Krishnavamsy to direct Tarun?

విష్ణు హీరోగా కృష్ణవంశీ రూపొందించ తలపెట్టిన ‘జెండాపై కపిరాజు’ ప్రాజెక్టు.. స్క్రిప్టు విషయంలో మోహన్‌బాబు, కృష్ణవంశీ మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా మరో ప్రాజెక్ట్ సంగతి తెరపైకి వచ్చింది. అది తరుణ్‌తో కృష్ణవంశీ సినిమా. టాలీవుడ్ అంతర్గత వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ కాంబినేషన్‌తో సినిమాను సుంకర మధుమురళి నిర్మించనున్నారు. మధుమురళి ఇదివరకు ‘మనోహరం’, ‘ఖడ్గం’, ‘పల్లకిలో పెళ్లికూతురు’, తెలుగు ‘యువ’, ‘డేంజర్’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు తను తీసిన ప్రతి సినిమాతోనూ వార్తల్లోకెక్కే కృష్ణవంశీ వరుస ఫ్లాపుల తర్వాత ‘చందమామ’తో ఎట్టకేలకు విజయాన్ని సాధించాడు. అదే సినిమాతో నవదీప్, శివబాలాజీ, కాజల్, సింధు మీనన్‌లకు గుర్తింపు తెచ్చాడు. మరోవైపు ‘నవ వసంతం’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరుణ్‌కు సరైన సక్సెస్ లభించలేదు. ‘నవ వసంతం’ బిలో యావరేజ్‌గా ఆడితే, ఇటీవలి ‘భలే దొంగలు’ యావరేజ్ అయ్యింది. ఇలాంటి స్థితిలో కృష్ణవంశీ నుంచి ఆఫర్ రావడం అతనికి ఆనందాన్ని కలిగిస్తోంది. ‘చందమామ’తో నవదీప్‌కు బ్రేక్ వచ్చినట్లు తనకు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ వస్తుందని తరుణ్ ఆశిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే అది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం ఖాయం. 

We would like to hear your comments below: