Mantra – Review by Srinidhi

Rating: 0.00/5

Critic Rating: (0.00/5)

భయపెట్టే మంత్రం
రేటింగ్ – 3/5

అనుకోకుండా ఒక రోజు చిత్రంతో వెరైటీ చిత్రాలు ఇష్టపడే వారిని, యూత్, క్లాస్ సెక్షన్ ఆడియన్స్‌ని చార్మి ఆకట్టుకుంది. మళ్లీ ‘మంత్ర’ చిత్రంతో ఆ వర్గం ప్రేక్షకులంతా ఆకర్షితులయ్యారు. టైటిల్, సినిమా పోస్టర్స్‌ని బట్టి ఇది ఏ తరహా చిత్రమనేది ప్రేక్షకులకి ఒక ఐడియా ఏర్పడడంతో వైవిధ్యభరిత చిత్రాలు ఇష్టపడే వారంతా ‘మంత్ర’ చిత్రానికి తొలి రోజే తరలి వచ్చారు. అందుకే మంత్ర చిత్రం ఓపెనింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మంత్ర అన్ని థియేటర్లలో ఫుల్ అటెండెన్స్ వేయించుకుంది. డిసెంబర్ 14న విడుదలయిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులలో రేకెత్తించిన అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో వివరాల్లోకి వెళితే…

కథ:
మంత్ర నిలయంలో అద్దెకి వెళ్ళిన వాళ్ళంతా అనుమానాస్పదంగా మరణిస్తూ ఉంటారు. ఆ మంత్ర నిలయం ఓనర్ అయిన మంత్ర (చార్మి) దానిని అమ్మి తనకున్న అప్పులు తీర్చుకుని మిగిలిన డబ్బులతో పాప్ స్టార్ అయ్యే ప్రయత్నాలు చేద్దామని అనుకుంటూ ఉంటుంది. కానీ అందులో అద్దెకు దిగిన వాళ్ళంతా చనిపోతూ ఉంటే మంత్ర నిలయం కొనేందుకు ఒక్కరు కూడా ముందుకి రారు. మంత్ర ఇవ్వాల్సిన అప్పు వసూలు చేసుకునేందుకు ఆమెకు అప్పిచ్చిన వ్యక్తి రౌడీలను ఆశ్రయిస్తాడు. మంత్ర వద్ద బాకీ వసూలు చేసేందుకు హీరో (శివాజీ) వస్తాడు. కానీ ఆమె కష్టాలు, మంత్ర నిలయం అమ్ముడు కాకపోవడం సంగతులు తెలిసి అది అమ్మడానికి సహకరించి, కమీషన్ తీసుకుందామని ఆశ పడతాడు. అక్కడేమీ అక్కడ ఎవరైనా మూడు నెలలు ఏ భయం లేకుండా ఉంటే దానిని కొంటానని ఒకడు పెట్టిన కండీషన్ ప్రకారం అక్కడ ఉండడానికి తానే సిద్ధపడి, మంత్ర నిలయానికి స్నేహితులతో కలిసి వెళ్తాడు హీరో. అయితే అక్కడకు వెళ్ళిన కొద్ది రోజులకే  వారిలో ఒకడు (చిత్రం శ్రీను) బిల్డింగ్ పైనుంచి పడి చనిపోతాడు. ఇక అక్కడ ఏముందనే కూపీ లాగడం మొదలు పెడతాడు హీరో. ఆ తర్వాత ఏమీ జరిగింది, ఏమీ తేలింది అన్నది చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది కనుక సినిమా చూడాల్సిందే.
కథనం:

హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో కూడా సస్పెన్స్, హారర్ చిత్రాల్లో మూల కథ చాలా సార్లు ఒకటే ఉంటుంది. మంత్ర కూడా అదే కోవకు చెందిన రొటీన్ కథ. అయితే దీనిని దర్శకుడు తెరకెక్కించిన విధానం ఆకట్టుకునేలా సాగింది. సీరియస్ కథలో హాస్యానికి చోటిస్తూ అతను రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రథమార్ధంలో బాగా పండింది. సస్పెన్స్, హారర్ మిస్ అవకుండానే ఎంటర్‌టైన్‌మెంట్ సైతం విడిచి పెట్టలేదతను. దీనివలన అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించినప్పటికీ ప్రథమార్ధం ఆకట్టుకుంది. సస్పెన్స్ ముడి విప్పాల్సిన ద్వితీయార్ధంలోనే అతను కాస్త తడబాటుకి గురయ్యాడు. అయినా ద్వితీయార్థంలో కూడా కొన్ని ఆసక్తి రేకెత్తించే అంశాలు ఉండడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. కథ చెప్పే విధానంలో ప్రతిభ కనబరచడం వలన నెక్స్ట్ ఏమీ జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఆడియన్స్ మైండ్ ఎప్పుడూ మరో అంశం మీద కేంద్రీకృతమయ్యేలా చేసి, చివరకు వేరే విధంగా సినిమాను ముగించాడు. అయితే అంత వరకు మెయింటైన్ చేసిన సస్పెన్స్‌కి తగ్గ ముగింపు మాత్రం ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ సస్పెన్స్ చిత్రాలను ఇష్టపడే వారికి మంత్ర నచ్చుతుంది.
పాత్రధారుల ప్రతిభ:

ఇందులో శివాజీ హీరో అనే అంశాన్ని గోప్యంగా ఉంచారు. ప్రధానంగా చార్మినే ఫోకస్ చేశారు. అయితే కథానాయక పాత్రలో శివాజీ చాలా ఈజ్‌తో నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకున్నాయి. చార్మి కంటే శివాజీనే ఎక్కువ స్కోర్ చేశాడు కూడా. చార్మి ఎప్పటిలానే అందంగా ఉంది. నటనకు అవకాశమున్న సన్నివేశాల్లో రాణించింది. ఒక పాటలో ఆమె డాన్స్, కాస్టూమ్స్ యువతకు బాగా నచ్చేస్తాయి. కౌషా కూడా ఒక హాట్ సాంగ్‌లో నటించి మెప్పించింది. మల్లికార్జున రావు, విజయ్ సాయి, జీవా, చిత్రం శ్రీను తదితరులంతా తమ నటనతో సినిమాకు బాగా హెల్ప్ అయ్యారు.
టెక్నీషియన్ల పనితనం:
దశరథ్ కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా అంతా ఒక మూడ్ క్రియేట్ చేయగలిగాడు లైటింగ్ స్కీంస్‌తో. ఆనంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరో ఎస్సెట్. రెండు పాటలు కూడా ఉన్నాయి. వాటిని కూడా బాగా కంపోజ్ చేశాడు. ఉపేంద్ర ఎడిటింగ్, సత్యనారాన ఆర్ట్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. మాటల రచయిత సురేంద్ర కృష్ణ చిన్న చిన్న డైలాగులతో మెప్పించారు. తులసీ రామ్ రచయితగా, దర్శకుడిగా రాణించాడు. అక్కడక్కడా కథనంలో బిగి కొరవడింది కానీ ఓవరాల్‌గా మంచి ఎఫర్ట్. మరింత రాటు దేలితే ఇతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది.
ప్లస్‌లు, మైనస్‌లు:

చిన్న బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం ఓపెనింగ్స్ పెద్ద చిత్రాలకు ధీటుగా తెచ్చుకుంది. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తక్కువ.  సిటీస్ నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించవచ్చు. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి గుడ్ చాయిస్. మంచి పబ్లిసిటీతో ఈ చిత్రంతో డీసెంట్ ప్రాఫిట్స్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే మున్ముందు రానున్న భారీ చిత్రాల తాకిడి ని ఈ చిత్రం ఎంత వరకు తట్టుకు నిలబడగలదో చూడాలి.
శ్రీనిధి

Give your rating:

We would like to hear your comments below: