తనకు ఎదురు తిరుగుతుంటే కలిగే ఆందోళననీ సమర్ధవంతంగా పోషించాడు. శ్వేత పాత్రలో జెనీలియా సాధారణంగా ఉంది. ‘బొమ్మరిల్లు’, ‘ఢీ’లలోని జెనీలియాకు ఈ జెనీలియాకు తేడా స్పష్టంగా కనిపించింది. పాత్ర చిత్రణలో వచ్చిన తేడా అది. సిద్ధార్థగా సోనూసూద్ ఆకట్టుకున్నాడు. కృష్ణకుమార్‌గా సుమన్ హుందాగా ఉన్నాడు. వినోదాన్ని పంచిన పాత్రల్లో ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణలకే అగ్ర తాంబూలం. చిత్తరంజన్, కప్పగంతుల కృష్ణమూర్తి పాత్రల్లో చక్కని టైమింగ్‌తో వినోదాన్ని అందించారు. ఎమ్మెస్ ఏకపాత్రాభినయాల ఎపిసోడ్‌ని దర్శకుడు ప్రతిభావంతంగా చిత్రీకరించాడు. గాంధేయవాదినని చెప్పుకుంటూ, అందుకు విరుద్ధంగా వ్య్వహరించే వ్యక్తిగా బ్రహ్మానందం, శంకరం మాస్టారుగా తనికెళ్ల, జాకిర్‌గా సుమన్‌శెట్టి తమ పాత్రల్ని చక్కగానే నిర్వర్తించారు. 

టెక్నీషియన్ల పనితనం:

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ నీలకంఠ కావడం చేత స్క్రీన్‌ప్లేకీ, దర్శకత్వానికీ మధ్య ఘర్షణ జరిగినట్లు తోస్తుంది. సంభాషణలు తొలి సన్నివేశాల్లో బాగున్నాయి. ధర్మవరపు, ఎమ్మెస్‌లకు కూడా నీలకంఠ కలం చక్కని వినోదాత్మక సంభాషణల్ని అందించింది. సునీల్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా చోట్ల మెప్పించింది. కానీ జెనీలియాని ఆయన అందంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. హీరో హీరోయిన్ల చిన్ననాటి సన్నివేశాల్ని మాత్రం ఆయన బాగా తీశాడు. క్లోజప్ షాట్స్‌ని కూడా ఆయన కెమెరా సమర్ధవంతంగా చిత్రించింది. చక్రి సంగీతం ఆయన ఇదివరకటి చిత్రాలతో పోలిస్తే వైవిధ్యంగా ఉంది. ఎక్కువగా బీట్‌కి ప్రాధ్యాన్యతనిచ్చే ఆయన ఈసారి మెలోడీ బాణీలనిచ్చాడు. పాటలు కథకి అనుకూలంగానే ఉన్నాయి. మాంటేజ్ సాంగ్ బాగా వచ్చింది.

బలాలు, లోపాలు:

హాస్యం, సినిమాటోగ్రఫీ, సంగీతం బలాలు. మాస్ అప్పీల్ లేని కథ, కథనం తీరు, ప్రధాన పాత్రల చిత్రణ, ద్వితీయార్ధం బాగా సాగడం లోపాలు. మొత్తానికి నీలకంఠ మేథావితనం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలుగుతుందా.. చూడాలి .

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: