తెలుగు, తమిళ చిత్రాల తార మీరాచోప్రా ప్రేమలో పడిందా? ప్రస్తుతం తమిళ చిత్రసీమలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి అవునని చెప్పాల్సి వస్తోంది. కేరళకు చెంది తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్యతో ఆమె ప్రేమలో పడిందనేదే ఆ ప్రచార సారాంశం. పవన్ కల్యాణ్ చిత్రం ‘బంగారం’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మీరా ఈ సంక్రాతికి విడుదలైన ‘వాన’లోనూ నాయికగా దర్శనమిచ్చింది. నితిన్ సరసన ‘సత్యం శివం సుందరం’ అనే సినిమాలో నటించిప్పటికీ ఇంతదాకా అది విడుదల కాలేదు. కాగా మీరా, ఆర్య చెన్నైలో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారనీ, తమ మధ్య ప్రేమని వారు దాచుకోవడం లేదనీ వినిపిస్తోంది. 2008 డిసెంబర్లో వారు పెళ్లి చేసుకోవచ్చని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.