Mee Sreyobhilashi

Rating: 0.00/5

Critic Rating: (0.00/5)

రేటింగ్ – 3/5  

సాఫీగా సాగిన ‘శ్రేయోభిలాషి’

ఏదో ఒక సామాజికాంశాన్ని తీసుకుని సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్న విసు ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మీ శ్రేయోభిలాషి’. సమాజానికి పెద్ద సమస్యగా పరిణమించిన ఆత్మహత్య అనే అంశాన్ని తీసుకుని వి. ఈశ్వరరెడ్డి అనే దర్శకుణ్ణి పరిచయం చేస్తూ ఈ సినిమాని అది నిర్మించింది. ఇది కమర్షియల్ సినిమా కాదు. చిత్ర కథాంశం, పాత్రల తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ‘మీ శ్రేయోభిలాషి’ ఓ ఉదాత్త చిత్రం. ‘సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగిరాదు’ అనే పాజిటివ్ భావనని నిరాశావాదుల్లో కలిగించేందుకు ఉద్దేశించిన ఈ చిత్రాన్ని సాధారణ ప్రేక్షకులు ఏ రీతిన స్పందిస్తారనే సంగతిని అలా ఉంచితే, ఆ చిత్రాన్ని ఓ మంచి ప్రయత్నంగా ప్రశంసించక తప్పదు. ఇదివరకు ‘ఆ నలుగురు’ అనే చిత్రంలో జర్నలిస్ట్ రఘురామ్ అనే ఉత్తమ పాత్రని చేసిన రాజేంద్రప్రసాద్.. మరోసారి ఆ పాత్రని జ్ఞప్తి చేసే రాజాజీ అనే ఉదాత్త పాత్రని సమర్థవంతంగా పోషించారు

కథ:

ప్రేమించి మోసపోయిన తన కూతురు స్వప్న (మేథ) ఆత్మహత్య చేసుకోవడంతో రాజాజీ (రాజేంద్ర ప్రసాద్) అనే సంఘ సేవకుడు సమాజంలో మరెవరూ తన కూతురిలా అత్మహత్యకు పాల్పడ కూడదనీ, సమస్యను ఎదుర్కొనేలా వారి మనసుల్ని మార్చాలనీ నిర్ణయించుకుంటాడు. నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారు తనని సంప్రదించాల్సిందిగా పేపర్లో ప్రకటన ఇస్తాడు. దానికి స్పందించి వచ్చిన కొంతమంది తమకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని అతనికి చెబుతారు. వారిలో సినీ నిర్మాత, చిట్‌ఫండ్ వ్యాపారి, ఓ ప్రాణాంతక రోగి, బస్ డ్రైవర్, కొడుకులు చూడడం లేదని బాధపడే ఓ వృద్ధ జంట, తమ ప్రేమని పెద్దలు ఒప్పుకోవడం లేదని బాధపడే ప్రేమికుల జంట, టెన్త్  క్లాస్ రెండోసారి తప్పినందుకు తండ్రి కోప్పడ్డాని ఆవేదన పడే కుర్రాడు.. ఇలా కొంతమంది ఉంటారు. అందరం కలిసి చద్దామనీ, అయితే లోకానికి అది ఆత్మహత్యగా గాక, యాక్సిడెంట్ అనే భావన కలిగిస్తే తమ కుటుంబాలకు కూడా ఇబ్బంది కలగదని వారిని ఒప్పిస్తాడు రాజాజీ. నగరానికి దూరంగా శ్రీశైలం వద్ద ఉన్న కైలాసగిరి కొండల్ని ఆత్మహత్యలకు తగిన వేదికగా ఆయన పేర్కొంటాడు. బస్ లోయలో పడిపోతే అందరూ దాన్ని యాక్సిడెంట్‌గా అనుకుంటారనీ, ఎవరికీ అది ఆత్మహత్య అనే సందేహం రాదనీ చెబుతాడు. అందరూ సరేనంటారు. దాంతో ‘జర్నీ టు డెత్’ మొదలవుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయి, రాజాజీ ఆశయం నెరవేరిందా, లేదా అనేది మిగతా కథ.

కథనం:

ఒక సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించి తీసిన ఈ సినిమాలో మనం చూడాల్సింది.. ఆ సందేశాన్ని ఇచ్చేందుకు వారు ఎలాంటి కథనీ, ఎలాంటి పద్ధతినీ అనుసరించారనే అంశాన్ని. ‘సమస్యలు అందరికీ వస్తుంటాయి. వాటికి ఆత్మహత్య పరిష్కారం కాదు’ అని చెప్పడం దర్శక నిర్మాతల ఉద్దేశం. దానికోసం వారు ఓ సాఫీ అయిన కథ, కథనాల్ని ఎంచుకున్నారు. ఆ కథ ఇంతదాకా తెలుగులో రాని కొత్త అంశంతో రూపొందింది కావడం వల్ల ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వారిలో పరివర్తన కలిగించడం కోసం కథానాయకుడైన రాజాజీ ఎంచుకున్న మార్గం మాత్రం ప్రమాద కరమైంది. అతను ఓ రిస్క్ గేమ్ ఆడాడు. దానికి క్లైమాక్స్‌లో ఎదురైన అనుభవమే నిదర్శనం. చావు అంచుకు తీసుకుపోతే, దానిపట్ల మొదట భయం, తర్వాత విముఖత కలుగుతాయనే పాయింట్‌ని కేంద్రంగా తీసుకుని దర్శకుడు ఈ సినిమాని నడిపించాడు. ఈలోగా జీవితాన్ని ఎలా సవాలుగా తీసుకుని ముందుకు సాగాలో కొన్ని పాత్రల ద్వారా చూపించడాన్ని అతను విస్మరించలేదు. ప్రమాదంలో కాళ్లు రెండూ పోగొట్టుకున్న ఓ వికలాగుండు జీవితాన్ని ఎలా పాజిటివ్‌గా తీసుకుని జీవిస్తున్నాడో, ఒకప్పుడు కోటీశ్వరుడైన ఓ హోటల్ యజమాని ఆస్తులన్నీ పోగొట్టుకున్నా అధైర్య పడకుండా ఓ చిన్న దాబా పెట్టుకుని ఎలా జీవనాన్ని సాగిస్తున్నాడో చూపించి ఆత్మహత్య చేసుకోవాలంకుంటున్న వారిలో ఆలోచనని రేకెత్తిస్తాడు. ఇందిరా పార్క్ వద్ద మొదలైన ఆరు గంటల ‘జర్నీ టు డెత్’ని ఆసక్తికరంగా చిత్రించడంలో దర్శకుడు కొంతమేర సఫలమయ్యాడు. ఆ ప్రయాణానికి ముందుగానే రోగి అయిన రామకృష్ణ (చిన్నా) పాత్రని యాక్సిడెంట్‌లో చనిపోయేలా చేయడం కథకి నాటకీయతని జోడించడంలో భాగం. దానివల్ల అతని డైరీని పోలీసులు చదవుతారు. ఓ పదిమంది వ్యక్తులు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే సంగతి లోకానికి తెలుస్తుంది. అయితే వారెవరనే సంగతీ, ఆత్మహత్యలు జరిగే ప్రదేశం ఎక్కడనే సంగతీ ఆ డైరీలో ఉండదు. ఫలితంగా వారిని ట్రేస్ చేసి, కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద పడుతుంది. దీనికోసం దర్శకుడు కల్పించిన పాత్రలు ఆకట్టుకోలేక పోయాయి. ఏసిపి, కానిస్టేబుళ్ల పాత్రలు జోకర్లుగా దర్శనమిచ్చి కథకి ఔచిత్య భంగం కలిగించాయి. సీరియస్ కథాంశం కాబట్టి రిలీఫ్ కోసం వాటిని అలా తయారు చేశామని దర్శకుడంటే కూడా మనం కన్విన్స్ కాలేం. థీమ్ సాంగ్ మినహా అసహజమైన పాటలు లేకపోవడం హాయనిపిస్తుంది.  జాతకాలు చెప్పే దొంగ స్వాముల పట్ల జనంలో ఉండే గుడ్డి నమ్మకాన్ని ఎత్తిచూపడానికి కూడా దర్శకుడు ఈ కథని వినియోగించుకున్నాడు.

పాత్రధారుల ప్రతిభ:

రాజాజీ పాత్రలో రాజేంద్రప్రసాద్ చులాగ్గా ఇమిడిపోయారు. ‘ఆ నలుగురు’లో రఘురామ్ పాత్రని గొప్పగా చేసిన ఆయన రాజాజీ రోల్‌ని చేయడానికి పెద్దగా కష్టపడలేదు. అంటే అంత సునాయాసంగా ఆ పాత్రని పోషించారు. కూతురుతో సరదాగా గడిపే ఆయన ఆమె ఆత్మహత్య చేసుకున్నాక ప్రదర్శించిన హావభావాలు, బస్ ప్రయాణంలో వివిధ సన్నివేశాల్లో సందర్భానుసారం చేసిన అభినయం ఆయన నటనా సామర్థ్యాన్ని కళ్లముందుంచుతాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది నరేష్ గురించి. ‘నాశనం’ అనే సినిమా తీసి జీవితంలో నాశనమైన సినీ నిర్మాత సూర్యప్రకాశరెడ్డి పాత్రని ఉత్తమ స్థాయిలో పోషించాడు. నిజం చెప్పాలంటే కొన్ని సన్నివేశాల్లో రాజేంద్రప్రసాద్ కంటే కూడా మెరుగైన నటనని ఆయన ప్రదర్శించాడు. బస్ డ్రైవర్ మల్లేష్ పాత్రని చేసిన రఘుబాబు ‘జర్నీ టు డెత్’కి జీవాన్నిచ్చాడు. అతని పాత్ర, డైలాగులు రిలీఫ్‌నిస్తాయి. కృష్ణభగవాన్, రావికొండలరావు, రాధాకుమారి, చిన్నా, మీనా, ధనుష్ తదితరులు పరిథుల మేరకు చేశారు. స్వాములుగా బ్రహ్మానందం కొద్దిసేపు అలరిస్తారు. భరణి, అలీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఏసిపి పాత్ర నాజర్ పోషించదగ్గది కాదు.

టెక్నీషియన్ల పనితనం:

ఈ సినిమాకి మాటలు, నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. సందర్భానికి తగ్గట్లు రమేష్ చెప్పాల రాసిన సంభాషణలు బాగా ఆకట్టుకున్నాయి. ప్రధాన పాత్రలన్నింటికీ పాత్రకు తగ్గట్లు ఆయన మాటలు రాశాడు. జీవిత సారాన్ని చెప్పే పాటలకు, సన్నివేశాలకు కోటి చక్కని బాణీలను కూర్చారు. రవీంద్రబాబు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. కొన్ని సందర్భాల్లో లైటింగ్ డల్ అయిపోయి కనిపించడం ఎవరిలోపమో? ఎడిటింగ్ క్రిస్ప్‌గా ఉంది. రెండు గంటల్లో సినిమా అయిపోవడం బిగ్ రిలీఫ్.
బలాలు, లోపాలు:

కథాంశం, రాజేంద్రప్రసాద్, నరేష్, రఘుబాబు పాత్రలు, మాటలు బలాలు. సన్నివేశాల్లో, పాత్రల్లో కృత్రిమత్వం కనిపించడం, జీవితం పట్ల పాజిటివ్ దృక్పథాన్ని కలిగించడం కోసం కల్పించిన పాత్రలు, సన్నివేశాలు బలహీనంగా ఉండడం, ఎసిపి, కానిస్టేబుళ్ల పాత్రల్ని జోకర్లుగా చూపించడం లోపాలు.

యజ్ఞమూర్తి

Give your rating:

We would like to hear your comments below: