Michael Madana Kamaraju

Rating: 3.00/5

Critic Rating: (3.00/5)

‘మైఖేల్ మదన కామరాజు’ అలరించారు!

కమల హాసన్ నాలుగు పాత్రలు పోషించిన ‘మైఖేల్ మదన కామరాజు’ సినిమాను ఇదివరలో చూశాం. కమల్ చేసిన కామెడీకి విరగబడి నవ్వాం. ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు నిధి ప్రసాద్ మరో సినిమాను మన ముందుకు తీసుకు వచ్చాడు. పాత సినిమాకూ, ఈ సినిమాకూ టైటిల్‌లో తప్ప మరే విషయంలోనూ పోలిక లేదు. ప్రభుదేవా, శ్రీకాంత్, సునీల్ వరుసగా మైఖేల్, మదన్, కామరాజు పాత్రల్ని చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఒక్కరే. ఆమె ఛార్మి. ఈ సినిమా కథ అంతా ప్రేమ, పెళ్లి అనే అంశాల మీద నడుస్తుంది. ప్రేమంటే సదభిప్రాయంలేని ఒక ఫ్యాషన్ డిజైనర్ ఎలా ప్రేమలో పడి, ఆ విషయన్ని చెప్పలేక ఎలాంటి చిక్కుల్లో పడ్డాడనే అంశానికి నిధి ప్రసాద్ జోడించిన వినోదం ప్రేక్షకుల్ని ఆహ్లాద పరుస్తోంది. ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమాను ఇదివరలో ‘భగ్యలక్ష్మి బంపర్ డ్రా’ సినిమాను నిర్మించిన సిల్వర్ స్క్రీన్ మూవీస్ సంస్థ నిర్మించింది.

కథ:

మదన్ (శ్రీకాంత్) పేరుపొందిన ఫ్యాషన్ డిజైనర్. ఒకసారి తన స్నేహితుడు, మేనత్త కొడుకు అయిన కామరాజు (సునీల్)తో ఒక ఫ్యాషన్ షోకి జడ్జిగా పాల్గొనేందుకు గోవాకు వెళతాడు. అక్కడ అర్చన (ఛార్మి) తారస పడుతుంది. ఆమెనే జడ్జిలందరూ బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఎంపిక చేస్తారు. మదన్ పట్ల ఆకర్షితురాలవుతుంది అర్చన. అయితే మాటల సందర్భంలో ప్రేమ అంటే తనకు గిట్టదని మదన్ చెప్పడంతో ఆశ్చర్యపోతుంది. హైదరాబాద్‌కు వచ్చాక అర్చనను తన సంస్థలోనే క్రియేటివ్ హెడ్‌గా అపాయింట్ చేస్తాడు మదన్. మరోవైపు అతనితోటే గోవాకు వెళ్లిన సార్థక నామధేయుడైన కామరాజు అక్కడ మందిర (ఆశాషైనీ) అందాల్ని చూసి, ఆమెకు దాసోహమై, తనతో బాటు ఆమెనీ హైదరాబాద్ తీసుకు వస్తాడు. అర్చన పట్ల మదన్‌లో ప్రేమ కలిగిస్తే మందిరతో తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని భావిస్తాడు కామరాజు. నిజంగానే అర్చన అంటే ఆరాధన మొదలవుతుంది మదన్‌లో. అయితే ఒకప్పుడు తనకి ప్రేమంటే ద్వేషమని ఆమెకి చెప్పినందున సందిగ్ధంలో పడిపోతాడు. అంతలో పెళ్లి చూపులకని వైజాగ్‌కి వెళుతుంది అర్చన. దాంతో కామరాజు ఒక తప్పుడు శుభలేఖ సృష్టించి రవి అనే అతనితో అర్చన పెళ్లవబోతుందని మదన్‌ని నమ్మిస్తాడు. రవి స్థానంలో కామరాజు వేయించిన ఫోటో మైఖేల్ (ప్రభుదేవా) అనే యువకుడిది. ఒక బార్‌లో మైఖేల్‌ని చూసిన మదన్ అతడికి తను అర్చనని ప్రేమిస్తున్న సంగతి చెప్పి, ఎలాగైనా తమని కలపమంటాడు. అంతదాకా అర్చన ఎవరో ఏమిటో తెలీని మైఖేల్ తనే రవిగా నాటకమాడి అర్చననీ, ఆమెతో బాటు డబ్బునీ సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. అతడి ప్లాన్ సక్సెస్ అయ్యిందా? లేక అర్చనకు మదన్ దగ్గరయ్యాడా? అనేది క్లైమాక్స్.   

కథనం:

‘మైఖేల్ మదన కామరాజు’ ప్రధానంగా కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌తో నడిచే సినిమా. ప్రేమ అంటే ఉత్త ట్రాష్ అనే మదన్‌లో ప్రేమ భావన కలగడం ఇందులోని ప్రధానాంశం. అయితే కలిగిన ప్రేమను వ్యక్తం చేయలేని అశక్తతలో అతణ్ణి పడేసి రెండున్నర గంటల వినోదాన్ని పండించాడు దర్శకుడు ప్రసాద్. దీనికోసం ఆయన కల్పించిన పాత్రలు, సన్నివేశాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. ‘అందరూ దొంగలే’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ వంటి హాస్యప్రధాన చిత్రాలు రూపొందించిన దర్శకుడు ప్రసాద్ ‘మైఖేల్ మదన కామరాజు’నీ వాటి తరహాలోనే చిత్రించాడు. సినిమాలో మదన్ బలహీనత తను ప్రేమిస్తున్నానని అర్చనకు చెప్పుకోలేక పోవడం. దీన్ని క్యాష్ చేసుకునే మైఖేల్ అనే పాత్రను సృష్టించి కథలో వదిలిపెట్టాడు దర్శకుడు. ద్వితీయార్ధాన్ని నడిపించేది ఈ పాత్రే. అతడు ‘ఏర్పాటు చేసుకున్న’ కుటుంబం చేసే హంగామా అంతా ఇంతా కాదు. మైఖేల్‌కు తండ్రిగా నటించే కోట శ్రీనివాసరావు పాత్రను ప్రసాద్ చిత్రించిన తీరు సినిమాకు హైలైట్. తలమీద విగ్గు పెడితే చాలు తనకు అప్పగించిన పాత్రలో జీవించే శ్రీనివాసరావుగా ఆ పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా అలరిస్తుంది. మరోవైపు కామరాజు వెంటపడే బ్రహ్మానందం పాత్ర కూడా తక్కువ తినలేదు. గోవా నుంచి కామరాజును వెంటాడుతూ వచ్చే అతగాడి చేష్టలకు నవ్వని వారుండరు. అతను కామరాజును ఎందుకు వెంటాడుతాడు? అది సినిమాలో చూస్తేనే అందం. ద్వితీయార్ధం సాగుతుందని భావించేంతలో ఏదో ఒక కామెడీ సన్నివేశం వచ్చి బోర్ ఫీల్ లేకుండా చేస్తుంది. కాకపోతే పాటలే కాస్త ఇబ్బందిపెట్టాయి. ప్రేమ అంటే గిట్టని మదన్ సైడు నుంచి ఇమాజినేషన్ పాటలు రావడం కాస్త చికాకుని కలిగిస్తుంది. టైటిల్‌లోని కామరాజు పాత్రకే తగిన న్యాయం చేకూరలేదు. అతడికి జోడీగా చిత్రించిన మందిర పాత్ర ప్రవర్తన హుందాగా వుండదు. ఆమె లేకి మనిషిగా కనిపిస్తుంది. కానీ ఆమెనే కామరాజుకి హీరోయిన్ని చేసి దర్శకుడు అసంతృప్తి కలిగించాడు. క్లైమాక్స్‌లో కోట, కోవై సరళ మధ్య చిత్రించిన శోభనం సీను ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగిస్తుంది. అదనే కాదు దర్శకుడు పలుచోట్ల శృంగారం మీదనే ఎక్కువ ఆధారపడ్డాడు. అంటే సెక్స్ కామెడీ మీద. ఆశాషైనీ, అభినయశ్రీ, కౌష పాత్రల మీద దర్శకుడు ఆ తరహా సన్నివేశాలు చిత్రించాడు.

పాత్రధారుల అభినయం:

మదన్ పాత్రలో శ్రీకాంత్ రాణించాడు. ఎర్రగా డై చేసిన జుట్టుతో కొత్తగా కనిపించాడు. సినిమా అంతా కామెడీ అయినా కామెడీ చేయని పాత్ర మాత్రం అతడిదే. మైఖేల్‌గా ప్రభుదేవా తనదైన శైలిలో నటించాడు. అతడి పాత్రని ప్రథమార్ధం ముగిసే సమయంలో గాక, మరి కాస్త ముందుగా ప్రవేశపెట్టినట్లయితే ఇంకా బాగుండేది. సెకండాఫ్‌కు జీవం తెచ్చిన ఆ పాత్రతో ప్రభుదేవా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. అర్చన పాత్రలో ఛార్మి అందాల భరిణగా దర్శనిమిస్తుంది. ఉపయోగించిన కాస్ట్యూమ్స్ కూడా ఆమె సౌందర్యాన్ని పెంచాయి. తన పాత్రకు న్యాయం చేకూర్చింది. సునీల్ సంగతి చెప్పేదేముంది! పదేపదే తికమకకి గురయ్యే కామరాజు పాత్రలో జీవించాడు. వినోదం పంచాడు. ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకునే రెండు పాత్రల్లో కోట, బ్రహ్మానందం విజృంభించారు. ప్రేక్షకుల నోట అందరికంటే ఎక్కువ నవ్వులు పూయించింది ఆ ఇద్దరే. ఆ ఇద్దరికీ చాలా రోజుల తర్వాత పూర్తి నిడివి కామెడీ పాత్రలు లభించాయి. వాటిని ఇద్దరూ దున్నేశారు. బ్రహ్మానందం కనిపించిన ప్రతిసారీ నవ్వని ప్రేక్షకుడుండడు. ప్రభుదేవా తల్లిగా నాటకమాడే పాత్రలో కోవై సరళ, ఆమె ప్రియునిగా మల్లికార్జునరావు, వేణుమాధవ్, అభినయశ్రీ జంట, డ్రైవర్‌గా అలీ, కోట అసిస్టెంట్‌గా కొండవలస, మదన్ మీద మనసుపడే రోజీగా కౌష, ఛార్మి తల్లిదండ్రులుగా నాగబాబు, కవిత తమ పాత్రల్ని రక్తి కట్టించారు.

టెక్నీషియన్ల పనితనం:

దర్శకుడు ప్రసాద్‌లోని స్క్రీన్‌ప్లే రచయిత ఈ సినిమాకు సమర్థవంతంగా పనిచేశాడు. ఈ సినిమాకు కథనమే కీలకం. ఆ విషయంలో ప్రసాద్‌కు మంచి మార్కులు పడతాయి. ఎక్కడా బోర్ కలిగించని రీతిలో సన్నివేశాల్ని మలిచాడు. హాస్యనటుల్ని ఆయన ఉపయోగించుకున్న తీరు దర్శకుడిగా ఆయన మరింత సామర్థ్యాన్ని సంతరించుకున్నాడనే సంగతిని తెలియ జేస్తుంది. రమేష్, గోపి సంభాషణలు సందర్భోచితంగా సాగి హాస్యాన్ని పంచాయి. వారి కలాలు హాస్య సిరాతో నిండినట్లనిపించాయి. పాటలకు చక్రి కూర్చిన బాణీలు పర్వాలేదు. అయితే కనీసం రెండు పాటలు సందర్భోచితంగా లేవు. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తగినట్లుగా వుంది. వాసు కెమెరా చురుగ్గా పనిచేసింది. సాధారణంగా మన తెలుగు హాస్య చిత్రాల ప్రమాణాలతో పోలిస్తే ‘మైఖేల్ మదన కామరాజు’ క్వాలిటీగా కనిపించడంలో సినిమాటోగ్రఫీ పాత్ర ఎంతో వుంది. శంకర్ ఎడిటింగ్ కూడా ప్రమాణాలకు తగ్గట్లే వుంది. సెకండాఫ్‌ను ఒక పది నిమిషాలు కుదించి వుంటే సినిమా మరింత ఆసక్తి కరంగా తయారయ్యేది. పేకేటి రంగా కళా దర్శకత్వం కూడా బాగుంది. 

బలాలు, లోపాలు:

స్క్రీన్‌ప్లే, కామెడీ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు పాత్రలు, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బలాలు. మదన్ పాత్ర తగినంత ఆకర్షకంగా లేకపోవడం, ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఇబ్బందిపెట్టే సెక్స్ కామెడీ, ద్వితీయార్ధం కాస్త సాగడం, ప్రభుదేవా పాత్ర ఆలస్యంగా ప్రవేశించడం లోపాలు.

…యజ్ఞమూర్తి

 

Give your rating:

We would like to hear your comments below: