బాలీవుడ్ తార, టీవీ ప్రోగ్రామ్ ‘ఎక్స్ట్రా ఇన్నింగ్స్’తో క్రికెట్ ప్రేమికులను అలరించిన మందిరాబేడిని తెలుగులో నటింప జేసేందుకు ఆమధ్య ప్రయత్నాలు జరిగాయి. కూచిపూడి వెంకట్ రూపొందిస్తున్న ‘జాన్ అప్పారావ్ 40+’లో హీరోయిన్ పాత్రకి మొదట సంప్రదించింది ఆమెనే. ఆమె కూడా అందులో నటించేందుకు ఆసక్తి చూపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తెలీని కారణాలవల్ల ఆమె స్థానంలో సిమ్రాన్ వచ్చింది. తాజాగా మరో సినిమా కోసం మందిరను ఓ నిర్మాత సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అదీ శ్రీకాంత్ సరసన అనేది సమాచారం. బెంగుళూరుకు చెందిన శ్రీకాంత్ స్నేహితులు అతనితో ఓ సినిమాని నిర్మించాలని కొంతకాలంగా యత్నిస్తున్నారు. వారిలో ఒకరి పేరు దొడ్డప్ప అని తెలియ వచ్చింది. ‘ఆపరేషన్ దుర్యోధన’ రాకముందు నుంచే వారు ఆయనతో సినిమా తీయడం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని ఓ కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. ఇందులో మందిర హీరోయిన్ అయితే ప్రాజెక్ట్‌కి క్రేజ్ వస్తుందని భావించిన వారు ఆమెని సంప్రదిస్తున్నట్లు అంతర్గత వర్గాల భోగట్టా. తమిళంలో శింబు సరసన ‘మన్మథన్’లో తన అందాలతో అలరించిన మందిర తెలుగులో నటిస్తుందా? చూద్దాం.