‘లక్ష్మీపుత్రుడు’కి కాసులు రాలడం కష్టం!
కోల్పోయిన ఇమేజ్‌ని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో వున్న ఉదయ్‌కిరణ్ ఈ మధ్యనే ‘వియ్యాలవారి కయ్యాలు’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అది అతనికి నిరాశని కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఫిబ్రవరి 29న ‘లక్ష్మీపుత్రుడు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బేసికల్‌గా ఇది తమిళంలో ‘వంబు సందై’ పేరుతో ప్రారంభమైంది. మధ్యలో నిర్మాత పోలిశెట్టి రాంబాబు రంగం మీదికొచ్చి తెలుగు హక్కులు తీసుకున్నాక తెలుగు సినిమాగా కనిపించాలనే ఉద్దేశంతో బ్రహ్మానందం ఎపిసోడ్‌తో పాటు గౌతమ్‌రాజు, దువ్వాసి మోహన్ వంటి ఇద్దరు ముగ్గురు తెలుగు నటుల్ని పెట్టి కొన్ని సన్నివేశాల్ని తీశారు. అయినప్పటికీ ఆద్యంతం ‘లక్ష్మీపుత్రుడు’ సినిమా తమిళ వాసన వేస్తుంది. ఎక్కువమంది తారలు తమిళులు కావడం, కథ జరిగే వాతావరణం దానికి కారణం. రాజశేఖర్ హీరోగా నటించిన ‘బొబ్బిలి వంశం’ సినిమాలో విలన్‌గా నటించిన రాజ్‌కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. అంతేకాదు హీరోయిన్ అన్నగా ఒక పోలీసాఫీసర్ పాత్రలో దర్శనమిస్తాడు కూడా.
కథ:
ప్రభాకర్ (ఉదయ్‌కిరణ్) ఆవేశపరుడైన యువకుడు. ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని కొట్టడం, మెంటల్ ఆసుపత్రిలో డాక్టరైన ఆతని తండ్రి వచ్చి జామీను మీద విడిపించుకు పోవడం.. ఇదీ అతని దిన చర్య. అతగాడు శ్వేత (దియా) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరుపొందిన ఒక పోలీసాఫీసర్ (రాజ్‌కపూర్) చెల్లెలు. ఆమె వల్ల ఆమె అన్నకూ, ప్రభాకర్కీ మధ్య గొడవలవుతాయి. ఆ సమయంలోనే తాను డాక్టర్ కొడుకుని కాదనీ, తన కన్నతండ్రి పిచ్చాసుపత్రిలో పిచ్చివాడిగా వున్నాడనే నిజం తెలుస్తుంది ప్రభాకర్‌కి. దాంతో తండ్రిని మామూలు మనిషిని చేయడానికి కంకణం కట్టుకుంటాడు. కేరళలోని ఒక ఆయుర్వేద చికిత్సాలయంలో చేర్పిస్తాడు. అక్కడే తన తండ్రి కథ అతడికి తెలుస్తుంది. తన తల్లి ఎందుకు చనిపోయిందో, తండ్రి ఎందుకు పిచ్చివాడయ్యాడో తెలుస్తుంది. ప్రభాకర్ తండ్రి లక్ష్మీనారాయణ (సత్యరాజ్) నిజాయితీ పరుడైన ఎలక్షన్ ఆఫీసర్. అతని నిజాయితీ కారణంగా ఒక ఉప ఎన్నికలో మంత్రి రామరాజు (విజయన్) నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోతాడు. ఆ ఎన్నికల్లో ఓడిపోతే ఊళ్లో చీర కట్టుకుని తిరుగుతానని చేసిన సవాలు మేరకు ఆ పని చేస్తాడు రామరాజు. పగతో రగిలిన అతను లక్ష్మీనారాయణ తల్లిని చంపేస్తాడు. లక్ష్మీనారాయణ, అతని భార్యని చంపించేందుకు యత్నిస్తాడు. ఆ క్రమంలో లక్ష్మీనారాయణ తలకు బలమైన దెబ్బ తగిలి పిచ్చివాడైతే, అతని భార్య బిడ్డని కని చనిపోతుంది. ఈ నిజాలు తెలిసిన ప్రభాకర్ ఏంచేశాడు? అతని కుటుంబానికి అన్యాయం చేసిన రామరాజు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో వున్నాడు? ప్రభాకర్ అతనిమీద ప్రతీకారం తీర్చుకున్నాడా?.. అనే ప్రశ్నలకు సమాధానం మిగతా సినిమా.
కథనం:
‘లక్ష్మీపుత్రుడు’ పాత చింతకాయ పచ్చడి కథతో తయారైన సినిమా. తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు పగ తీర్చుకునే సినిమాలు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన కొడుకు వేరేవాళ్ల వద్ద పెరిగి, తర్వాత అసలు తల్లిదండ్రుల వద్దకు చేరే సినిమాలు తెలుగులో ఎన్ని వచ్చి వుంటాయి! ‘లక్ష్మీపుత్రుడు’ సరిగ్గా అలాంటి సినిమాయే. హీరో హీరోయిన్ల పాత్రల చిత్రణ, సన్నివేశాల తీరుతో ఫస్టాఫ్ తలనొప్పి కలిగిస్తుంది. హీరో చేసే పని ఎవర్నో ఒకర్ని కొట్టడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్లడం. హీరోయిన్ చేసే పని కాలేజీ ఎగ్గొట్టి స్నేహితురాళ్లతో సినిమాలకీ, షికార్లకీ తిరగడం. ఇక వీళ్ల మధ్య పుట్టే ప్రేమలో కనీస స్థాయి సున్నితత్వం వుండదు. ప్రేమకుండే మధుర భావన వారిలో ఏ కోశానా కనిపించదు. ప్రేమించమంటూ హీరోని హీరోయిన్ బలవంత పెడుతుంది. రాత్రివేళ గోడలుదూకి హీరో బెడ్రూమ్లో దూరి, అతడి మీద కూర్చుని ‘ఐ లవ్ యు’ చెబుతావా, లేదా అని బెదిరిస్తుంది. హీరో ఎలాంటి ప్రేమనీ ప్రదర్శించకుండా ‘ఐ లవ్ యు’ అనేస్తాడు. ఇంత మోటు ప్రేమికులు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోగలుగుతారు?
ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది సెకండాఫ్‌లో అరగంట సేపు వచ్చే సత్యరాజ్ ఎపిసోడ్. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణగా ఆయన పాత్రని దర్శకుడు ఆకర్షణీయంగా మలిచాడు. మంత్రి రామరాజు, ఆయన మధ్య వచ్చే సన్నివేశాల వంటివి గతంలో చాలా సినిమాల్లో చూసివున్నప్పటికీ, ఆ సన్నివేశాల్లో క్యారీ అయ్యే ఎమోషన్ ఆకట్టుకుంటుంది. సత్యరాజ్ పిచ్చివాడిగా మారాక ఆయన కనిపించే సన్నివేశాల్ని వినోదాత్మకంగా మలిచి దర్శకుడు తెలివైన పనే చేశాడు. అలా కాకుండా వాటిని పేథటిక్గా చూపిస్తే సినిమాలో బరువు పెరిగిపోయేది. అది సినిమాకి చాలా నష్టం కలిగించి వుండేది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం బాగా అసంతృప్తి కలిగించాయి. సత్యరాజ్‌కి పిచ్చిబాగై అప్పుడు ఆయన పగ తీరినట్లు చూపిస్తే ఎఫెక్టివ్‌గా ఉండేది. అలా చేయకపోవడం, పైగా విలన్లు అంతమయ్యే తీరు ప్రేక్షకులని నిరాశపరుస్తుంది. దర్శకుడు రాజ్‌కపూర్ స్వయంగా ఒక పోలీసాఫీసర్ పాత్రని చేశాడు. ఫస్టాఫ్‌లో ఆ పాత్ర కనిపించే తీరు, హంగామా చూసి, దానికి సినిమాలో ఇంపార్టెన్స్ వుంటుందని అనుకుంటాం. కానీ ఆ పాత్ర సెకండాఫ్‌లో ఒక్కసారి కూడా కనిపించదు. అలాంటప్పుడు ఆ పాత్రకి అంత బిల్డప్ అవసరమా.. అనిపిస్తే అది మన తప్పుకాదు. రామరాజు కొడుకుగా చేసిన రియాజ్‌ఖాన్ పాత్ర చిత్రణలో దర్శకుడు తప్పుటడుగులు వేశాడు. ఒక సన్నివేశంలో నీళ్లల్లో మునిగిపోతున్న సత్యరాజ్‌ని కాపాడటంవల్ల ప్రేక్షకులకి అతడిమీద సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. అలా చేయడం సరైన పనికాదు. అది స్క్రీన్‌ప్లేలో దొర్లిన లోపం. అంతేకాదు.. సత్యరాజ్, విజయన్.. ఇద్దరూ పిచ్చివాళ్లవడం కూడా సినిమాకి నష్టాన్ని చేకూర్చేదే. దానివల్ల క్లైమాక్స్ పిచ్చివాళ్ల క్లైమాక్స్‌గా మారిపోయి, చికాకు కలిగిస్తుంది. బ్రహ్మానందం, రఘుబాబు కాంబినేషన్‌తో చేసిన ‘శివాజి’ ఎపిసోడ్ హాస్యానికి బదులు అపహాస్యాన్నే ఎక్కువగా కలిగించింది. అసలు వారి ఎపిసోడ్ లేకపోయినా సినిమాకు వచ్చిన నష్టం ఏమీలేదు. నిర్మాత అనవసరంగా దానికోసం ఖర్చుపెట్టారు.
పాత్రధారుల అభినయం:
ప్రభాకర్‌గా ఉదయ్‌కిరణ్ పరిధుల మేరకు నటించాడు. ఫస్టాఫ్‌లో కంటే సెకండాఫ్‌లోనే అతను కాస్త మెరుగనిపిస్తాడు. పాత్ర తీరువల్ల అతను ఆకట్టుకునేది తక్కువే. హీరోయిన్ దియా గురించి వీలైనంత తక్కువ చెప్పుకోవడం మంచిది. ఆమె పాత్రలో లేకితనం ఎక్కువ కావడంవల్ల ఆమె ఏమాత్రం ఆకట్టుకోదు. గ్లామర్ పరంగాకూడా ఆమెకు పాస్‌మార్కులు రావు. అందరికంటే ఎక్కువగా ఆకట్టుకునేది, నిస్సందేహంగా సత్యరాజ్. ఎలక్షన్ ఆఫీసర్‌గా హుందాగా నటించిన ఆయన మతిచెడిన మనిషిగానూ ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలకి విజయన్, రియాజ్‌ఖాన్ న్యాయం చేశారు. చిత్రంగా బ్రహ్మానందం, రఘుబాబు నవ్వించలేక పోయారు. కేరళ ఆయుర్వేద వైద్యునిగా రాజన్ పి. దేవ్ సరిపోయాడు.
టెక్నీషియన్ల పనితనం:
శశాంక్ మాటలు కొన్ని సందర్భాల్లో.. ప్రత్యేకించి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆకట్టుకున్నాయి. మతిచెడిన సత్యరాజ్ నోట పలికించిన మాటలూ మెప్పిస్తాయి. ముమైత్‌ఖాన్ మీద చిత్రించిన పాట సహా ఏ పాటా ఆకట్టుకోలేదు. సాహిత్యం వినిపించలేదు. సురేష్ దేవన్ సినిమాటోగ్రఫీ కూడా అసంతృప్తి కలిగించింది. చాలా సన్నివేశాల్లో లైటింగ్ కంటిని ఇబ్బంది పెట్టింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్‌ని ఎందుకు బ్లర్ చేశారో అర్ధం కాలేదు. పాటల చిత్రీకరణ కూడా బాగోలేదు. దినేష్ కూర్చిన ఫైట్లలో వైర్ వర్క్ ఎక్కువైంది.
బలాలు, లోపాలు:
సత్యరాజ్ పాత్ర, ఆయన నటన, సెకండాఫ్‌లో వచ్చే ఫ్ల్యాష్‌బ్యాక్ ఎపిసోడ్, కొన్ని సందర్భాల్లో మాటలు బలాలు. పాత చింతకాయ కథ, హీరో హీరోయిన్ల పాత్రల చిత్రణ, ఆకట్టుకోని సంగీతం, సినిమాటోగ్రఫీ లోపాలు. మొత్తంగా కొద్ది శాతం మందిని మాత్రమే ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలున్నాయి.
…యజ్ఞమూర్తి