రేటింగ్ – 3/5
శ్రేయోభిలాషి అభిలాష మంచిదే
యితే కమర్షియల్ మసాలా సినిమాలు, లేదా భయ పెట్టి డబ్బు చేసుకునే థ్రిల్లర్లు రూపొందే తెలుగు చిత్ర సీమలో సమాజ శ్రేయస్సు కోరే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. రాజేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు అలాంటి అరుదయిన చిత్రం “ఆ నలుగురు” చేస్తే ప్రేక్షకులు దానికి మంచి మార్కులు వేశారు. ఆ చిత్రం అందించిన స్పూర్తితో మళ్లీ ఆయన అలాంటి సామాజిక ప్రయోజనం ఉన్న సినిమా చేశారు. అదే “మీ శ్రేయోభిలాషి”. “ఆ నలుగురు” సినిమా అంతగా ఆకట్టుకొక పోయినా “మీ శ్రేయోభిలాషి” చిత్రంలో కూడా కొన్ని మెచ్చు తునకలు ఉన్నాయి. డిసెంబర్ 28న విడుదల అయిన “మీ శ్రేయోభిలాషి” చిత్రం వివరాల్లోకి వెళితే…
కథ:
ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారిలో తనకు తారస పడిన కొందరిని రాజాజీ (రాజేంద్ర ప్రసాద్) ఒక చోట చేరుస్తాడు. రక రకాల నేపథ్యాల నుంచి వచ్చిన వారంతా వేర్వేరు కారణాల మీద చనిపోవాలని అనుకుంటారు. వారందరి మధ్య ఉన్న సామీప్యత ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన. దానిని వినియోగించుకుని వారందరికీ ఒకేసారి సామూహిక ఆత్మ హత్య చేసుకునే పథకం రచిస్తాడు రాజాజీ. ఆ పథకం ప్రకారం వారంతా ఆరు గంటల పాటు బస్సులో ప్రయాణం చేసి శ్రీశైలం కొండ మీది నుంచి బస్సుతో సహా లోయలో పడి యాక్సిడెంటల్గా చనిపోవాలి. ఇందుకోసం అంతా కలిసి బస్సులో చేరతారు. అనుకున్న గమ్యం చేరుకునే లోగా వీరికి దారిలో పలువురు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పరిచాయల వలన వీరిలో మార్పు వచ్చిందా? రాజాజీ ఇదంతా ఎందుకు చేశాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం:
దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉండడంతో సినిమా ప్రారంభం లోనే ఆసక్తి రేకెత్తుతుంది. కథాంశం బరువయినది అయినప్పటికీ దానికి సున్నిత హాస్యం జోడించి కథనం లో ఎలాంటి ఆటు పోట్లు లేకుండా నడిపించడంతో చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. అలా అని ఇందులో లోపాలు లేక పోలేదు. ఇందులో ప్రధాన పాత్ర అభిలాష మంచిదే అయినా ఆచరణ మాత్రం ఆమోద యోగ్యంగా లేదు. సినిమాను హాఫ్ వేలో ఓపెన్ చేయడం వలన పాత్రల పరిచయానికి అంత సమయం అవసరం పడలేదు. దీని ద్వారా దర్శకుడికి పాత్రల మానసిక సంఘర్షణ చూపించేందుకు ఆస్కారం లభించింది కానీ దానిని అతను వినియోగించుకోలేదు. అన్ని పాత్రలను గబా గబా బస్సు ఎక్కించాలనే తాపత్రయమే కనిపించింది మొదటి సగంలో. దీని వలన బస్సు ఎక్కే లోపు జరిగిన కథ ఏమీ లేకపోయినా, అక్కడే ఇంటర్వల్ ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తింది. కేవలం 50 నిముషాలకే ఇంటర్వల్ వచ్చేయడంతో కాన్సెప్ట్ బాగుందనే అభిప్రాయం కలిగినా, ప్రేక్షకుడిలో ఏదో ఒక మూలన అసంతృప్తి నెలకొంటుంది. ఈ ఫీల్ రాకుండా ఉండేందుకు దర్శకుడు తనకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని, కనీసం కొన్ని పాత్రలతో అయినా ప్రేక్షకుడు ఎమోషనల్ ఎటాచ్‌మెంట్ పెంచుకునేట్టు చేయాల్సింది. కానీ దానిని విస్మరించడంతో ఈ విధమయిన కమ్యూనికేషన్ గ్యాప్ ప్రేక్షకుడికి, పాత్రలకి నడుమ ఏర్పడడంతో అతను ఆ పాత్రలు ఎప్పుడు ఆత్మ హత్య చేసుకునే ఆలోచన మానతాయి అని ఎదురు చూస్తాడే తప్ప, వారు చనిపోకూడదు అని మాత్రం భావించడు. వీరు చనిపోకుండా ఉంటే బాగుంటుందే అన్న భావన ఎప్పుడయితే ప్రేక్షకుడిలో నెలకోనలేదో వారి పాత్రల మీద జాలి గానీ, వారికి ఏమీ కాకూడదనే తపన గానీ పుట్టవు. ఈ కారణంగా ఈ చిత్రం ఎమోషనల్‌గా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో విఫలమయింది. అయితే దర్శకుడు ఎంచుకున్న వినోదాత్మక బాణీ మరో విధంగా మనల్ని ఆకర్షిస్తుంది. బస్ జర్నీలో వివిధ పాత్రలు పరిచయమవుతూ నెమ్మదిగా వారిలో పరివర్తన వస్తూ ఉంటుంది. ఇందుకోసం కొన్ని మంచి సన్నివేశాలను దర్శకుడు సిద్ధం చేసుకున్నాడు. అయితే ఎక్కడా వినోదాన్ని మాత్రం విడిచి పెట్టలేదు. ఇది ఒక రకంగా సినిమాకు మంచే చేసింది కానీ కథ ఔచిత్యం మాత్రం దెబ్బ తింది. ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారికి ఈ సినిమా వల్ల కను విప్పు కలగడం కల్ల. అంత డెప్త్ ఈ చిత్రంలో కాన రాదు. దీని వలనే ఒక మంచి చిత్రంగా నిలవాల్సిన ప్రయత్నం కాస్తా జస్ట్ ఓకే అని మాత్రం అనిపించింది.
పాత్రధారుల ప్రతిభ:
రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప నటుడికి ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఆ నలుగురు చిత్రం అంతటి ఉదాత్తమయిన పాత్ర కాకున్నా, దీనికి అనుగుణమయిన, అవసరమయిన నటనను ఆయన ప్రదర్శించారు. రాజేంద్ర ప్రసాద్ తోటి కామెడీ హీరో నరేశ్ దెబ్బ తిన్న సినీ నిర్మాతగా చక్కని నటన కనబరిచారు. కృష్ణ భగవాన్, రఘు బాబు ఇద్దరిలో రఘుబాబే బాగా స్కోర్ చేశాడు. నాజర్ పాత్ర విషయ శూన్య మయింది. బ్రహ్మానందం కనిపించిన కాసేపు బాగానే నవ్వించారు.
టెక్నీషియన్ల పనితనం:
ఒకటే పాట ఉన్న ఈ చిత్రానికి థీంకి తగ్గట్టు చక్కని బాణీని అందించారు కోటి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు లైఫ్ తీసుకొచ్చింది. రమేశ్ రాసిన సంభాషణలు బాగున్నాయి. సందర్భోచితంగా ఆయన చక్కని మాటలు రాశారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ చిన్న చిత్రం ప్రమాణాలకి ఎక్కువనే చెప్పాలి. దర్శకుడు ఈశ్వర రెడ్డి తాను అనుకున్న కథను సవ్యంగానే తెర కెక్కించాడు కానీ కథనం, పాత్ర చిత్రణల విషయంలో మరింత కష్టపడి ఉంటే బాగుండేది. నిర్మాత సీ.సీ. రెడ్డి చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.
బాక్సాఫీస్ ఫలితం:
ఈ చిత్రం కేవలం కొందరు ప్రేక్షకులనే మెప్పించే అంశాలతో రూపొందింది. ఫ్యామిలీస్, లేడీస్ వస్తే తప్ప ఈ చిత్రం ఎక్కువ రోజులు మనలేదు. మాస్, యూత్ మెచ్చే అంశాలు ఏమీ లేవు. మంచి చిత్రాలను ఆదరించే పెద్ద మనసు ఎందరు ప్రేక్షకుల్లో ఉంటే అంత మంచి ఈ చిత్రానికి జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద సినిమాల జడిలో పడి కొట్టుకు పోయి కేవలం డీవీడీ సినిమాగా మిగిలిపోతుంది.
-శ్రీనిధ్